
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికార టీడీపీ వర్గాలు స్పందించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. డీజీపీ ఆర్పీ ఠాకూర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందనే నమ్మకం లేకపోవడంతో థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్‌పై జరిగిన దాడి, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు కేంద్రంలోని పెద్దలకు వివరించేందుకు పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లారు.
ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నాయకులు.. బుధవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరినీ కలిసి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటన వివరాలను ఆయనకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, కేసును పక్కదారి పట్టిస్తున్న వైనాన్ని ఏచూరికి తెలిపారు. కాగా, ఈ కేసు కేంద్రం పరిధిలో ఉందని చంద్రబాబు చెప్పడంతో.. కేంద్రం ఏం చేయగలదో అది చేస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారనీ, తమ విజ్ఞప్తికి రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించారని పార్టీ నేతలు వెల్లడించారు. ఏచూరీని కలిసిన వైఎస్సార్సీపీ బృందంలో బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వరప్రసాద్, సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment