సాక్షి, విజయవాడ : ఎస్సీ, ఎస్టీల వేధింపులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నాయకులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవడం హస్యాస్పదమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. దళితులు, గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి ఉందా? అని ప్రశ్నించారు.
సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడుల గురించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రపతికి ముందే లేఖ రాశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న వైఎస్ జగన్ లేఖను రాసినట్లు పేర్కొన్నారు.
దళిత రాష్ట్రపతికి వైఎస్ జగన్ పాదాభివందనం చేస్తే ఇదే టీడీపీ నేతలు విమర్శించిన విషయం గుర్తు లేదా? అని నిలదీశారు. దళితులను కించపరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఆది నారాయణ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యలు మాట్లాడితే కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు.
టీడీపీ అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లలో ఎస్సీ, ఎస్టీ నిధులు ఎంత ఖర్చు పెట్టారో కచ్చితంగా చెప్పగలరా? అంటూ ప్రభుత్వానికి సవాలు విసిరారు. టీడీపీ ప్రభుత్వంలో కులవివక్ష ఉండటం దారుణమని అన్నారు.
దళితులకు భూములు ఇవ్వకుండా, వారి వద్ద ఉన్న భూములను లాక్కున్న చరిత్ర టీడీపీది అని విమర్శించారు. రాజధానిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మిస్తామని ప్రభుత్వం ఊదరగొట్టిందని ప్రస్తుతం వాటి గురించి మాట కూడా మాట్లాడటం లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment