సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: ప్రజల్లో జీరోగా మారిన టీడీపీని హీరోగా చూపించేందుకు చంద్రబాబు అనుకూల మీడియా నానా తంటాలు పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, చిర్ల జగ్గిరెడ్డి, సీదిరి అప్పలరాజు, బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి అంటూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, ఆ టీవీ ఛానళ్ళు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్ సమర్థవంతమైన నాయకత్వంలో ప్రజారంజకంగా సాగుతున్న ప్రభుత్వంపై నిత్యం తప్పుడు కథనాలను వండివారుస్తూ విషం చిమ్ముతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎల్లో మీడియాలో శనివారం వచ్చిన కథనాలపై వీరు వేర్వేరుగా ఘాటుగా స్పందించారు.
విలువలు లేని రాతలు: ఎమ్మెల్యేలు, ఎంపీ
► శనివారం నాటి ఈనాడు పత్రిక చూస్తే పత్రికా విలువలు లేకపోయాయి, కనీసం మానవతా విలువలైనా రామోజీరావుకు ఎందుకు లేకపోయాయో అందరూ ఆలోచించాలి.
► అధికార పార్టీలో అసంతృప్తి సెగలు అంటూ కొంతమంది ఎమ్మెల్యేల ఫొటోలు వేసి రాశారు. అసంతృప్తి ఉంటే గింటే 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెల్చుకుని 20 మంది కనపడుతూ, 10 మంది బయటకు పోవడానికి రెడీగా ఉన్న పార్టీ వారికి ఉండాలి. మాకెందుకు ఉంటుంది.
► ఏడాది అయింది.. ఏమీ చేయలేకపోయామని మేం అన్నామా? ఇటువంటి రాతలు రాయడానికి సిగ్గుండాలి. చంద్రబాబు అనే నరరూప రాక్షసుడిని సమర్థించే పత్రికలకు మా పరిపాలన నచ్చకపోతే అది వారి పర్సనల్ ప్రాబ్లెమ్. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరగని విధంగా కేవలం ఏడాది కాలంలో ఏకంగా రూ.41,719 కోట్లను 3.98 కోట్ల మందికి అందించినందుకు మేం అసంతృప్తిగా ఉన్నామా?
► అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలలోపే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు, అందులో 82 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాలకు అందించినందుకు అసంతృప్తిగా ఉన్నామా? 50 లక్షల మంది రైతులకు రెండు పర్యాయాల్లో రూ.10,209 కోట్లు రైతుభరోసా ద్వారా అందించినందుకు మాకు అసంతృప్తి ఉందా? 43 లక్షల మంది తల్లులకు రూ.6,350 కోట్లు నేరుగా వారి అకౌంట్లలోకి జమచేసి వారికి అండగా నిలబడిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మీద మాకు అసంతృప్తి ఉంటుందా?
► పారిశ్రామిక రాయితీలుగా ఈ ఏడాది కాలంలోనే రూ.4 వేల కోట్లు అందించినందుకు మాకు అసంతృప్తి ఉందా?
► అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకు ఈ ఏడాది కాలంలోనే రూ.14,440 కోట్లు పెన్షన్ రూపంలో అందించినందుకు మాకు అసంతృప్తి ఉంటుందా?
► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ మీద ఏకంగా రూ.1,741 కోట్లు ఖర్చుచేసి 6 కోట్ల మంది ప్రజలకు ఆరోగ్య భరోసా ఇచ్చినందుకు మేం అసంతృప్తిగా ఉన్నామని.. మేం ఏమీ చేయలేకపోయామని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు మీ పత్రికల్లో రాస్తారా?
► గత ఏడాది కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఏకంగా రూ.4,200 కోట్లు ఖర్చు చేసినందుకు, వసతి దీవెనగా రూ.1,221 కోట్లు ఖర్చు చేసినందుకు, మధ్యాహ్న భోజనం మీద రూ.465 కోట్లు ఖర్చు చేసినందుకు, అగ్రిగోల్డ్ బాధితులకు రూ.236.5 కోట్లు ప్రభుత్వం ముందుకు వచ్చి చెల్లించినందుకు, చివరకు ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లకు రూ.72.82 కోట్లు ఆరోగ్య ఆసరాగా చెల్లించినందుకు మేము సిగ్గు పడాలా?
ప్రజల్లో సంతోషం మేం చూస్తున్నాం
► అలాగే, 30 లక్షల ఇళ్ల స్థలాలు పేదలందరికీ అందించబోతున్నందుకు, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా అక్కా చెల్లెమ్మలకు రూ.1,400 కోట్లు చెల్లించినందుకు, మత్స్యకార భరోసా ద్వారా రెండేళ్లలో చెల్లించాల్సిన రూ.212 కోట్లు ఇప్పటికే చెల్లించినందుకు మాకు అసమ్మతి ఉందని, అసంతృప్తి ఉందని చంద్రబాబు, రామోజీ చెప్పదల్చుకున్నారా?
► వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా రూ.196 కోట్లు, వాహనమిత్ర ద్వారా రెండు విడతల్లో దాదాపు రూ.500 కోట్లు చెల్లించినందుకు మేం బాధ పడుతున్నామని బాబు, రామోజీ అనుకుంటున్నారా?
► భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఎన్నికల మేనిఫెస్టోకు కొత్త అర్ధం చెప్పి, అదే ఖురాన్, అదే భగవద్గీత, అదే బైబిల్‌గా భావిస్తున్న ప్రభుత్వాన్ని చూసి.. 90 శాతం హామీలను అమలుచేసిన ప్రభుత్వాన్ని చూసి మాకు సంతోషం ఉంటుంది, మీకు ఏడుపు ఉంటుంది అన్నది ఎవరైనా అర్థం చేసుకుంటారు.
► మేనిఫెస్టోలో చెప్పకపోయినా మరో 40 అంశాల్లో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసినందుకు నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది.
► అలాగే, గ్రామ సచివాలయాల ద్వారా ఇంటింటికి వెళ్లి పెంచిన పెన్షన్లు చేతికి ఇస్తున్నందుకు.. వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాల ద్వారా లబ్ధి అందుకుంటున్నప్పుడు ప్రజల కళ్లలో సంతోషం మా కళ్లతో మేం చూస్తున్నాం.
► నాడు–నేడు ద్వారా స్కూళ్లు, ఆస్పత్రుల చరిత్ర మారుతున్నందుకు, రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లో రైతు చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతున్నందుకు మేం ఈ ప్రభుత్వంలో ఉన్నందుకు నిజానికి గర్వపడుతున్నాం.
► 51శాతం ఓట్లు, 86 శాతం సీట్లతో ఘనమైన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలకుగానీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు కూడా అసంతృప్తి లేదు. కానీ, ఎవరికి అసంతృప్తి ఉందంటే..
► ఒకటి.. రామోజీ, రెండు.. రాధాకృష్ణ, మూడు.. చంద్రబాబు, నాలుగు.. లోకేశ్.. ఐదు యనమల, ఆరు.. మొన్న ఓడిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఏడు.. మొన్న ఓడిన టీడీపీ ఎంపీలు, ఎనిమిది.. ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న పెద్దలు, తొమ్మిది.. జన్మభూమి కమిటీల సభ్యులు.
► చంద్రబాబు చేసిన ఒక దుర్మార్గాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఈ రామోజీ మీద, ఏ ఎల్లో మీడియా మీద లేదా అని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రం అప్పును ఐదేళ్లలోనే మరో రూ.1.70 లక్షల కోట్లు పెంచారు. ఇదికాక చంద్రబాబు మా ప్రభుత్వానికి వదిలి వెళ్లిన బకాయిలు మేం చెల్లిస్తున్నామంటే, ఆయన పథకాలు అమలుచేసింది బాబా లేక మేమా అన్నది అందరూ ఆలోచించాలి.
బాబు వదిలివెళ్లిన బకాయిల్లో మచ్చుకు కొన్ని..
► మొత్తంగా విద్యుత్ సంస్థల బకాయిలు 2019 ఏప్రిల్ నాటికి రూ.20 వేల కోట్లు. ఇందులో వ్యవసాయ విద్యుత్ బకాయిలు రూ.8,800 కోట్లు.
► మేం అధికారంలోకి వచ్చాక రైతులకు తీర్చిన బాబు ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు. విత్తనాల బకాయిలు రూ.384 కోట్లు.
► పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయిలు రూ.4 వేల కోట్లు.
► టిడ్కో బకాయిలు రూ.3 వేల కోట్లు.
► ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.686 కోట్లు.
► ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,880 కోట్లు.
► అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించింది రూ.264 కోట్లు. ఇవన్నీ దోపిడి బాబు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన బహుమానాలు. కానీ, 200 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్న 94 శాతం పేదలకు చెల్లించాల్సిన బకాయిలను బాబు ఎగ్గొట్టిన విధానాన్ని రామోజీ, ఎల్లో మీడియా, చంద్రబాబు ప్రస్తావించారా? మా నోటితోనే మేం ఇవన్నీ చెబుతున్నాం. ఇవన్నీ మీ పేపర్లో మొదటి పేజీలో ప్రచురించండి. రాక్షసులకు కొమ్ము కాయడం ఆపి, మనుషులుగా మిగలండి.
ఇష్టారాజ్యంగా రాయడమేనా?: ధర్మాన
సీఎం వైఎస్ జగన్ అవినీతిరహిత పాలన చేస్తూ.. చంద్రబాబు పెంచి పోషించిన అవినీతిని కూకటివేళ్లతో పెకలించి వేస్తున్నారని.. చంద్రబాబు హయాంలో శ్రీకాకుళం రిమ్స్ కాలేజీలో నియమించిన ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టరు అవినీతికి పాల్పడుతుంటే ప్రశ్నించానని.. లంచం తీసుకోవడం తప్పని అంటే.. దానిని అసంతృప్తి అని, మరొకటి అని కొన్ని పత్రికలు ఇష్టారాజ్యంగా రాయడమేమిటని ధర్మాన ప్రశ్నించారు. చంద్రబాబు శ్రీకాకుళంలో పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు.
సూచనలిస్తే వక్రీకరించారు..: చిర్ల జగ్గిరెడ్డి
మొదటి నుంచి అబద్ధాలు రాయడం, చంద్రబాబును కీర్తించడం ఈనాడు, ఆంధ్రజ్యోతికి అలవాటేనన్నారు. ప్రజల భూములను తీసుకుని ఫిల్మ్‌సిటీ కట్టుకున్న రామోజీకి మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం ఎలా కనిపిస్తుంది? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే అసంతృప్తితో లేరన్నారు. ఇసుక, మట్టి అంశాలపై అలసత్వం తగదని జిల్లా అధికారులకు సూచిస్తే దానిని వక్రీకరిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఎమ్మెల్యేల అసంతృప్తి అంటూ తప్పుడు కథనాలు రాశాయన్నారు.
రాతల వెనుక కుట్ర..: సీదిరి అప్పలరాజు
అధికార పార్టీలో అసమ్మతి సెగ అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వార్తలు ప్రచురించడం వెనక ఒక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలలో పలుచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమకెందుకు అసంతృప్తి ఉంటుందని.. ఉంటే గింటే 175 స్థానాలకుగాను కేవలం 23 మంది మాత్రమే గెలవగలగిన టీడీపీలో ఉంటుందని అప్పలరాజు అన్నారు. ప్రజలలో అభూత కల్పనలు సృష్టించడానికి కుట్ర జరుగుతున్నట్లుగా భావిస్తున్నానన్నారు.
తప్పుడు ప్రచారం..: బొల్లా బ్రహ్మనాయుడు
తెలుగుదేశంలో అసమ్మతిని కప్పిపుచ్చుకునేందుకే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇసుక సరఫరాలో లోపాలను డీఆర్సీ మీటింగులో ప్రస్తావిస్తే తన మాటలను పచ్చ మీడియా వక్రీకరించిందన్నారు. టీడీపీని ఎవరూ కాపాడలేరని, రామోజీరావు, రాధాకృష్ణతోపాటు ఎల్లో మీడియా ద్వారా పార్టీని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తాము అసంతృప్తిగా ఉన్నామని ప్రచారం చేయడం నీచ రాజకీయమన్నారు.
కఠిన చర్యలు తప్పవు..: రఘురామకృష్ణరాజు
ఇసుక సమస్య పరిష్కారానికి సీఎం వైఎస్ జగన్ స్పందించిన తీరు అమోఘమని.. సమస్య పరిష్కారం పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. మూడు, నాలుగు రోజుల్లోనే ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి ధరలు దిగివచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అభాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment