
సాక్షి, అమరావతి : విశాఖపట్నం జిల్లాలో టీడీపీ భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరిన్ని ఆసక్తికర చేరికలు ఉండబోతున్నాయని వెల్లడించారు. అధికారం కోల్పోయాక కూడా చంద్రబాబు తీరు మార్చుకోలేదని, దీంతో టీడీపీ నేతలు విసిగిపోతున్నారని చెప్పారు.
ఇక రాజధాని అమరావతి విషయంలో అస్పష్టత ఏమీ లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజధానిలో ఉన్న కష్టనష్టాలు సరిచేస్తామని స్పష్టం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దంద్వ వైఖరితో మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని చెప్పిన వ్యక్తి, నేడు యూటర్న్ తీసుకుని మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని చురకలంటించారు. చంద్రబాబు యూటర్నులు తీసుకున్నట్టే పవన్ కూడా రాజధాని విషయంలో యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment