సాక్షి, పేరేచర్ల: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్‌సీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందే ప్రకటించినట్లు పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత రాజీనామాలు చేయనున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు.. ఆ వెంటనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు.
ఏపీ భవన్‌లో ఆమరణ నిరశన: ‘‘హోదా విషయంలో ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఇదివరకే చెప్పాం. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా, చెయ్యకున్నా వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాత్రం స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్‌కు వెళతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అయిన ఏపీ భవన్‌లోనే నిరాహార దీక్షకు దిగుతారు’’ అని వైఎస్ జగన్ చెప్పారు.
విద్యార్థులకు వైఎస్ జగన్ విజ్ఞప్తి: ‘‘ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేపట్టబోయే నిరాహార దీక్షకు విద్యార్థిలోకం, యువతరం సంఘీభావం తెలపాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ‘‘అక్కడ ఢిల్లీలో మన ఎంపీలు ఆమరణ దీక్ష చేస్తారు. వారికి మద్దతుగా ఏపీలోని అన్ని మండలాల్లో విద్యార్థులు వారి వారి కళాశాలల ప్రాంగణాల్లో సంఘీభావ దీక్షలు చేపట్టాలని కోరుతున్నాను. టీడీపీ ఎంపీలు కూడా మనతో కలిసి వస్తే, మొత్తానికి మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలుచేసి ఆమరణ దీక్షకు దిగితే.. వారికి మద్దతుగా రాష్ట్రమంతటా నిరసనలు జరిగితే కేంద్రం తప్పక దిగివస్తుంది. ప్రత్యేక హోదా ఒక్కటే ఏపీకి సంజీవని. హోదా వస్తేనే ప్రతి జిల్లా కేంద్రం హైదరాబాద్ మాదిరి అవకాశాల గనిలా మారుతుంది’’ అని వైఎస్ జగన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment