పెద్దదోర్నాల: పూటకో మాటతో, తడవకో అబద్ధంతో మభ్య పెడుతున్న మిమ్మల్ని ప్రజలెలా నమ్ముతారు బాబు అని సంతనూతలపాడు ఎమ్మెల్యే, యర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం రాత్రి మండల పరిధిలోని కటకానిపల్లెలో జరిగిన నిన్ను నమ్మం బాబు–2 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గ్రామమంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ చంద్రబాబు నాయుడును ప్రజలెలా నమ్ముతారు అని ప్రశ్నించారు.
ఇప్పుడు గుర్తుకు వచ్చారా బీసీలు..?
బీసీ వర్గాల సంక్షేమాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీసీలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని బీసీలకు సమ న్యాయం జరగాలంటే జగనన్న నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు.
ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు
అధికారంలోకి రాగానే పూర్తిగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, అందరికీ ఇళ్లు నినాదాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగున్నరేళ్లయినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకుండా ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. 2014 మోడీతో పొత్తు పెట్టుకుని సోనియాగాంధీని విమర్శించిన చంద్రబాబు నేడు మోడీని తిడుతూ రాహల్, సోనియా గాంధీ కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.
కమీషన్ల కోసం కక్కుర్తి
కమీషన్‌ల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టు అంచనాలను అమాంతం పెంచిన ముఖ్యమంత్రి వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులు తన అనుయాయులకు అప్పగించారన్నారు. ప్రాజెక్టు పనులను పూర్తి చేసి గడిచిన సంక్రాతికే నీరిస్తామన్న హామీని నిలబెట్టుకోలేని మిమ్మల్ని ప్రజలెలా విశ్వసిస్తారు బాబూ అంటూ ప్రశ్నించారు.
జగన్‌తోనే వెలిగొండ పూర్తి
జగన్‌మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి వస్తున్నారని, వైఎస్ జగన్ మోహనరెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, వెలిగొండ ప్రాజెక్టు జగన్‌తోనే పూర్తవుతుందన్నారు. ప్రజలు ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న మోసాలు గుర్తించాలని కోరారు. కటకానిపల్లెలో కార్యకర్తలు భారీ భైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే సురేష్ భారీ ర్యాలీతో గ్రామంలో పర్యటించి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అ«ధ్యక్షుడు జంకె ఆవులరెడ్డి, నూర్ బాషాల సంఘం తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు రసూల్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు లాలూనాయక్, నాయకులు దండా సుబ్బారెడ్డి, బొల్లేపల్లి సీతయ్య, నల్లబోతుల వెంకటేశ్వర్లు ,చిట్యాల లక్ష్మీరెడ్డి, యక్కంటి మల్లారెడ్డి, వెన్నా కాశిరెడ్డి, కర్రా మల్లారెడ్డి, వల్లభనేని పవన్‌కుమార్, అల్లు రాంభూపాల్‌రెడ్డి, గొల్మారి ఆంజనేయరెడ్డి, అలుగుల లక్ష్మయ్య, మాండ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment