5 కోట్ల ఆంధ్రులకు బాబు వెన్నుపోటు | YS Jaganmohan Reddy fires on CM Chandrababu at Tenali | Sakshi
Sakshi News home page

5 కోట్ల ఆంధ్రులకు బాబు వెన్నుపోటు

Published Sun, Apr 8 2018 1:23 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YS Jaganmohan Reddy fires on CM Chandrababu at Tenali - Sakshi

గుంటూరు జిల్లా తెనాలి పురవేదిక సెంటర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

- చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పు, అన్యాయం, ఘోరం ఏమిటో తెలుసా? చంద్రబాబు చేయగలిగి ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించలేకపోవడం. ఆయన గట్టిగా అడిగి ఉంటే ఈ పాటికి హోదా వచ్చి ఉండేది. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చి ఉండేవి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు పోయి ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉండేది కాదు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కూడా ఒక హైదరాబాద్‌లా తయారై మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చి ఉండేవి.  

- ఈ పెద్ద మనిషి ఏపీకి చెందిన ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచి, ఇవాళ ఏమీ జరగనట్లుగా అఖిల పక్షం అంటూ సైకిల్‌ తొక్కుతున్నారంటే ఈయన ఒక మనిషేనా? రాక్షసుడు కాదా? అని అడుగుతున్నా.. అదేమంటే 40 ఏళ్ల అనుభవం అంటారు. నీ అనుభవం ఏమైంది? మోసం చేయడానికి, మాయ చేయడానికేనా? చంద్రబాబు నైజం ఎలాంటిదంటే అధికారం, స్వార్థం, పదవుల కోసం ఏదైనా చేస్తారు. సొంత కూతురును ఇచ్చిన మామ ఎన్‌టీఆర్‌నే వెన్నుపోటు పొడిచారు. ఆయన చావుకు కారణమయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఎన్టీఆర్‌ ఫొటోకు దండ వేసి బయలుదేరతాడు. 

- చంద్రబాబుకు ఈ మధ్య వణుకు మొదలైంది. భయం పట్టుకుంది. నాలుగేళ్లుగా విచ్చలవిడిగా తిన్నారు కదా.. దోచుకున్నది తిని అరిగించుకోలేక పోతున్నాడు. దానిపై ఎక్కడ విచారణ జరుగుతుందోననే భయం పట్టుకుంది.  
- తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి.. కబ్జాలలో ఘనాపాటి అని ఈ ప్రాంత వాసులు చాలా మంది నాతో చెప్పారు. విజయవాడలోని శాతవాహన కళాశాల భూముల నుంచి గుంటూరులోని క్రైస్తవ మైనార్టీల ఆస్తుల వరకు ఏదీ కూడా వదలి పెట్టడం లేదు. వీటిని కాపాడుకునేందుకు కోర్టుకు పోవాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు. సీఎం సమక్షంలోనే, లంచాలలో భాగస్వామి అయి ఉండి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న తీరు మీరందరూ చూస్తూనే ఉన్నారు. రైతులు అవస్థలు పడుతుంటే మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు.  

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఐదు కోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచి, ఇవాళ సైకిల్‌ ర్యాలీ.. అఖిల పక్షం అంటూ డ్రామాలాడుతున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు,  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు మరోసారి అమ్మేశారని.. అవినీతి భయంతోనే ఎంపీలతో రాజీనామా చేయించలేదని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 130వ రోజు శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు పంచ పాండవుల్లా పోరాడుతున్నారన్నారు. పార్లమెంట్‌ సభ్యత్వాలకు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమరణ దీక్షలు చేస్తూ ప్రత్యేక హోదా కోసం వీరోచిత పోరాటం సాగిస్తున్నారని వివరించారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

బాబు గట్టిగా అడిగి ఉంటే ...
‘‘సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీనీ గట్టిగా అడిగి ఉంటే మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. ఈ పెద్ద మనిషి చేస్తున్న మోసం..  హోదా విషయంలో ప్రజలను మభ్యపెట్టడమే. ఇవాళ వైఎస్సార్‌ సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశానికి చూపాలని ఆమరణ దీక్షకు కూర్చున్నారు. మనకు ప్రత్యేక హోదా రావాలని,దానికి ఇంతకన్నా వేరే మార్గం లేదని, కేంద్రం దిగిరావాలని పంచ పాండవుల్లా పోరు సాగిస్తున్నారు. ఆ ఐదుగురు ఎంపీలకు టీడీపీ ఎంపీలు జత కూడి రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఒక్క తాటిపైకి వచ్చి రాజీనామా చేసి దీక్షకు దిగి ఉంటే దేశం మొత్తం చర్చనీయాంశం అయి ఉండేది. యావత్‌ దేశం మనవైపు చూసి ఉండేది. అప్పుడు ప్రధాని దిగి వచ్చి, హోదా ఇచ్చి ఉండే వాడు కాదా? అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చేస్తున్నది ఏంటో తెలుసా? అఖిలపక్షం అంటూ డ్రామాలాడుతున్నారు. ఎంపీలతో రాజీనామాలు చేయించనంటాడు.. దీక్షలు చేయించనంటాడు.. ఇంతకన్నా అన్యాయం, మోసం, డ్రామా ఉంటుందా? నిన్ననే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి దీక్షలకు దిగి ఉంటే ఈపాటికి దేశం యావత్తు దీనిగురించి చర్చించి ఉండేది. కేంద్రం దిగి వచ్చి ఉండేది.  

ఆయన స్వార్థం కోసం హోదాను మరోసారి అమ్మేశారు.. 
ప్రత్యేక హోదాతో రాష్ట్రం బాగుపడుతుందని తెలిసి కూడా వెన్నుపోటు పొడిచాడు. ఐదు కోట్ల ఆంధ్రుల్ని మోసం చేశాడు. ఇప్పుడు ఏమీ జరగనట్లు సైకిల్‌ యాత్ర మొదలుపెడతారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగివస్తుందనీ తెలుసు.. ప్రత్యేక హోదా వస్తుందనీ తెలుసు.. కానీ ఆ పని చేయడు. కారణం ఏమిటో తెలుసా? ఆయన నాలుగేళ్లుగా చేసిన తప్పుడు పనుల గురించి పార్లమెంట్‌లో చర్చకు వస్తే ఆయన తరఫున గొడవ చేయడానికి ఎంపీలు అవసరమట. వారు పార్లమెంట్‌లో గందరగోళం చేసి అడ్డుకుంటారన్న దురుద్దేశం, స్వార్థంతో ఈ పెద్ద మనిషి ఐదు కోట్ల ఆంధ్రుల్ని, హోదాను మరోసారి అమ్మేశాడు. వెన్నుపోటు పొడిచాడు. ఇంతటి దారుణమైన వ్యక్తి, అన్యాయమైన వ్యక్తి చంద్రబాబు. ఇటువంటి వ్యక్తులను క్షమిస్తే మున్ముందు మరిన్ని మోసాలకు, అన్యాయాలకు తెగబడతారు.’ అని  జగన్‌ ధ్వజమెత్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement