‘10 రోజులైంది; ఇంతలోనే ఇన్ని ఆరోపణలా బాబు’ | YSRCP Leader Ummareddy Venkateswarlu Fires On Chandrababu Over His Allegations | Sakshi
Sakshi News home page

సీఎంగా నీ హద్దు ఎరిగి ప్రవర్తించాల్సింది : ఉమ్మారెడ్డి

Published Tue, Jun 11 2019 2:34 PM | Last Updated on Tue, Jun 11 2019 6:12 PM

YSRCP Leader Ummareddy Venkateswarlu Fires On Chandrababu Over His Allegations - Sakshi

సాక్షి, విజయవాడ : తొలి కేబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ప్రజలంతా హర్షిస్తుంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ...తొలి కేబినెట్‌ సమావేశం విజయవంతంగా జరిగిందని తెలిపారు. భవిష్యత్‌ కార్యాచరణపై మంత్రులు, అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ను తమ కష్టాలు తీర్చే నేతగా జనమంతా భావిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ఆరోపణలతో వారిని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసే ముందు చంద్రబాబు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

సీఎంగా జగన్‌ పగ్గాలు చేపట్టి ఎన్నిరోజులైంది?
‘చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి హోదాను ఆరోపణలతో ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధిని ఆపొద్దు అని చంద్రబాబు అన్నారు. అసలు సీఎంగా జగన్‌ పాలనా పగ్గాలు చేపట్టి ఎన్నిరోజులైంది. ఎన్నికల కోడ్‌ చివరి రోజు దాకా కేబినెట్‌ మీటింగ్‌లు జరిపి చెల్లింపులు చేసింది మీరు కాదా? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు మాత్రమే రివ్యూలు చేసే అవకాశం ఉన్నా.. తుపాను వచ్చిన నాలుగురోజులకు చెల్లింపులు జరిపింది నిజం కాదా? నైతికత వీడి, బాధ్యత మరచి ఇప్పుడు నూతన ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. ఇక సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది... ప్రాజెక్టులను ఆపడం భావ్యం కాదంటూ చంద్రబాబు సూచించారు. అసలు రాయలసీమలో ప్రాజెక్టులు చేపట్టింది ఎన్టీఆర్‌. ఆ తర్వాత జలయఙ్ఞంలో భాగంగా వైఎస్సార్‌ అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ఏనాడు ఒక్క ప్రాజెక్టును ఆరంభించింది లేదు. కానీ వాటి వ్యయ అంచనాలను మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఈరోజు సీఎం జగన్‌ వాటిని సమీక్షిస్తామంటే ఆయనకు రుచించడం లేదు. తన ప్రభుత్వంలోని అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని చంద్రబాబు భయపడుతున్నారు.

అదేవిధంగా తన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన రుణమాఫీ హామీ చివరి రెండు విడతలు కొత్త ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతున్నారు. అది మీ వ్యక్తిగత హామీ. సీఎంగా మీ హద్దు ఐదేళ్లు మాత్రమే. అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సింది. ఆలోపు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ఇప్పుడు విమర్శలు చేయడమేంటి? అయినా రూ. 87 వేల కోట్ల రైతు రుణాలను కమిటీల పేరిట 24 వేల కోట్లకు కుదించారు. అవి కూడా సక్రమంగా విడుదల చేయలేదు. అయినా సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టి పది రోజులు కూడా కాకముందే ఇన్ని ఆరోపణలు చేస్తారా. మీ 40 ఏళ్ల అనుభవం ఇదేనా’ అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు  చంద్రబాబు తీరును ఎండగట్టారు.

కోడికత్తి అని హేళన చేశారు..
‘టీడీపీ కార్యకర్తల పై దాడులు జరుగుతున్నాయి అని చంద్రబాబు అంటున్నారు. టీడీపీ హయాంలో జరిగిన దాడులు, హత్యలపై ఒక్క విచారణ అయినా జరిపారా? అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై దాడి జరిగితే కోడి కత్తి అని అవహేళన చేశారు. మ్యానిఫెస్టోలోని నవరత్నాలను సెక్రటేరియట్‌లో పెట్టించిన వ్యక్తి సీఎం జగన్‌మోహన్ రెడ్డిని ప్రజలు ప్రశంసిస్తున్నారు. కానీ మ్యానిఫెస్టోని వెబ్‌సైట్ నుంచి తొలగించిన వ్యక్తి చంద్రబాబు. విశ్వసనీయత లోపించింది కాబట్టే మ్యానిఫెస్టోని తీసేశారు. పోలవరం పేరు చెబితే  ఎందుకు మీకు అంత కలవరం? కాగ్ పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని తేల్చింది. ఐదు సంవత్సరాలలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుంది. రివర్స్ టెండరింగ్ అంటే మీకు ఉలుకు ఎందుకు? కరకట్ట దగ్గర అక్రమ కట్టడాలు అని చెప్పిన చంద్రబాబు..జిల్లా కలెక్టర్‌తో అక్కడ వుండే వారికి నోటీసులు ఇచ్చారు. మీ జలవనరుల శాఖ మంత్రి 21 కట్టడాలను తొలగిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ఆచరణకు నోచుకోలేదు...రూ. 4.3 కోట్లు పెట్టి అక్రమమైన స్థలంలో ప్రజావేదిక కట్టారు. గ్రీన్ ట్రిబ్యునల్ రూ. 100 కోట్లు జరిమానా వేసినా ఖాతరు చేయలేదు. చివరకు బ్రిటిష్ చట్టాలను సైతం బేఖాతరు చేశారు. కరకట్టను సైతం షిఫ్ట్ చేసే సరిపోతుందని ప్రపోజల్ పెట్టిన వ్యక్తులు చంద్రబాబు, లోకేష్. సామజిక కార్యకర్తలు మేధా పాట్కర్, వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ సైతం పర్యటించి కృష్ణా నది లో ఇసుక తవ్వకాలపై ప్రమాద గంటికలు ఉన్నాయని హెచ్చరించారు. కృష్ణానదిని ఆక్రమించి కొత్త హైలాండ్ నిర్మించాలని కుట్ర చేశారు. చంద్రబాబు. ప్రజావేదికను తనకు కేటాయించమనడం దుస్సాహసమే. అక్రమ కట్టడాలపై మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తే మరోసారి ఎన్నికల్లో భంగపాటు తప్పదు’ అని చంద్రబాబు పాలనా తీరుపై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement