వైఎస్సార్‌సీపీ నేత కొలుసు పార్ధసారథి
హైదరాబాద్: ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిలో భయం పెరుగుతోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్ధసారధి విలేకరులతో మాట్లాడుతూ..శ్వేత పత్రం పేరుతో ప్రజలకు ఏమీ అర్ధం కాకుండా ఏవేవో విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. తన తప్పులు , చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అర్ధంకాని శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని ధ్వజమెత్తారు. తానే అందరికంటే సీనియర్‌ననే మానసిక రోగం చంద్రబాబుకు ఉందనే అనుమానం కలుగుతోందన్నారు.
ఎకానమీ అంతా తనకే తెలుసు అని మాట్లాడుతున్న చంద్రబాబును ప్రజలు ఏవిధంగా అర్ధం చేసుకోవాలన్నారు. జీతాలకు కూడా ఆర్బీఐ దగ్గర ఓడీ తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన అర్ధశాస్త్ర ప్రావీణ్యంతో ఆంధ్రరాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టారని దుయ్యబట్టారు. సహజవనరులను దోచుకుని తెలుగు తమ్ముళ్ల సంపద పెంచారని తీవ్రంగా విమర్శించారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా అన్న చంద్రబాబు 4 ఏళ్లలో ఏ చక్రం తిప్పారని సూటిగా ప్రశ్నించారు. ఆనాడు కేంద్రాన్ని ఎందుకు పొగిడారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
అలాగే చంద్రబాబుకు దేంట్లో అనుభవం ఉందో చెప్పాలన్నారు. పంటలకు కనీస మద్ధతు ధర కూడా ఇవ్వలేదు..రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందని ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో ప్రతీ రైతుకు రుణమాఫీ జరిగిందని, చంద్రబాబు హయాంలో రుణమాఫీ కానివారి సంఖ్యే ఎక్కువగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ తెచ్చిన రెండు రూపాయల కిలో బియ్యాన్ని రూ.5.50లకు పెంచిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అన్నచంద్రబాబు.. సోషియాలజీ గురించి మాట్లాడటమేంటని సూటిగా అడిగారు.
చంద్రబాబు సంక్షేమ పథకాల గురించి మాట్లాడటం అతిశయోక్తిగా ఉందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు సమాధానం చెప్పలేక శ్వేత పత్రం పేరుతో నాటకాలు ఆడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఆరోగ్య శ్రీని అటకెక్కించి,లక్షన్నర మందికి మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేసి, ఏదో సాధించానని బాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు తన పాలన, పథకాలతో ప్రజల్లోకి వెళ్లలేక పిరికి పందలా జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తేనే వృద్ధులు ఆత్మగౌరవంతో బతకగలుగుతారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment