
సాక్షి, విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణులు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్‌సీపీ మొదటినుంచీ పోరాడుతోందన్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణులు గురువారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారు. నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా సంజీవని కాదు అన్నారు. సదస్సులు నిర్వహించి ఏపీకి హోదా అక్కర్లేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పడానికి సీఎం చంద్రబాబు విఫలయత్నాలు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి జరిగే మేలును అనేక పోరాటాల ద్వారా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమల్లో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం జననేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో చివరివరకూ పోరాడుతామని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణులు అన్నారు.