
సాక్షి, విశాఖ : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి విజయ సాయిరెడ్డి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘నిన్నటి చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్సు సంతాప సమావేశంలా ఉంది. మీరు అంత నిప్పు, పత్తి గింజ అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగనే లేదు. మా అందరికీ ఒకేసారి కల వచ్చి 4 వేల ఎకరాల భూములు కొనుగోలు చేశామని చెప్పండి. దీనిపై దర్యాప్తు చేసి మాపై పడిన నింద తొలగించమని సీబీఐని కోరండి.
ఏం లేకపోతే మీకెందుకు భయం. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగక పోతే టీడీపీ నాయకులు, చంద్రబాబు వర్గం రియల్ ఎస్టేట్ వ్యాపారులు నాలుగు వేల ఎకరాల భూమిని కూడబలుక్కున్నట్టు ఎలా కొంటారు? 2014 జూన్ లో బాబు సిఎం అయ్యారు. డిసెంబర్ లో అమరావతిని క్యాపిటల్ గా ప్రకటించే లోపే ఐదు నెలల్లో ఎగబడి కొన్నారంటే తెలియడం లేదా?’ అని సూటిగా ప్రశ్నించారు.
రాజధాని కోసం చంద్రబాబు మార్కెటింగ్ మేనేజర్ అవతారం ఎందుకెత్తారో ఢిల్లీ మీడియా వర్గాలకు అప్పట్లో అంతుబట్టలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని ఇప్పుడర్థమైంది. ప్రజా ధనంతో దేశాలు తిరిగి అమరావతిపై ప్రెజెంటేషన్లు ఇచ్చాడు. పెట్టుబడుల కోసమైతే వెనకబడిన జిల్లాల గురించి ప్రస్తావించొచ్చు కదా?.. అని విజయ సాయిరెడ్డి విమర్శించారు.
కాగా విశాఖలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిదంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఎంపీ విజయ సాయిరెడ్డి అన్నారు. ఆరోపణలపై సీబీఐతో విచారణ కోరవచ్చని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు తన కుటుంబం మాత్రమే బాగుండాలనే వ్యక్తి అని, ఆయనది కుటిలమైన మనస్తత్వం అని అన్నారు.చంద్రబాబు తాను తప్ప ఎవరూ ఎదగకూడదనుకునే నైజం ఉన్న వ్యక్తి అని మండిపడ్డారు. కాగా నేటి నుంచి రెండు రోజుల పాటు విశాఖ ఉత్సవ్ సందర్భంగా ఎంపీ విజయ సాయిరెడ్డి ఇవాళ ఉదయం వైఎస్సార్ సెంట్రల్ పార్క్‌లో ఫ్లవర్ షో ను ప్రారంభించారు.
చదవండి: ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిజమే
Comments
Please login to add a commentAdd a comment