విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పార్థసారథి, పక్కన శివనాగేంద్రం, తుమ్మల బుడ్డి
ఉయ్యూరు: పేదలకు కట్టించి ఇచ్చే జీ+3 ఇళ్ల నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వ అవినీతిపై చర్చించేందుకు తాను ఒక్కడినే వస్తా.. దమ్ముంటే టీడీపీ నేతలు తనతో చర్చకు రావాలని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి సవాల్ విసిరారు. ఉయ్యూరు పట్టణంలో బుధవారం సాయంత్రం పార్థసారథి అఖిలపక్షంతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జీ+3 ఇళ్ల పేరిట టీడీపీ చేపట్టిన నిర్మాణంలో పేదలకు లబ్ధి కన్నా కాంట్రాక్టర్ లబ్ధికే పెద్దపీట వేశారన్నారు. పేదలకు పెనమలూరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చింది వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని చెప్పారు. తన హయాంలో ఉయ్యూరు పట్టణంలో బహిరంగంగా సుమారు వెయ్యి మందికి పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. తాము పంపిణీ చేసిన లబ్ధిదారుల్లో అనర్హులు ఎవ్వరైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే అది పరిశీలించి వాటిని రద్దు చేస్తామని బహిరంగంగా అందరికీ తెలిపానన్నారు.
పేదల నుంచి స్థలాలు లాక్కున్నది మీరుకాదా?
పేదలందరికీ సుమారు 72 గజాల స్థలాన్ని ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చామని, వారికి తాము పట్టాలు అందించామని చెప్పారు. నాడు మేము స్థల సేకరణ జరిపి పేదలకు పట్టాలు పంచిన తరువాత పట్టాలు పొందిన వారి కనీస అనుమతి కూడా తీసుకోకుండా వారికి కేటాయించిన స్థలాలను బలవంతంగా టీడీపీ నేతలు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉయ్యూరులో ఇళ్ల అవసరం ఉన్న పేదలు తమ ప్రభుత్వం తరువాత పెరిగి ఉండి ఉంటారని, అయితే అప్పటికే కేటాయించిన స్థలాలను లాక్కుని అందరికీ న్యాయం అంటూ చెప్పే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదన్నారు. టీడీపీ నేతలు వారిష్టమొచ్చిన రీతిలో ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టును అవినీతి కంపు కొట్టించారని మండిపడ్డారు. లబ్ధిదారులు ఈ అంశంపై కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో తీసుకువస్తే మీరు ఎందుకు కోర్టుకు వెళ్లి ఆ స్టేటస్ కోని వెకేట్ చేయించకుండా ఎలా నిర్మాణాలు చేపడుతున్నారో వివరించాలన్నారు.
ట్యాక్సీ నడుపుకునేవారు పేదలు కాదా ?
కుటుంబ పోషణ కోసం ట్యాక్సీకి ఓనర్ అయితే ఇళ్ల స్థలం పొందేందుకు అర్హుడు కాడా అని పార్థసారథి మండిపడ్డారు. పట్టణంలో కొంత మంది ట్యాక్సీ డ్రైవర్లు ట్యాక్సీ నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. వాళ్లకు కారు ఉందనే కారణంతో ఇళ్ల స్థలాలు కేటాయించడం కుదరదు అని చెప్పడం నిజం కాదా అని ప్రశ్నించారు. మీరు కట్టమనగానే రూ.25 వేలు, రూ.50 వేలు డబ్బులు కట్టేవాళ్లు మీ దృష్టిలో నిజమైన పేదలు, కుటుంబాన్ని పోషించేందుకు రూ.40 వేలు కూడా విలువ చేయని ట్యాక్సీలు ఉన్న వాళ్లు పేదలు కాదా అని ధ్వజమెత్తారు.
రూ.2.50 లక్షలు అయ్యేదానికి రూ.6.50 లక్షలు దేనికి?
ప్రభుత్వం ప్రకటించిన కేటగిరీలలో ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు కేవలం రూ.2.50 లక్షలు అని అన్నారు. ఇళ్ల స్థలాల నిర్మాణంలో ప్రభుత్వం కేటాయించిన కేటగిరీలో 300 చదరపు అడుగుకు రూ.2,166లు, 365కు రూ.2000, 435కి రూ.1900లు ఖర్చుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఉయ్యూరు పట్టణంలో అనేకమంది బిల్డర్లు చదరపు అడుగు భూమి విలువతో కలుపుకుని రూ.1,200లకే విక్రయాలు జరుపుతున్నారన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం జర్మన్ టెక్నాలజీ అని, షేర్ వాల్ టెక్నాలజీ అని, అధునాత టెక్నాలజీ అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ రూ.2 వేలకుపైగా ఇళ్ల నిర్మాణానికి వసూలు చేస్తోందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఒక బిల్డర్ ఈ ఇళ్లను కేవలం రూ.1100లకే చదరపు అడుగుకు నిర్మాణం పూర్తి చేయగలడని చెప్పారు.
చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా
ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతిని నిరూపించేందుకు చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, టీడీపీ నేతలు సిద్ధంగా ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. లా అండ్ ఆర్డర్‌కు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మీకు ఇష్టం వచ్చిన చోట, మీరు ఎంత మంది వచ్చినా సరే పోలీసులు, విలేకరుల ఎదుట తాను ఒక్కడినే వచ్చి మీ అవినీతిని బయటపెడతానని ఛాలెంజ్ చేశారు. తాను చేస్తున్న సవాల్‌ను దమ్ముంటే స్వీకరించాలని కోరారు.సమావేశంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ ఉయ్యూరు పట్టణ, మండల అధ్యక్షులు జంపాన కొండలరావు, దాసే రవి, మహిళా విభాగం నాయకులు తెనాలి పద్మావతి, దిరిశం ఇందిర ప్రియదర్శిని, నాయకులు నిడుమోలు పూర్ణ, చింతల అప్పారావు, అబ్దుల్ సద్దాం, సీఐటీయూ పెనమలూరు డివిజన్ అధ్యక్షులు కోసూరి శివనాగేంద్రం, నాయకుడు కేవైకే రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment