వారిపై వేటేయండి.. నేటి నుంచే సభకు వస్తాం | YSRCP MLAs open letter to CM Chandrababu | Sakshi
Sakshi News home page

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటేయండి.. నేటి నుంచే సభకు వస్తాం

Published Thu, Sep 6 2018 3:25 AM | Last Updated on Thu, Sep 6 2018 10:11 AM

YSRCP MLAs open letter to CM Chandrababu - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. చిత్రంలో పార్టీ ఎమ్మెల్యేలు

సాక్షి, అమరావతి: తమ పార్టీ నుంచి అధికార అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలను శాసనసభా సభ్యత్వాల నుంచి తక్షణం అనర్హులుగా ప్రకటిస్తే తాము గురువారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు హాజరవుతామని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. ఈ మేరకు వారు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య దేవాలయంలో ఉంటున్న దొంగ సొత్తు లాంటి వారని, వారిని ఈరోజే బయట పడేయాలని కోరారు. ఫిరాయింపుదారుల అనర్హత మాట ఎత్తని స్పీకర్‌ తమను మాత్రం శాసనసభా సమావేశాలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్పీకర్‌ అధికార పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష అణచివేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్‌ను మీ(చంద్రబాబు) చెప్పు చేతల్లో ఉంచుకుని, సొంత పార్టీ కార్యకర్తగా వాడుకుంటున్నందున ఈ లేఖను మీకు రాయాల్సి వస్తోందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. 

సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖ పూర్తి పాఠం... 
‘‘అసెంబ్లీ సమావేశాలకు మా పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చేసిన విజ్ఞాపన నేపథ్యంలో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలను అధికార పక్షం సీట్లలో కూర్చోబెట్టి సభను నడుపుతున్న స్పీకరు గారు, వారిని ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి కాపాడుతున్న స్పీకరు గారు ప్రజాస్వామ్య ధర్మపన్నాలు వల్లించడం చూసిన తరవాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం. గురువారం నుంచి మీరు నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు మేం హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజే ఫిరాయింపు మంత్రులు నలుగురిని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు 22 మందిని తక్షణం పదవుల నుంచి తొలగించండి. ప్రజాస్వామ్య దేవాలయంలో ఉన్న మీ దొంగసొత్తును ఈరోజే బయటపడేయండి. ఇదే విషయాన్ని 2017 అక్టోబరులో శాసనసభ సమావేశాల సందర్భంగా చెప్పాం. మరోసారీ చెపుతున్నాం.

ఈరోజే వారిని తొలగించండి. రేపటి నుంచి సమావేశాలకు తప్పక హాజరవుతాం. భారత ప్రజాస్వామ్యానికి మన పార్లమెంట్‌ ప్రతీక అయితే... రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రతినిధులతో ఉన్న అసెంబ్లీ రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామ్యానికి దేవాలయం. అటువంటి ప్రజాస్వామ్య దేవాలయాన్ని దయ్యాల కొంపగా మార్చి, మా శాసనసభ్యుల్లో 22 మందిని విడతలవారీగా కొనుగోలు చేసి, పార్టీ మార్చి మీ అధికార పక్షం సీట్లలో కూర్చోబెట్టుకుని, వారిలో నలుగురితో మంత్రులుగా ప్రమాణం చేయించి, వారితో మమ్మల్ని తిట్టించడానికి సిద్ధమైన మీరు నడుపుతున్న సభను ఏ ప్రమాణాల్లో అయినా ఎవరైనా శాసనసభ అంటారా? మీరు సభలో చేస్తున్నది ప్రజాస్వామ్య దేవత మీద అఘాయిత్యం కాదా? అలవాటుపడిన హంతకుడికి రానురానూ తాను చేసే హత్యలు మామూలు విషయంగా మారిపోతాయన్నట్టు ఏకంగా మీ మామ నుంచే ముఖ్యమంత్రి పదవి, పార్టీ, పార్టీ అధ్యక్ష పదవి, పార్టీ గుర్తు, ఎన్నికల గుర్తు, ట్రస్టు వంటివన్నీ లాక్కుని, ఆయన కుటంబాన్ని ముక్కలు చేసి ముఖ్యమంత్రి అయిన మీ ముందు... పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన చట్టాలూ, ప్రజాస్వామ్య సూత్రాలూ, రాజ్యాంగ నియమాలూ మాట్లాడటం దయ్యాల ముందు వేదాలు వల్లించడం లాంటిదే. 

ఒక పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు ఆ తరవాత తన పార్టీకి కాకుండా వేరే పార్టీకి విధేయత చూపినట్టు ఆధారాలున్న మరుక్షణం అటువంటి శాసనసభ్యుడిని అనర్హుడిగా చేయాలని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం(రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌) స్పష్టం చేస్తోంది. ఈ అధికారాన్ని రాజ్యాంగం శాసన సభాపతి చేతిలో పెట్టింది. ఫిరాయించిన వారి శాసన సభ్యత్వాన్ని తక్షణం రద్దు చేయడానికి తన చేతిలోకి వచ్చిన ఈ అధికారాన్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే వ్యవహరిస్తున్న కోడెల శివప్రసాదరావు గారు, ఫిరాయింపుదార్ల సభ్యత్వాలు రద్దు చేయకుండా మీ తరఫున అడ్డుపడేందుకు తనకున్న అధికారాన్ని మార్చుకుని శాసన సభ గౌరవాన్ని, రాజ్యాంగాన్ని పాతిపెడుతుంటే... మేం అలాంటి సభకు రాలేమని స్పష్టం చేశాం. 2016 ఫిబ్రవరి నుంచి 2017 మార్చి వరకు విడతలవారీగా 23 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసన సభ్యుల్ని తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయింపజేశారు.

ఒక్కొక్కరికీ రూ.30 కోట్ల వరకు లంచంగా ఇచ్చి మరీ ఈ కొనుగోళ్లకు పాల్పడ్డారు. ఆ శాసన సభ్యుల డిస్‌క్వాలిఫికేషన్‌కు ఎప్పటికప్పుడు మా పార్టీ తరఫున స్పీకరుకు నివేదించాం. 2017 మార్చి 27న ఒకసారి, 2017 నవంబరు 8న మరోసారీ స్పీకరుకు డిస్‌క్వాలిఫికేషన్‌ వేటు వేయండని విజ్ఞప్తి చేశాం. మీరు ఆడమన్నట్టు ఆడటానికి, మీ కనుసైగల్ని ఆదేశాలుగా తీసుకునేందుకు అలవాటుపడిన స్పీకరు గారు చట్టం, రాజ్యాంగం కంటే మీ పట్ల విధేయతను గొప్పదిగా భావించటం వల్లే ఈ రోజుకీ ఆ 22 మందిమీదా అనర్హత వేటు పడలేదు. అంతేకాకుండా, శాసనసభ జాబితాలో వారిని మా పార్టీ సభ్యులుగా చూపుతూ మరోవంక అధికార పక్షం బెంచీల్లో కూర్చోబెట్టే దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నారు. 

శాసనసభ పవిత్రతను మంటగలపడంలో మీ కౌరవ పటాలంలో ఎవరు తక్కువ తిన్నారు గనక? రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవిలో ఉంటూ కూడా మీ ఫొటోలకు పాలాభిషేకాలు– మీకు పాదాభిషేకాలూ చేస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కూడా దక్కదనుకునే అర్భకులు, ఎన్టీఆర్‌ వెన్నుపోటులో మీ పార్ట్‌నర్‌ అయిన పన్నుపోటు శాఖ మంత్రిగారు, నిలువు మార్గంలో లోపలికి ప్రవేశించలేడని నిర్ణయించుకుని అడ్డదారిలో మీరు సభలోకి నెట్టిన మీ పుత్రరత్నం గారు, వీరికి తోడు మా పార్టీలో గెలిచి మీ మంత్రి మండలిలో చేరిన దుష్ట చతుష్టయం, వీరందరూ చాలరన్నట్టు– వారివారి శాఖల్లో కాక, కేకల్లో బూతుల్లో మీరు శిక్షణ ఇచ్చి పంపిన పటాలం... వీరందరికీ తమరి అమోఘమైన నాయకత్వం! శాసనసభను ఇంతగా గబ్బు పట్టించిన వారు ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో మరొకరున్నారా చంద్రబాబు గారూ? గుంటూరులో మీరు ఇటీవల పెట్టిన ‘నారా హమారా’ సభలో నిండా ముప్పయ్యేళ్ళు లేని 10 మంది ముస్లిం యువకులు లేచి, అయ్యా... 2014 ఎన్నికల్లో మీ వాగ్దానాల సంగతేమిటని ప్రశ్నిస్తే సమాధానం నోటితో చెప్పటం చేతగాని మీరు, శాసనసభలో నిజాయతీగా ప్రజల తరఫున సంధిస్తున్న మా ప్రశ్నలకు సమాధానం చెప్పగలరని ఎవరు అనుకుంటారు? గత నాలుగేళ్ళలో శాసన సభలో మీరు ఏనాడు ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగారు? 

మేం నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం... ఉంటాం. మా పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవంబరు నుంచి నేటి వరకు 2,900 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే ఉంటూ, ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు? కమీషన్‌ పద్ధతిలో భూ కేటాయింపుల కోసం కేబినెట్‌ మీటింగులు, లంచాల కోసం సెక్రెటేరియట్‌లో సిట్టింగులు, మనీలాండరింగ్‌ కోసం విదేశీ పర్యటనలు... ఇదే కదా మీ పరిపాలన? ఇవన్నీ అందరికీ తెలిసినా మీ మాజీ పార్ట్‌నర్లు, కాబోయే పార్ట్‌నర్లతో మేం శాసనసభనుంచి పారిపోయాం అని మమ్మల్ని విమర్శిస్తూ మీ స్క్రిప్టును వారితో పలికిస్తున్నారు. ఆ నలుగురు మంత్రులను, 22 మంది ఎమ్మెల్యేలను వెంటనే తొలగించండి. చట్టసభలోనే చట్టానికి విలువలేనప్పుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎలా వెళ్తారు?  

స్పీకరే రాజ్యాంగ భక్షకుడిగా పార్టీ ఫిరాయింపులకు కొమ్ముగాస్తుంటే ఇంకెక్కడి శాసన సభ? కళ్లెదురుగా కనిపిస్తున్నా, స్పీకర్‌ ఏళ్ల తరబడి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకపోవడం ఏమిటి? ఇది పరమ దుర్మార్గం, ఇది అప్రజాస్వామికం అని ఉద్యమించాల్సిన పక్షాల్ని, ఎల్లో మీడియాని మీ బిస్కెట్లకు అలవాటు చేసి వారిని మా మీదకు ఉసిగొల్పుతున్నారు. ప్రజల సమస్యల మీద చర్చించే ధైర్యం గానీ, సత్తా గానీ ఉంటే వెంటనే ఆ నలుగురు మంత్రుల్ని, 22 మంది ఎమ్మెల్యేల్ని డిస్‌క్వాలిఫై చేయండి. చేసిన దుర్మార్గానికి లెంపలు వేసుకుని ప్రజలను క్షమాపణ అడగండి. ఇవేవీ చేతగావనుకుంటే, మీ ఎల్లో మీడియా, మీ మాజీ–తాజా పార్ట్‌నర్ల అండదండలతో, మీ పుత్రరత్నం ఆకాంక్షలకు అనుగుణంగా మీ దుశ్శాసన సభను మీకు నచ్చినట్టుగా నడుపుకోండి. రాష్ట్రంలో ఉన్న మేధావులు, ఆలోచనపరులు, బాధ్యతగల ప్రతి ఒక్కరూ మేం రాసిన ఈ ఉత్తరంలోని అంశాలమీద ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం.

ఇట్లు...
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement