సాక్షి, కర్నూలు : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. అభివృద్ధి పేరుతో 15 లక్షల కోట్లు చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు లైనింగ్ పనులు వెంటనే చేపట్టి పూర్తి చేసి, దిగువకు 22 వేల క్యూసెక్కులు విడుదల చేయాలని వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘునాథరెడ్డి, ఐజయ్య పరిశీలించారు.
11 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డి పాడును రాయలసీమ రైతుల కోసం 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని తెలిపారు. పోతిరెడ్డి పాడు నుంచి భానకచెర్ల వరకు కాల్వ లైనింగ్ పనులు పూర్తి చేస్తే 22 వేల క్యూసెక్కుల నీరు భానచెర్లకు అక్కడి నుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, వెలుగోడు రిజర్వాయర్‌కు నీరు వదిలే అవకాశం ఉన్నా ఏమీ పట్టకుండా మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలిపారు.
రాయలసీమకు నీరు తామే ఇచ్చామంటూ టీడీపీ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో గరిష్ట స్థాయిలో నీరు ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీరు విడుదల చేయడం లేదని అన్నారు. వైఎస్‌ఆర్ జిల్లా వాసులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇక వైఎస్‌ఆర్ కుటుంబానికి విశేష స్పందన లభిస్తోందని, ఈ కార్యక్రమాన్ని మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ వైఎస్‌ఆర్ కుటుంబంలో 75లక్షల మంది భాగస్వామ్యులు అయ్యారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment