వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఒంగోలు: ఏపీ ప్రజల కష్టాలతో పోల్చుకుంటే తమ పదవులు గడ్డిపోచలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఢిల్లీలో ఆమరణ దీక్ష తర్వాత తొలిసారిగా ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టిన వైవీ సుబ్బారెడ్డికి ఘన స్వాగతం లభించింది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ ఎంపీలతో కలిసి వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న పోరాటాన్ని కొనియాడారు. స్థానిక సింగరకొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో ఎంపీ పదవులకు రాజీనామా చేశామన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచన మేరకు భవిష్యత్ కార్యాచరణ కొనసాగిస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒకరోజు దీక్ష.. నయవంచన దీక్ష అని విమర్శించారు. టీడీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు మోసాలవల్లే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం హోదా ఇవ్వట్లేదని అభిప్రాయపడ్డారు. దీక్షతో చంద్రబాబు ప్రజాధనం కాజేయాలని చూస్తున్నారని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధమని, ప్రజాక్షేత్రంలోనే టీడీపీకి బుద్ధి చెప్తామని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment