ఇద్దరు మంత్రులకు అ, ఆ లు కూడా రావు: రోజా | YSRCP Leader RK Roja Slams Chandrababu In Tanuku | Sakshi
Sakshi News home page

ఇద్దరు మంత్రులకు అ, ఆ లు కూడా రావు: రోజా

Published Sat, Dec 1 2018 6:51 PM | Last Updated on Sat, Dec 1 2018 8:07 PM

YSRCP Leader RK Roja Slams Chandrababu In Tanuku - Sakshi

ఏపీని విభజించి నాశనం చేసిన కాంగ్రెస్‌తో కలిసిపోయిన సిగ్గుమాలిన నేత చంద్రబాబు..

తణుకు: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు క్యాబినేట్‌లో ఉన్న ఇద్దరు మహిళా మంత్రులకు అ, ఆ లు కూడా రావని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన మహిళా సదస్సులో రోజా మాట్లాడుతూ..చింతమనేని రౌడీయిజంపై సీఎం చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్‌ దాడి చేస్తే సీఎం చంద్రబాబు సెటిల్‌ మెంట్‌ చేసి సెటిల్‌మెంట్‌ మినిస్టర్‌  అనిపించుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు జరుగుతున్నా ఇద్దరు మహిళా మంత్రులు కూడా మాట్లాడలేని దద్దమ్మల్లా మిగిలిపోయారని తూర్పారబట్టారు.

అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా లాంటి కాలకేయులు చంద్రబాబు క్యాబినేట్‌లో ఉన్నారని, అది కాలకేయుల క్యాబినేట్‌ అని దుయ్యబట్టారు. ఏపీలో ఇసుక నుంచి మట్టి వరకు అన్నింటా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వనిదే ప్రజలకి ఏ పనీ జరగడం లేదని ధ్వజమెత్తారు.  ఏపీలో సమస్యలను గాలికి వదిలేసి తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు తిరుగుతున్నారని  అన్నారు. ఏపీని విభజించి నాశనం చేసిన కాంగ్రెస్‌తో కలిసిపోయిన సిగ్గుమాలిన నేత చంద్రబాబు అని తీవ్రంగా విమర్శించారు. ఏపీని నాశనం చేసిన కాంగ్రెస్‌తో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందో చెప్పాలన్నారు.



దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎం చంద్రబాబు అని జూన్‌లో కాంగ్రెస్‌ నాయకులు చార్జిషీటు విడుదల చేశారు..ఇప్పుడు అదే అవినీతి సీఎం చంద్రబాబును కాంగ్రెస్‌ కలుపుకోవడం చూస్తుంటే రాహుల్‌ ఎంత రాజకీయ అజ్ఞానో అర్ధమవుతుందన్నారు. చంద్రబాబుని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పోలీసులు అధికార పార్టీకి బౌన్సర్లుగా మారారని, తణుకులో ఎస్‌ఐ స్థాయి అధికారిని ఎమ్మెల్యే రాధాకృష్ణ నేలపై కూర్చోబెట్టి దౌర్జన్యం చేస్తే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా ఎస్‌ఐని బదిలీ చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు.  వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం వెనక ఎవరున్నారో అందరికీ అర్ధమైందని చెప్పారు. నారా వారి నరకాసుర పాలనకు పుల్‌స్టాప్‌ పెట్టే రోజు వచ్చిందని, మిమ్మల్ని బంగాళా ఖాతంలో కలపడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని వ్యాక్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement