ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతోన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
అమరావతి: పనిగట్టుకుని వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఓట్లను టీడీపీ నేతలు తొలగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. అన్యాయంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్లను తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఓట్లు తొలగిస్తున్న వారి వివరాలను ఆధారాలతో సహా ఎన్నికల అధికారికి సమర్పించారు. చంద్రగిరి నియోజకవర్గంలో 14 వేల ఓట్లు ఓటర్లే స్వయంగా తొలగించాలని కోరినట్లు ఓట్లను టీడీపీ నేతలు తొలగించారని విమర్శించారు.
ఓట్ల తొలగింపు వ్యవహారంపై స్ధానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. సుమారు 13 వేల కొత్త దొంగ ఓట్లను చంద్రగిరి నియోజకవర్గంలో చేర్పించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బూత్‌కి కనీసం 100 నుంచి 150 ఓట్లు తొలగిస్తున్నారని చెప్పారు. తమ పార్టీకి అనుకూలంగా లేని కులాల వారి ఓట్లను తొలగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఓట్లను తొలగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి హామీ ఇచ్చారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment