సాక్షి, హైదరాబాద్ : సంతలో పశువులా అమ్ముడుపోయిన పశు సంవర్థకశాఖమంత్రి ఆదినారాయణరెడ్డికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ధ్వజమెత్తారు. చంద్రబాబు వేసిన బిస్కెట్‌లకు అమ్ముడుపోయి వైఎస్ జగన్‌పై రెచ్చిపోయి మాట్లాడితే రోడ్డు మీద పిచ్చికుక్కను కొట్టినట్లుగా కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె హెచ్చరించారు. చంద్రబాబు తన అసమర్ధ పాలనను కప్పిపుచ్చుకోవడానికి ఆంబోతుల్లాంటి మంత్రులను ఉసిగొల్పి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయిస్తున్నారన్నారు.
హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పద్మజ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ నాయకుడు నాలుగేళ్లుగా ఏం చేశాడో చెప్పే ధైర్యం లేక ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ఆదరణను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు. మాట తప్పడం, వెన్నుపోటు పొడవడం, అవినీతికి పాల్పడే చంద్రబాబు పంచన తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే నాయకులు చేరి దొంగ స్వామీజీల్లా మైక్‌ల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని పద్మజ విమర్శించారు.
పార్టీ ఫిరాయించి రాజీనామా చేసే దమ్ము లేని ఆదినారాయణరెడ్డి సెక్రటేరియట్ సాక్షిగా ప్రెస్‌మీట్‌లు పెట్టి రామసుబ్బారెడ్డి, నేను చెరో 50 శాతం వాటాలు పంచుకుంటున్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేశవరెడ్డి విద్యాసంస్థల ద్వారా రూ. 80 కోట్ల స్కాం జరిగితే దాని నుంచి తప్పించుకోవడానికి పార్టీ ఫిరాయించిన సంగతి అందరికీ తెలుసన్నారు. ఇంతకీ ఆదినారాయణ రెడ్డి దొంగా? దొరా? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నత తేడా ఉందన్నారు. వంద ఏళ్ల కాంగ్రెస్‌ను ఎదిరించి ప్రత్యేక పార్టీ పెట్టి 67 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న గుండె ధైర్యం గల వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడుకు శరీరం పెరిగింది కానీ మెదడు పెరగలేదని స్పష్టంగా అర్థం అవుతుందని పద్మజ విమర్శించారు. మహిళలపై అత్యాచారాలకు పూనుకునే ఆంబోతులకు వైఎస్ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. అన్ని దారులు మూసుకుపోయాయి కాబట్టి ప్రత్యేక హోదా అంశంపై పోరాడుతున్నారన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను పద్మజ ఖండించారు. జగన్‌కు ప్రజల గుండెల్లో ద్వారాలు తెలుచుకుంటున్నాయని, అందుకే చెయ్యిలో చెయ్యి వేసి ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారన్నారు. దాన్ని చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.
ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటాలు చేశారని, ప్రస్తుతం ఎంపీలతో రాజీనామాలు, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధపడ్డారన్నారు. జననేత దమ్మూ, ధైర్యాన్ని ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణగదొక్కి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి హోదా సంజీవని అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నాడన్నారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే పక్క రాష్ట్ర ఎమ్మెల్యేకి అభివృద్ధి కోసం రూ. 50 లక్షలు ఇస్తుంటే ఓటుకు కోట్ల కేసు పెట్టారని అంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 27వ తేదీన చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు గడుస్తుందని, సంబరాలు చేసుకోవాలని నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారని పద్మజ గుర్తు చేశారు. చంద్రబాబుకు మొట్టమొదటగా పందుల శాఖ ఇచ్చారని, అందుకే ఇలాంటి పందులను చేరదీసి రాష్ట్రం మీదకు ఉసిగొల్పుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన తప్పులకు చెంపలేసుకొని ప్రెస్‌మీట్ పెట్టి ప్రజలను క్షమించమని వేడుకొని ముక్కు నేలకు రాయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆదినారాయణరెడ్డికి బుద్ధి చెప్పడానికి దళిత సామాజిక వర్గమంతా కంకణం కట్టుకొని ఉందన్నారు. వైఎస్ జగన్‌పై అవాకులు పేలితే రోడ్డుపై పిచ్చికుక్కను కొట్టినట్లుగా కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment