సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రైతులందరికీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పి, చేసిన తప్పు ఒప్పుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. రైతులను మోసం చేసినందుకే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రైతుల రుణాలు ఎగ్గొట్టి ఇప్పుడు సిగ్గు లేకుండా తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ అయిదేళ్లలో రైతులకు ఇచ్చిన బాండ్లకు చంద్రబాబు డబ్బులు ఎందుకు చెల్లించలేదని రోజా సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబు హామీలు ఇచ్చి...వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయాలంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతుల విషయంలో ఇప్పటికైనా చంద్రబాబు తాను తప్పు చేసినట్లు అసెంబ్లీలో ఒప్పుకుంటే... ముఖ్యమంత్రి కచ్చితంగా నిర్ణయం తీసుకుంటారన్నారు. అధికారంలోకి వచ్చి పదిరోజులు కాకముందే టీడీపీ నేతల కడుపు మంట బయటపడుతోందని రోజా అన్నారు. ఇక గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతకు మైక్ కూడా ఇవ్వకుండా అవమానించారని, అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తారని రోజా అన్నారు. ఏ అంశంపైన అయినా ముఖ్యమంత్రి సమాధానం ఇస్తామని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment