సాక్షి, పెనుమూరు: చంద్రబాబు సీఎం కుర్చీపై పెట్టుకున్న ఆశలు వదులుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నారాయణస్వామి సూచించారు. శుక్రవారం ఆయన పెనుమూరు మండలం చిప్పారపల్లెలో స్థానిక విలేకర్లతో మాట్లాడారు. జూన్ 8 వరకు తానే సీఎం అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి కాదని ఆయనే ఒప్పుకున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెనుమూరు మండలంలో టీడీపీ నేతల భూ ఆక్రమణలపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామన్నారు.
ఎన్నికల రోజు పెనుమూరులో వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నేతలు మారణాయుధాలతో దాడి చేసిన పోలీసులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. పోలీసులు తీరుకు వ్యతిరేకంగా పెనుమూరులో త్వరలో ధర్నా చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 35 వేలు నుంచి 40 వేల మెజార్టీతో నారాయణస్వామి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని చెప్పారు.
బాధితులకు పరామర్శ
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతల దాడిలో గాయపడిన కారేటి సురేష్, కంచర్ల చక్రవర్తినాయుడిని శుక్రవారం చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డితో కలిసి ఎమ్మెల్యే నారాయణస్వామి పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment