
వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి
ఢిల్లీ: ఏపీలో మహిళలపై అత్యాచారాలు స్వల్పంగా పెరిగాయని, రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు హోం మంత్రి జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలలో స్వల్ప పెరుగుదల ఉన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అహిర్ వెల్లడించారు. బుధవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజా సమాచారం ప్రకారం 2015తో పోల్చుకుంటే 2016లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై రేప్‌లు, అత్యాచారాలు, దాడులు పెరిగిన విషయం వాస్తవమేనా? వీటికి కారణాలేమిటి? నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అంటూ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.
ఎన్సీఆర్బీ సమాచారం ప్రకారం 2015తో పోల్చుకుంటే 2016లో ఆంధ్రప్రదేశ్‌లో రేప్ కేసులు, అలాగే మహిళా హత్యలు తగ్గాయని అయితే మొత్తంగా చూస్తే మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాల సంఖ్య మాత్రం స్వల్పంగా పెరిగింది. మొత్తం మీద రేప్‌లు, హత్యలు, అత్యాచాల ఘటనలు పరిగణలోకి తీసుకుంటే 2015లో రాష్ట్రంలో 6071 కేసులు నమోదైతే 2016లో వాటి సంఖ్య 6234కు పెరిగినట్లు మంత్రి తెలిపారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా రక్షక్, మహిళా మిత్రా, ఐ-క్లిక్, అభయం, డయల్ 100, కారవాన్, సాక్షి, శక్తి వంటి కార్యక్రమాల ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.
దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడే వ్యక్తుల సమాచారంతో డేటాబేస్‌ను రూపొందించి 112 హెల్ప్ లైన్ నంబర్ ద్వారా 24 గంటలూ పనిచేసే ఎమర్జెన్సీ రెస్పాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment