సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రాణాలను పణంగాపెట్టి పోరాడుతున్నారు. షూగర్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సీనియర్ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష విషయంలో వెనుకడుగు వేయలేదు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా.. ఐదుకోట్ల ఆంధ్రుల తరఫున, అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు వారు నిరాహార దీక్షకు దిగారు. 73 ఏళ్ల వయస్సులో ఉన్న మేకపాటిని దీక్షకు దిగవద్దని ఆయన కుటుంబసభ్యులు, వైద్యులు వారించారు. అయినా ఆయన వెనుకడుగు వేయలేదు. 64 ఏళ్ల వయస్సులో ఎంపీ వరప్రసాద్ కూడా తనకు షూగర్, బీపీ వంటి సమస్యలు ఉన్నా లెక్కచేయకుండా ఉపవాస దీక్ష చేశారు.
మొక్కవోని సంకల్పంతో ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలన్న పట్టుదలతో దీక్ష కొనసాగించిన ఎంపీలు మేకపాటి, వరప్రసాద్ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో వైద్యులు బలవంతంగా వీరిని ఆస్పత్రికి తరలించారు. సీనియర్ ఎంపీ మేకపాటి దీక్షలో ఉండి వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాలుగో రోజు వరకు దీక్షలో ఉన్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పరిస్థితి కూడా విషమించింది. అయినా ఆయన దీక్ష విరమించేందుకు ససేమిరా అన్నారు. కుటుంబసభ్యులు, వైద్యులు దీక్ష వీడాలని విజ్ఞప్తి చేసినా వినలేదు.
దీంతో రాంమనోహర్ లోహియా వైద్యులు ఆయనను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగించేందుకు వైవీ సుబ్బారెడ్డి సిద్ధపడ్డారు. ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించినా.. నిరాకరించారు. దీంతో వైద్యులు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీలు వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డిని వైఎస్ విజయమ్మ సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మొక్కవోని సంకల్పంతో వయస్సు, ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపుమేరకు ఉదాత్తమైన పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీల పట్టుదలను జాతీయ రాజకీయ నాయకులు, ఏపీ ప్రజలు కొనియాడుతున్నారు. ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం ఎంపీలు చేపట్టిన దీక్ష సర్వత్రా చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment