
సాక్షి, అనంతపురం: రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే అది జగనన్నతోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం శాసనసభ అభ్యర్థి ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు. గురువారం జిల్లాలోని కళ్యాణదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో ఉషశ్రీ ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ.. ‘నాపై నమ్మకం పెట్టి ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు జగనన్నకు కృతజ్ఞతలు. జగనన్న ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తాను. మాది చాలా వెనుకబడిన నియోజకవర్గం. ఇక్కడికి జగనన్న సాయంతో నీరు తీసుకువస్తాం. ప్రత్యేక హోదాతో తిమ్మసముద్రంలో పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పిస్తాం. మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుంటాం. కళ్యాణదుర్గం దశ దిశ నిర్ణయించాలని జగన్నను కోరుతున్నాను. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు.. ఇలా ప్రతి ఒక్కరికి మేలు జరగాలంటే జగనన్న అధికారంలోకి రావాల’ని అన్నారు.