రాజీనామాల వెంటనే ఎంపీల ఆమరణ దీక్ష | YSRCP MPs hunger strike after the Resignation | Sakshi
Sakshi News home page

రాజీనామాల వెంటనే ఎంపీల ఆమరణ దీక్ష

Published Sun, Apr 1 2018 1:58 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSRCP MPs hunger strike after the Resignation - Sakshi

గుంటూరు జిల్లా పేరేచర్లలో శనివారం జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ప్రత్యేక హోదా మన ఊపిరి. చంద్రబాబు ఎంపీలు ముందుకొచ్చినా... రాకున్నా... కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలంతా పార్లమెంట్‌ చివరి రోజునే రాజీనామాలు చేస్తారు. నేరుగా ఏపీ భవన్‌కు వెళ్ళి, అక్కడ ఆమరణ నిరాహార దీక్షలు చేపడతారు’ అని ప్రతిపక్ష నేత,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాము చేపట్టే ఈ ఆందోళనలకు రాష్ట్ర ప్రజలు మద్దతుని వ్వాలని కోరారు. ఎంపీల దీక్షకు మద్దతుగా విద్యార్థులు, యువకులు కదలిరావాలని పిలు పునిచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో దీక్షలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను నాలుగేళ్లుగా నిర్వీర్యం చేస్తూ వచ్చిన చంద్రబాబు ఇపుడు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు నాటకాలాడు తున్నారన్నారు. ఈ నాలుగేళ్లలో ప్రత్యేక హోదాకు ఆయన చేసిన అన్యాయాలను ఏకరువు పెడుతూ ఆరు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సవాల్‌ విసిరారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం గుంటూరు జిల్లాలో సాగింది. పేరేచర్ల వద్ద అశేషజనం హాజరైన భారీ బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

బాబుకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాల్సిందే..
‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా అడిగి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేది. ఆయన చేసిన అన్యాయానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. చదువుకున్న మన పిల్లలు ఇవాళ ఉద్యోగం కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వెళ్ళాల్సి వస్తోంది. అంతే తప్ప మన రాష్ట్రంలో ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఉంది. అయినా విశాఖపట్టణం పారిశ్రామిక సదస్సు పెట్టి, అక్కడ చంద్రబాబు ఏమంటారో తెలుసా? రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయట. 40 లక్షల మందికి ఇప్పటికే ఉద్యోగాలు వచ్చేశాయట. నిజంగా మీకు ఎక్కడైనా కన్పించాయా? ఇంత దారుణమైన మోసాలు చేస్తున్నాడీ పెద్దమనిషి, రాజధాని నిర్మాణంలో గ్రాఫిక్స్‌ చూపించాడు. అదే రీతిలో ప్రత్యేక హోదా విషయంలో ఆయన నటన చూస్తుంటే...  ఆస్కార్‌ నటులు ఎక్కడికి పోవాలో? ఆస్కార్‌ బహుమతులు ఇచ్చేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని చూడలేదు. వాళ్ళు పొరపాటున ఇక్కడకొచ్చి చూసి ఉంటే, ఉత్తమ విలన్‌ పాత్రలో అవార్డు కచ్చితంగా మన సీఎం చంద్రబాబుకే వచ్చేది!

ఈ ప్రశ్నలకు బదులివ్వు చంద్రబాబూ..
చంద్రబాబు చేసిన అన్యాయాలు, ప్రత్యేక హోదా విషయంలో చేసిన మోసాల మీద కేవలం ప్రజల తరపున చంద్రబాబును ఆరే ఆరు ప్రశ్నలు నేను అడుగుతాను. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే...ఏమాత్రమైనా దమ్ము, ధైర్యం ఉంటే... నేనడిగే ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారని ఆశిస్తున్నాను. 
1.  ఆ ఏడు నెలలూ ఏం చేశావు బాబూ? మార్చి 2, 2014న... మన రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలని భావించి, కేంద్ర కేబినేట్‌ తీర్మానం ఆమోదించి, ప్లానింగ్‌ కమిషన్‌కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈయన ముఖ్యమంత్రి అయ్యింది 2014, జూన్‌లో. ఆ తర్వాత  డిసెంబర్‌ 2014 వరకూ ... అంటే ఏడు నెలలు  ఈ ఫైల్‌ ప్లానింగ్‌ కమిషన్‌ వద్దే ఉంది. ఈ ఏడు నెలల కాలంలో గాడిదలు కాస్తున్నావా చంద్రబాబూ? సీఎం హోదాలో ఉండి కనీసం అగడను కూడా అడగలేదే? ఇది మోసం కాదా?
2.  జైట్లీ ప్యాకేజీ ప్రకటించిన రోజు ఎందుకు పోరాడలేదు? సెప్టెంబర్‌ 8, 2016న ప్రత్యేక హోదాకు బదులుగా, ఓ అబద్దపు ప్యాకేజీని అర్ధరాతి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. ఈ మధ్య ఇదే అరుణ్‌జైట్లీ మరో ప్రకటన చేశారు. దీంతో చంద్రబాబు తన మంత్రుల చేత రాజీనామా చేయించారు. జైట్లీ మొదటి సారి చేసిన ప్రకటనకు, ఇపుడు చేసిన ప్రకటనకు ఏమైనా తేడా ఉందా? మొదటి సారి అబద్ధపు ప్యాకేజీ ప్రకటిస్తే ఇదే చంద్రబాబు అర్ధరాత్రి ప్రెస్‌మీట్‌ పెట్టి స్వాగతించారు. మర్నాడు అసెంబ్లీలో జైట్లీకి, కేంద్రానికి ధన్యవాదాల తీర్మానం చేశారు. అంతటితో ఆగలేదు. ఢిల్లీ వెళ్ళి జైట్లీకి శాలువాలు కప్పొచ్చారు. ఇదే పెద్దమనిషి ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఏం బాగుపడ్డాయని అసెంబ్లీలోనే వ్యాఖ్యానించారు. కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని ఈయనే అంటారు. ఇంత దారుణంగా ఆ రోజు ప్రత్యేక హోదాకు తూట్లు పొడిచారు. జైట్లీ ప్యాకేజీ ఇస్తూ తొలిసారి ప్రకటన చేసినప్పుడే తన మంత్రులను ఉప సంహరించుకుని ఉంటే హోదా వచ్చేది కాదా చంద్రబాబూ?  
3. నా ఆమరణ దీక్షను ఎందుకు భగ్నం చేశావు? ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ళుగా ఏ పోరాటం చేసినా నువ్వు నీరు గార్చలేదా చంద్రబాబూ? హోదా కోసం నేను ఎనిమిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే, నరేంద్ర మోదీ వస్తున్నారని పోలీసులను పంపించి, తెల్లవారు జామున నా టెంట్‌ ఎత్తేయించింది నువ్వు కాదా? ప్రతిపక్ష నేత దీక్ష చేస్తున్నాడని నన్ను చూపించి మోదీని డిమాండ్‌ చేయాల్సింది పోయి ఇలాంటి పని చేస్తావా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా పార్టీ ధర్నాలు, దీక్షలు, బంద్‌లు చేస్తే నువ్వు దగ్గరుండి చేసిందేమిటి? దగ్గరుండి పోలీసులను పెట్టి బస్సులు తిప్పిన చరిత్ర చంద్రబాబుది కాదా? ప్రత్యేక హోదా రాకపోతే కలిగే నష్టంపై విద్యార్థులకు అవగాహన కల్గించేందుకు యువ భేరీలు నిర్వహిస్తే పిల్లలపై పీడీ యాక్ట్‌ పెడతానని బెదిరించిన చరిత్ర చంద్రబాబుది కాదా? ఇవన్నీ అన్యాయాలు, మోసాలు కావా?
4. మేం పార్టీల మద్దతు కూడగట్టే వరకు అవిశ్వాసం గురించి ఆలోచించావా? అసలు మొన్న వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండకపోతే నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండేవాడివా చంద్రబాబూ? సంఖ్యాబలం ఉంటేనే అవిశ్వాసానికి మద్దతునిస్తానని మార్చి 15వ తేదీన చంద్రబాబు చెప్పారు. మర్నాడే యూటర్న్‌ తీసుకున్నారు. కారణమేంటో తెలుసా? నేను రాసిన లేఖను తీసుకుని మన పార్టీ ఎంపీలు ప్రతీ పార్టీని కలిసి, అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపమని కోరారు. వాళ్ళంతా ఒప్పుకున్నట్టు మర్నాడు జాతీయ మీడియాలో వచ్చిందని... వాళ్ళు ఎలాగూ మద్దతు తెలుపుతున్నారని చంద్రబాబు ప్లేట్‌ మార్చారు. తాను అవిశ్వాసం పెట్టాడు కాబట్టి మిగతా పార్టీలు మద్దతునిస్తున్నాయని సిగ్గులేకుండా అన్నాడు. ఇలాంటి మనిషి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? మార్చి 15న సంఖ్యాబలం ఉంటేనే మద్దతునిస్తానన్నాడు. అంటే దానర్థం అప్పటికి ఆయన ఏ పార్టీతోనూ మాట్లాడలేదనేగా. మార్చి 16 వరకూ తాను అవిశ్వాసం పెట్టబోతున్నట్టు ఆయనకే తెలియదు. ఇలా సిగ్గులేకుండా రాజకీయాలు చేస్తుంటే ఇది మోసం కాదా చంద్రబాబూ? 
5. ఉద్యమించకుండా హోదా ఎలా సాధిస్తావు? చంద్రబాబు మొన్న అఖిల పక్షాన్ని పిలిచారు. మరో డ్రామాను రక్తికట్టించారు. అదెలా ఉందో తెలుసా? ఒక గజదొంగ దొంగతనాల నివారణకు సలహాలు ఇవ్వమని మీటింగ్‌ పెట్టినట్టుగా ఉంది ఆయన అఖిలపక్షం సమావేశానికి పిలవడం. అఖిలపక్షాన్ని పిలిచిన చంద్రబాబు వెల్లడించిన  కార్యాచరణ ఏంటో తెలుసా? ఎవరూ నిరసనలు తెలుపకూడదట. ఆందోళనలు చేయ్యకూడదట. విద్యార్థులు ఉద్యమంలోకి రానే రాకూడదట. ఉద్యమం పెద్దదయితే రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందట. కేవలం నల్లబ్యాడ్జీలు పెట్టుకుని ఆఫీసులకు వెళ్ళాలట. ఢిల్లీ వాళ్ళు కదులుతారట.  ఇలా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా? ఇది మోసం కాదా చంద్రబాబూ?
6. ఏపీ ఎంపీలంతా ఏకతాటిపై నిలబడితే కేంద్రం దిగిరాదా? ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పార్లమెంట్‌ చివరి రోజున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలంతా రాజీనామా చేస్తామని ఇప్పటికే  ప్రకటించాం. టీడీపీతో సహా 25 మంది ఎంపీలు ఒక్క తాటిపై నిలబడి రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా చంద్రబాబూ? అయినా ఆయన ఎంపీలతోటి రాజీనామాలు చేయించరట. కారణం ఏంటో తెలుసా? చంద్రబాబుకు భయం.. ఆయన చేసిన అవినీతిపై కేసులు పెడతారని, అరెస్టు చేస్తారనే భయం. కేసులు పెట్టి, అరెస్టు చేస్తే ఆయన తరపున మాట్లాడేందుకు పార్లమెంట్‌లో ఎంపీలు కావాలట. ఇదంతా ఆయన ఊహించుకుని సిగ్గులేకుండా ఎంపీలు రాజీనామాలు చేయొద్దని ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతుంటే... అసలు ఇతను మనిషేనా అనిపిస్తోంది? 

ప్రత్యేక హోదా మనకు ఊపిరి..
చంద్రబాబు ఎంపీలు రాజీనామా చేసినా, చెయ్యకున్నా ... పార్లమెంట్‌ చివరి రోజున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలంతా రాజీ నామాలు చేస్తారు. ఆ తర్వాత నేరుగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ఆస్తి అయిన ఏపీ భవన్‌కు వెళ్తారు. అక్కడ మన ఎంపీలంతా ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. ఆ ఎంపీలకు బాసటగా  ప్రతీ నియోజకవర్గం లో రిలే నిరాహార దీక్షలు చెయ్యాలని పిలుపునిస్తున్నాను. విద్యార్థులు, యువకులు ముందుకు రావాలి. దీక్ష చేస్తున్న ఎంపీలకు బాసటగా వాళ్ళ కాలేజీల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలి. దేవుడు ఆశీర్వదించి... చంద్రబాబు నాయుడుకు జ్ఞానోదయమై ఆయన ఎంపీలు కూడా ముందుకొస్తే... 25 మంది ఎంపీలు ఒకతాటిపైకొచ్చి, నేరుగా ఏపీ భవన్‌ వద్ద దీక్షలు చేస్తే... రాష్ట్రం మొత్తం వాళ్ళకు మద్దతుగా నిలబడితే ఎలా ఉంటుందో అని ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు కేంద్రం దిగివస్తుంది. ప్రత్యేక హోదా కచ్చితంగా వచ్చే అవకాశం వస్తుంది. చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగాలకు ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరమే ఉండదు. ప్రతీ జిల్లా ఒక హైదరాబాద్‌ అవుతుంది.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement