వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు
శ్రీకాకుళం అర్బన్/శ్రీకాకుళం సిటీ: రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిపాలన, అన్యాయాలు, అక్రమాలను సమర్థంగా ఎదుర్కొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. నాలుగు రోజుల శిక్షణా తరగతుల్లో భాగంగా శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులోని ఆనందమయి కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన బూత్‌స్థాయి కన్వీనర్లకు, జిల్లా మహిళా విభాగం నాయకురాళ్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. గతంలో సామాన్యులు, పేదల జోలికి ఎవరూ వెళ్లేవారు కాదని, ఇపుడు వారిని కూడా హింస పెట్టే పరిస్థితి దాపురించిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయాలు రౌడీయిజం, వ్యాపారమయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి రాజకీయాలను దారిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు గౌరవం లేకుండా పోయిందని, జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో వారికే అధికారాలు కట్టబెట్టడం దారుణమన్నారు. శ్రీకాకుళం బలహీన వర్గాలకు చెందిన జిల్లా అని పేరు ఉందని, ఇక్కడి ప్రజలు మాత్రం బలహీనులు కారన్నారు.
పోలింగ్ స్టేషన్‌లో ప్రతి ఓటరుపై, ఓటర్ల జాబితాపై పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలన్నారు. ఒక పవిత్ర ఆశయం కోసం పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారని, ఆ పోరాటానికి మనమంతా అండగా ఉండాలన్నారు. కార్యక్రమానికి ముందు పార్టీ జెండాను పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఎగురవేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వి.పద్మావతి, చల్లా రవి, కె.ఎల్.ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మామిడి శ్రీకాంత్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్, జిల్లా అధికార ప్రతినిధులు శిమ్మ రాజశేఖర్, రొక్కం సూర్యప్రకాశరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, నేతలు ధర్మాన పద్మప్రియ, పిలక రాజ్యలక్ష్మి, టి.కామేశ్వరి, పితాని బాలకృష్ణ, గొండు రఘురాం, పొన్నాడ రుషి, అంబటి శ్రీనివాసరావు, మూకళ్ళ తాతబాబు, యజ్జల గురుమూర్తి, కోరాడ రమేష్, పడపాన సుగుణారెడ్డి, గుంట జ్యోతి, పి.సౌజన్య, కృష్ణవేణి, జె.ఎం.శ్రీనివాస్, మూకళ్ల సుగుణ, ఇఛ్చాపురం నియోజకవర్గ పార్టీ నేతలు కాళ్ల దేవరాజ్, పిఎం తిలక్, మంగి గణపతి, ఇప్పిలి లోలాక్షి, కడియాల ప్రకాష్, పులకల శ్రీరాములు, బద్దాన శ్రీకృష్ణ, తడక జోగారావు తదితరులు పాల్గొన్నారు.
మహోన్నత వ్యక్తి వైఎస్సార్
రక్తంలోని ఆవేశం, వ్యక్తిత్వంలోని ఆలోచన, మాటల్లోని వాక్సుద్ధి, తనచుట్టూ ఉన్న పరిసరాల్లో ఏ ఒక్కరూ కష్టాలు, ఇబ్బందులూ పడకుండా చూడాలనే మనసున్న మహోన్నత వ్యక్తి వై.ఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన ఆలోచనలతో తెరచిన పుస్తకమే ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’. ఇది అధికార లాలసతోనో, పదవీ కాంక్షతోనో, ధనార్జన కోసమో ఏర్పాటు చేసింది కాదు. ఏ మహానుభావుడైతే తన ఆలోచనలను, ఆశయాలను, సిద్ధాంతాలను వదిలాడో వాటిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయన తనయుడిగా జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు వచ్చారు. ప్రజల ఆరోగ్యం బాగు చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ, మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు పావలా వడ్డీకే రుణాలు అందించిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. అంతకు ముందు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రూ.900 కోట్లు అందజేస్తే ఐదున్నరేళ్ల వైఎస్ పాలనలో రూ.5లక్షల 30వేల కోట్లు రుణాలు మంజూరు చేశారు. లక్షలాది ఇళ్లు కట్టించి ఆపద్బాంధవుడయ్యాడు. రైతులను ఆదుకునేందుకు బృహత్తర నీటి ప్రాజెక్టులు తెచ్చి అపరభగీరథుడుగా ఖ్యాతి పొందారు. నిరుపేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో కార్పొరేట్ వైద్యం అందజేశారు. అందుకే ఆయన ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం పొందారు. శ్రీకృష్ణుని మరణం ఏవిధంగా అయితే పాండవులను కుంగదీసిందో వైఎస్ మరణం ప్రపంచంలోని 15 కోట్ల తెలుగుప్రజలను అంతలా కుంగదీసింది. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేశారు. శత్రువులను సైతం అక్కున చేర్చుకుని సహాయం చేసే గుణమే వైఎస్సార్‌సీపీ భావజాలం. స్వార్థం కోసమో, పదవుల కోసమో పనిచేయకుండా ప్రజల అభివృద్ది, సంక్షేమమే ద్యేయంగా పనిచేయడమే పార్టీ సిద్ధాంతం. రానున్న ఎన్నికల్లో మహిళలే ముఖ్య భూమిక పోషించి పార్టీ అధికారంలోకి వచ్చేలా చేయాలి. – భూమన కరుణాకరరెడ్డి,శ్రీకాకుళం–విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్
ఎన్నికలకు సిద్ధంకావాలి
రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకం. గతంలో మహిళలకు ఓటు లేదు. ఇపుడు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణ, పోలింగ్‌బూత్ కన్వీనర్ల పాత్ర ఎంతో కీలకం. క్షేత్రస్థాయి నుంచి పార్టీ జెండా, దాని ఆవశ్యకత, జెండాలోని 9 అంశాల ప్రాముఖ్యతను బూత్‌స్థాయి కన్వీనర్‌లకు విశదీకరించి, వాటిని గ్రామీణస్థాయిలో ప్రజలకు తెలియజేయాలి. రాబోయే ఎన్నికల సంగ్రామంలో పోరాడేందుకు బూత్‌స్థాయి కన్వీనర్లకు, సభ్యులకు ఈ శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయి.– ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్
సోషల్ మీడియా పాత్ర చాలా కీలకం
రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర కీలకం. ప్రస్తుతం ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండదేమోగానీ, సెల్‌ఫోన్ లేని ఇళ్లంటూ ఉండదు. 2010 నుంచి సోషల్ మీడియా ప్రాముఖ్యత చాలా ఎక్కువైంది. 15 నుంచి 40 ఏళ్లమధ్య వయస్సు ఉన్న వారు 90 శాతం మంది సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియాను ఉపయోగించి మంచి ఫలితాలు సాధించింది. 2016లో కేరళలో జరిగిన ఎన్నికల్లో 60శాతం ఓట్లను సోషల్ మీడియా ప్రభావితం చేసింది. సోషల్ మీడియా బృందానికి తగిన శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. సమచార హక్కు చట్టంపై కూడా సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. దీని ద్వారా అధికారులు, ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వెలికితీయవచ్చు.– ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి, శిక్షకుడు
మహిళల పాత్రే కీలకం
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళలదే కీలకపాత్ర. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామన్న చంద్రబాబు హామీని నమ్మి మహిళలంతా మోసపోయారు. ఇప్పుడు వారంతా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ పాలనలో చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రేషన్ డిపోల్లో 9 నిత్యావసర వస్తువులు ఇచ్చేవారు. ఇప్పుడు కేబియ్యం తప్ప మరే ఇతర వస్తువులూ అందడం లేదు. రాజధాని నిర్మాణమంటూ 57వేల ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 2018–19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు మంజూరు చేయని దుస్థితి. ఒకవేళ నిధులు మంజూరు చేస్తే అవి ఎక్కడ బాబు జేబులోకి వెళ్లిపోతాయోనని కేంద్రపెద్దల ఆలోచన. ఆరు నెలలుగా బీదలకు ఉపాధిహామీ వేతనాలు అందని దుస్థితి.
– ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్
జగన్‌తోనే సంక్షేమ రాజ్యం సాధ్యం
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోనే సంక్షేమ రాజ్యం సాధ్యం. జనంలో పార్టీ బలంగా ఉంది. దీనిని బూత్‌స్థాయికి తీసుకువెళ్లాలి. జగన్ తనశక్తి, యుక్తులతో ప్రజాసంకల్ప పాదయాత్ర చేపడుతున్నారు. ఈ పాదయాత్రకు వస్తున్న జనాలను ఓటర్లుగా మలచుకుని బూత్‌వద్దకు తీసుకువచ్చే గురుతర బాధ్యత మనందరిపైనా ఉంది. గడచిన ఎన్నికల్లో మన పార్టీ వైఫల్యాలను విశ్లేషించుకున్నాం. వైఎస్సార్ ఆశయాలు, సిద్ధాతాల సాధనే ధ్యేయంగా వచ్చిన జగన్‌ను గెలిపించుకుంటేనే ఆయన లక్ష్యాన్ని నెరవేర్చినవారమవుతాం. పార్టీ బూత్‌స్థాయి కన్వీనర్లు సైనికుల్లా తయారవ్వాలి. జగన్‌పై చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి. క్షేత్రస్థాయినుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకే ఈ శిక్షణా తరగతులు.– తమ్మినేని సీతారాం, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు
చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదు
‘దేశంలో ఉండే ప్రజలకు న్యాయం జరిగేందుకు అనేక చట్టాలు ఉన్నా అమలు అంతంతమాత్రమే. రాజకీయాల్లో కులం, మతం అధిక పాత్ర పోషిస్తున్నాయి. ఇళ్లు, పింఛన్, రేషన్‌కార్డులు, రుణాలను వైఎస్ ఇచ్చారని, వాటన్నింటినీ చంద్రబాబు తీసివేశారు. ప్రశ్నిస్తే పసుపుచొక్కా వేసుకుంటేనే ఇస్తామని చెప్పడం విడ్డూరం. ఇదేనా సామాజిక న్యాయం. – బొడ్డేపల్లి నర్సింహులు, సీనియర్ దళిత నాయకులు
Comments
Please login to add a commentAdd a comment