
సాక్షి, విజయవాడ: మంత్రి ఆదినారాయణరెడ్డి సవాల్‌కు తాము రెడీ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ప్రతి సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ చరిత్రపై ఎక్కడైనా, ఎప్పుడైనా తాము బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. దొడ్డిదారిన మంత్రి అయిన ఆదినారాయణరెడ్డికి నిజంగా కడప రెడ్డి అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే చంద్రబాబు చరిత్ర, వైఎస్‌ఆర్ చరిత్రపై చర్చించేందుకు సిద్దమా అని చాలెంజ్ చేశారు. శనివారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మంత్రులు విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని, చంద్రబాబు విష కౌగిలిలో చిక్కుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి పంది బురదలో దొర్లినట్లు దొర్లుతూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తావా అని నిలదీశారు. విమర్శలు చేసేముందు మంత్రి ఆదినారాయణరెడ్డి తన రాజకీయ చరిత్ర ఏంటో చూసుకోవాలని సూచించారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని, అవాకులు, చెవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అచ్చి నువ్వు 9 నెలలు ఓపిక పట్టు..
మంత్రి అచ్చెన్నాయుడుపై కూడా సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అచ్చి నువ్వు 9 నెలలు ఓపికపట్టు, మీ అన్న చనిపోతే నీకు పదవి వచ్చింది. ఆ తర్వాత నీ బాగోతం అంతా శ్రీకాకుళం జిల్లా ప్రజలు బట్టబయలు చేస్తారు.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment