పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
సాక్షి, గుంటూరు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు బినామీలపై ఐటీ సోదాలు జరిగిన ఆయన ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో చంద్రబాబు ఆయన సన్నిహితుల అవినీతి బండారం బట్టబయలు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబు అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరగాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాజధానిలో టీడీపీ ప్రభుత్వం చేసిన వేల కోట్ల అవినీతిని కూడా బయటకు తీయాలి అని కోరారు. అక్రమాలు బయటకు రాకూడదనే చంద్రబాబు కృత్రిమ ఉద్యమం నడుపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు మద్దతిచ్చే పార్టీలు పునరాలోచన చేసుకోవాలని సూచించారు. అవినీతి పరుడికి ఎందుకు మద్దతు ఇస్తున్నారో ఆయా పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అవినీతి వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు మరొక అంశాన్ని చంద్రబాబు తెరమీదికి తెస్తారని.. అయితే అలాంటి జిమ్మిక్కులకు కాలం చెల్లిందని తెలిపారు. (చదవండి : రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం!)
నిప్పునంటూ బాబు డబ్బాలు కొట్టుకున్నారు : గోపిరెడ్డి
నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నిజాయితీపరుడయితే ఐటీ కేసుపై విచారణ ఎదుర్కోవాలని సవాలు విసిరారు. అవినీతి, అక్రమాలకు పాల్పడటం కోర్టుల నుంచి స్టే తెచ్చుకోవటం చంద్రబాబుకు అలవాటేనని గుర్తుచేశారు. బయట మాత్రం నిప్పునంటూ చంద్రబాబు డబ్బాలు కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిపై ఆయనకు మద్దతు ఇస్తున్న సీపీఐ, సీపీఎం, పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుపై విచారణ జరపాలని ఆ పార్టీలు కూడా డిమాండ్ చేయాలన్నారు. (చదవండి : మరో పచ్చ '420')
ఓట్ల కొనుగోలుకు ఆద్యుడు చంద్రబాబు : కాసు మహేష్‌రెడ్డి
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. 1994 నుంచే డబ్బుతో రాజకీయాలు చేసిన బాబు.. ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు ఆద్యుడు అని అన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లోనే రూ. 2 వేల కోట్లుంటే.. బాబు ఖాతాలో ఎంతుందో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. బాబు అవినీతిలో పవన్ కల్యాణ్‌కు కూడా భాగం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు.
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. అమరావతి స్కామ్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. తాము చెప్పినట్టే చంద్రబాబు అవినీతి బయటపడుతుందని గుర్తుచేశారు. చంద్రబాబు అవినీతిపై సీబీఐ, ఈడీలతో లోతైన విచారణ జరిపించాలని కోరారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి బట్టబయలైందని తెలిపారు. నిప్పు అని చెప్పుకునే బాబు.. ఇప్పుడేం చేస్తారని ఎద్దేవా చేశారు. ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. బాబుకు ఐదేళ్లు టైమిస్తే రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిపై సీబీఐ, ఈడీ కూడా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.(చదవండి : చంద్రబాబు అవినీతి బట్టబయలు)
Comments
Please login to add a commentAdd a comment