చంద్రబాబు ఇంట్లో వెంకన్న గుప్త నిధులు | YSRCP MP Vijaysai Reddy Comments on CM Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఇంట్లో వెంకన్న గుప్త నిధులు

Published Thu, May 24 2018 2:40 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

YSRCP MP Vijaysai Reddy Comments on CM Chandrababu - Sakshi

విజయసాయిరెడ్డిని బలవంతంగా అరెస్టు చేస్తున్న పోలీసులు

సాక్షి, విశాఖపట్నం: తిరుమల నేలమాళిగల్లోని విలువైన గుప్త నిధులు, వజ్రాభరణాలను సీఎం చంద్రబాబు అమరావతి, హైదరాబాద్‌లోని తన నివాసాలకు తరలించుకుపోయాడని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. 12 గంటల్లోగా చంద్రబాబు నివాసాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) గానీ తెలంగాణ పోలీసులు గానీ దాడులు చేస్తే శ్రీవారి సొత్తు బయటపడుతుందన్నారు. చంద్రబాబు ఇంట్లో వెంకన్న సొమ్ము దొరక్కపోతే ఆ మరుక్షణమే తన పదవికి రాజీనామా చేస్తానని విజయసాయిరెడ్డి సవాల్‌ విసిరారు. 12 గంటల్లోగా దాడులు చేయకపోతే వాటిని చంద్రబాబు విదేశాలకు తరలించే అవకాశాలున్నాయని ఆయన హెచ్చరించారు.

బుధవారం విశాఖలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకే కాదు, తిరుమల వెంకన్నకు కూడా చంద్రబాబు శఠగోపం పెట్టారని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల పాటు రూ.మూడు లక్షల కోట్లు దోచి విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకున్న చంద్రబాబు.. ఇక రాష్ట్రంలో దోచుకునేందుకు వనరులు లేకపోవడంతో శ్రీవారి ఆస్తులపై కన్ను వేశారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ పోటులో ఉన్న నేలమాళిగల్లోని గుప్త నిధులను ఎవ్వరికీ తెలియకుండా కొల్లగొట్టి ఇప్పటికే కొంత విదేశాలకు తరలించుకుపోయారన్నారు. స్విట్జర్లాండ్‌లో కొన్ని ఆభరణాలను వేలానికి పెట్టారని.. మరికొన్ని ఆభరణాలు, గుప్తనిధులను చంద్రబాబు తన నివాసంలో దాచిపెట్టుకున్నారని చెప్పారు. వెంకన్నకు అపచారం చేసిన వ్యక్తులు బాగుపడరని.. చంద్రబాబుకు కూడా అదే గతిపడుతుందన్నారు. 

విజయసాయిరెడ్డి అరెస్టు.. విడుదల
నాలుగేళ్లుగా ఆంధ్ర ప్రజల్ని మోసం చేసి ఇప్పుడు ధర్మపోరాట సభ పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ టీడీపీపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. ధర్మపోరాట సభ వల్ల అపవిత్రమైన ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానాన్ని శుద్ధి చేసేందుకంటూ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మద్దిలపాలెం నుంచి ఏయూ ప్రాంగణానికి ర్యాలీగా బయల్దేరారు. ఈ విషయం తెలియడంతో ఐదుగురు ఏసీపీల ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు కృష్ణా కాలేజీ రోడ్డులో మోహరించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయం నుంచి కొద్దిదూరం రాగానే వైఎస్సార్‌సీపీ శ్రేణులను వారు అడ్డుకున్నారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అడ్డుకున్నారో చెప్పాలని నేతలు ప్రశ్నించగా.. పై నుంచి ఆర్డర్స్‌ వచ్చాయి.. అడ్డుకొని తీరుతామంటూ పోలీసులు తేల్చిచెప్పారు. దొరికిన వారిని దొరికినట్టు ఈడ్చుకుంటూ వ్యాన్లు ఎక్కించారు. మహిళా నేతలను సైతం మగ పోలీసులు బలవంతంగా లాగి పడేశారు. రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ కుమార్‌.. తన కాలర్‌ పట్టుకోవడంతో ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా మళ్ల విజయప్రసాద్‌తో కలిసి కృష్ణా కాలేజీ జంక్షన్‌ వద్ద హైవేపై విజయసాయిరెడ్డి బైఠాయించారు. అనంతరం ఏసీపీల విజ్ఞప్తి మేరకు రాస్తారోకోను విరమించిన ఎంపీ అక్కడ్నుంచి పాదయాత్రగా ఏయూ వైపు వెళ్లేందుకు యత్నించగా.. బలవంతంగా ఆయన్ని జీపులోకి ఎక్కించి బ్యారెక్స్‌కు తరలించారు. అనంతరం కొంతసేపటికి ఆయనతో పాటు మిగిలిన నేతలను పోలీసులు విడుదల చేశారు.

సీపీ యోగానంద్‌ కులపిచ్చితో రెచ్చిపోతున్నారు..
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విశాఖ పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్‌ కులపిచ్చితో రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. పోలీసులను పచ్చచొక్కా వేసుకున్న కార్యకర్తల్లా మార్చేసి వైఎస్సార్‌సీపీ శ్రేణులపైకి ఉసిగొల్పుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో కూడా అనుమతి లేకుండా రన్‌వే పైకి వచ్చి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను అడ్డుకున్నారని గుర్తు చేశారు. దీనిపై పార్లమెంటులో ఫిర్యాదు చేశామని.. త్వరలో ఆయనపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఆర్‌ఐ కుమార్‌ అనే పోలీస్‌ తనపై చేయి చేసుకున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి మంత్రి గంటా చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పంచన చేరే వ్యక్తి గంటా అని ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియంది కాదన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరేందుకు తమ పార్టీ నేతలను గంటా సంప్రదిస్తున్నారని.. ఎలాంటి విలువల్లేని ఆయనకు తమను విమర్శించే అర్హత లేదన్నారు. ఈ ఆందోళనలో పార్టీ నేతలు గుడివాడ అమర్‌నా«థ్, వరుదు కళ్యాణి, గొల్ల బాబూరావు, కుంభా రవిబాబు, కన్నబాబురాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, సనపల చంద్రమౌళి, సత్తి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement