ఎంవీ కృష్ణారావుకు నివాళులు అర్పిస్తున్న తమ్మినేని, పార్టీనేతలు
శ్రీకాకుళం అర్బన్: నాలుగేళ్ల పాలనలో యువత, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలకు సీఎం చంద్రబాబు చేసిన మోసాన్ని వివరించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన యూత్ ర్యాలీ నిర్వహిస్తున్నామని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. దీనిని విజయవంతం చేయాలని యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో యువత, విద్యార్థులకు చంద్రబాబు ఎన్నో హామీలు గుప్పించారన్నారు. బాబు వస్తేనే జాబు అని, జాబు కావాలంటే బాబు రావాలని నమ్మబలికారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఈ నాలుగేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడు జాబు కావాలంటే బాబు పోవాలనే నినాదంతో యువత ముందుకు వెళుతోందన్నారు. బాబు చేసిన మోసానికి నిరసనగా యువత, విద్యార్థులతో 22వ తేదీ గురువారం భారీర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.
హోదా ప్రజలందరి ఆకాంక్ష
రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళంలోని కలెక్టరేట్ వద్ద మార్చి 1న పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని తమ్మినేని సీతారాం, కృష్ణదాస్ తెలిపారు. ప్రత్యేక హోదా ప్రజలందరి ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగానే జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో ఉద్యమాలు, దీక్షలు చేస్తున్నారన్నారు. ప్రత్యేకహోదా ఏమైనా సంజీవనా అని, ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పిన బాబు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు అన్యాయం జరిగిందని చెప్పడం దారుణమన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి విద్యార్ధులు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ఈనెల 22వ తేదీన, మార్చినెల 1వ తేదీన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నా కార్యక్రమాల ఏర్పాట్లు కోసం చర్చించారు.
సీనియర్ నాయకుడు, ఇచ్ఛాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎం.వి.కృష్ణారావు మరణం తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పార్టీ నేతలు తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, నర్తు రామారావుతో పాటు పలువురు మౌనం పాటించారు. ఈ సమావేశంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, పార్టీ నేతలు తమ్మినేని చిరంజీవినాగ్, కాళ్ల దేవరాజ్, మామిడి శ్రీకాంత్, కెవిజి సత్యనారాయణ, ఎం.వి.స్వరూప్, ఖండాపు గోవిందరావు, తడక జోగారావు, బెవర మల్లేశ్వరరావు, మూకళ్ల తాతబాబు, ఎస్.నాగేశ్వరరావు, పేడాడ అశోక్, పిట్ట ఆనంద్‌కుమార్‌రెడ్డి, ఆర్.చిట్టిబాబు, కడియాల ప్రకాష్, పాలిశెట్టి మధుబాబు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment