‘ఏపీని రెంటికి చెడ్డ రేవడిలా తయారుచేశారు’ | YSRCP MPs Protest At Gandhi Statue In Parliament For Special Status | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 20 2018 12:18 PM | Last Updated on Thu, Dec 20 2018 12:41 PM

YSRCP MPs Protest At Gandhi Statue In Parliament For Special Status - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ​: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంటులో తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి రాజ్యసభ లోపల, వెలుపలు ఆందోళనలను తీవ్రతరం చేశారు. గురువారం కూడా పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాద్‌ ఆందోళన చేపట్టారు. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విపత్తును విఠలాచార్య సినిమా లాగా జయించానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విపత్తులను ఆపడానికి చంద్రబాబు ఏమైనా భగవంతుడా అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా తెలుపలేదని అన్నారు. ఇటు ప్రత్యేక హోదా రాక.. అటు ప్యాకేజీ నిధులూ లేక.. ఏపీని రెంటికి చెడ్డ రేవడిలా చంద్రబాబు తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ అనే పదానికి అర్థం తెలియని చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పెథాయ్‌ తుపాన్‌ కారణంగా జనం అల్లాడుతుంటే చంద్రబాబు రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌లలో అందరికీ స్వీట్లు పంచుతున్నారని విమర్శించారు.  

వరప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా తెస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దానిని గాలికి వదిలేశారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ ఒత్తిడితో చంద్రబాబు మళ్లీ ప్రత్యేక హోదా పాట పాడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని తెలిపారు. ప్రజల నుంచి చంద్రబాబు ఊసరవెల్లిలాగా రంగులు మార్చారని వ్యాఖ్యానించారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం చేయాలని రాష్ట్రం నుంచి కేంద్రానికి ఒక లేఖ కూడా చంద్రబాబు రాయలేదని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. ఓ ప్రైవేటు పోర్టును కాపాడేందుకు దుగ్గరాజపట్నం పోర్టు కోసం బాబు ప్రయత్నించలేదని ఆరోపించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయంలోనూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.

రాజ్యసభ రేపటికి వాయిదా..
విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభమైన తర్వాత విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడం సభ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ప్రభాకర్‌ రెడ్డిలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement