
‘వంచన వ్యతిరేక దీక్ష’లో వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనేక పోరాటాలు చేశారని, హోదా కోసం గుంటూరులో వైఎస్ జగన్ ఆమరణ దీక్ష చేస్తే.. ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని దీక్షను భగ్నం చేసిన చరిత్ర మీది కాదా అంటూ సీఎం చంద్రబాబు నాయుడును ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. విశాఖపట్నం వేదికగా వైఎస్సార్‌సీపీ నేతలు సోమవారం భారీ ఎత్తున చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’ లో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా హోదా కోసం చంద్రబాబు ఏనాడూ పోరాడింది లేదని, హోదా కోసం కేంద్రాన్ని అడిగిన దాఖలాలు లేవని తెలిపారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించగానే.. ఢిల్లీ వెళ్లి జైట్లీని సన్మానించిన ఘనుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.
హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడింది వైఎస్సార్‌సీపీనే అని, హోదా ఇవ్వకుండా కేంద్రం ఏ విధంగా మోసం చేసిందో ఏపీ ప్రజలకు తెలియజేసింది వైఎస్సార్‌సీపీయే అని గుర్తు చేశారు. హోదా సాధన కోసం అవిశ్వాసంపై తాము అన్ని పార్టీలను ఒప్పించామన్నారు. కానీ సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు మాత్రం యూటర్న్ తీసుకుని ఎన్డీయే నుంచి వైదొలగడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఐదుగురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి నిరవధిక దీక్షకు పూనుకున్నా భగ్నం చేశారంటూ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.
కేంద్రం, రాష్ట్రం దిగిరాకపోగా వైఎస్సార్‌సీపీ ఎంపీల దీక్షలను చంద్రబాబు భగ్నం చేయించారని ఆరోపించారు. ఇప్పటికీ చంద్రబాబు ఏపీ ప్రజలను వంచన చేసే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. గుంటూరులో దీక్షకు 30 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రజాధనాన్ని వృథా చేశారని చెప్పారు. తిరుపతిలో ధర్మపోరాటం దీక్ష పెట్టి ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని, ఇందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో సభ ఎందుకు పెడుతున్నారో ప్రజలకు చంద్రబాబు చెప్పాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని.. మాలో ఊపిరి ఉన్నంతవరకు హోదా కోసం పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment