ఆశావహుల క్యూ | ZPTC And MPTC Elections Second Phase Nominations | Sakshi
Sakshi News home page

ఆశావహుల క్యూ

Published Fri, Apr 26 2019 8:14 AM | Last Updated on Fri, Apr 26 2019 8:14 AM

ZPTC And MPTC Elections Second Phase Nominations - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  తొలి విడత ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల దాఖలు, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 24 జెడ్పీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ నుంచి అత్యధికంగా 93, కాంగ్రెస్‌ నుంచి 54, బీజేపీ నుంచి 36 మంది బీ ఫారాలు తమకే వస్తాయనే ధీమాతో నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు 294 ఎంపీటీసీ స్థానాలకు 1,911 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో అత్యధిక నామినేషన్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులవే కావడం విశేషం. మరోవైపు నేటినుంచి ప్రారంభం కానున్న రెండో విడత, తర్వాత జరిగే మూడో విడత నామినేషన్ల పర్వంలోనూ గులాబీ పార్టీ తరఫున బరిలో ఉండేందుకు ఇలాంటి పోటీ నెలకొంటుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

దీంతో ప్రాదేశిక ఎన్నికల ఫలితాలపై గులాబీ పార్టీ ఇప్పటికే పూర్తి ధీమాతో ఉంది. అయితే టీఆర్‌ఎస్‌లో పోటెత్తుతోన్న ఆశావహులతో పార్టీనే నమ్ముకుని పని చేస్తోన్న కార్యకర్తల్లో ఎవరికి బీ ఫారాలు ఇవ్వాలో తెలియక గులాబీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలే ఖరారు చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు తమ క్యాంపు కార్యాలయాల్లో ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.

జెడ్పీ చైర్మన్‌ గిరీకీ తీవ్ర పోటీ  
ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లా పరిషత్‌ల పరిధుల్లో టీఆర్‌ఎస్‌ నుంచి చాలా మంది ఆశావహులు పోటీ పడుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఇంకా ఎవరి పేర్లు ప్రచారంలోకి రాలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి పేరును టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా నుంచి మాజీ మంత్రి టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పి.రాములు కుమారుడు భరత్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భార్య అమలతో పాటు  జిల్లాకు చెందిన కోళ్ల వెంకటేష్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ వీరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే చర్చ జరుగుతోంది.

నారాయణపేట జిల్లా నుంచి డీసీఎంఎస్‌ చైర్మన్‌ నిజాంపాష, మద్దూర్‌కు చెందిన జెడ్పీ మాజీ కో–ఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ సలీం, కృష్ణ మండలానికి చెందిన శివరాజ్‌ పాటిల్,  సీనియర్‌ నాయకుడు ఎల్కోటి నారాయణరెడ్డి ఆశావహులు రేసులో ఉన్నారు. వనపర్తి జిల్లా నుంచి పెద్దమందడి మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మెఘారెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డితో పాటు విష్ణువర్ధన్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌ గిరిలో ముందజలో ఉన్నట్లు తెలుస్తోంది. గద్వాల జిల్లాలో మానవపాడు మండలానికి చెందిన సరితతో పాటు గట్టు భీముడు సతీమణి పేరు కూడా ప్రచారంలో ఉంది. అలంపూర్‌  నియోజకవర్గం నుండి పలువురు సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల తర్వాత జెడ్పీ చైర్మన్, చైర్‌పర్సన్ల అభ్యర్థులను ప్రకటించే వీలుంది కాబట్టి అప్పటి వరకు వేచి చూద్దామనే ఆలోచనతో ఆశావహులున్నారు.

∙కాంగ్రెస్‌ పార్టీలోనూ జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థుల వేట కొనసాగుతుంది. మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్మన్‌ రేసులో రంగారెడ్డి గూడకు చెందిన దుష్యంత్‌రెడ్డి పేరును పార్టీ ఖరారు చేసింది. ఆయన నవాబ్‌పేట జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా నుంచి డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ భార్య డాక్టర్‌ అనురాధ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. నారాయణపేట జిల్లా ఉట్కూర్‌కు చెందిన సూరయ్యగౌడ్‌ పేరు కూడా ప్రచారంలో ఉంది. వనపర్తి జిల్లాలో అభ్యర్థుల వేటలో ఆ పార్టీ నాయకత్వం ముమ్మరంగా వేటకొనసాగిస్తోంది. బీజేపీ పార్టీ నుంచి జెడ్పీ చైర్మన్ల రేసులో ఎవరెవరు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఎవరి పేర్లు కూడా కనీసం ప్రచారంలోనూ రాలేదు.  

ఆ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకం  

అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు త్వరలోనే జరగనున్న ప్రాదేశిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే వలసల పార్టీగా పేరొందిన కాంగ్రెస్‌ నుంచి పోటీకి సిద్ధమవుతోన్న అభ్యర్థుల్లో గెలిచిన తర్వాత ఎవరు కారెక్కుతారో అనే ఆందోళన హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు హస్తానికి చెయ్యిచ్చి కారెక్కిన విషయం తెలిసిందే.

దీంతో ఈ ఎన్నికల్లో గెలిచే ప్రతి అభ్యర్ధి పార్టీ వీడకుండా ఏం చేయాలో అనే దానిపై కాంగ్రెస్‌ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఇటు బీజేపీ సైతం ఉమ్మడి జిల్లాలో పట్టుకోసం పాకులాడుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు డీకే అరుణతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పాలమూరు ఎంపీ జితేందర్‌రెడ్డి సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు ఇంకా పలువురు నేతలు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటేనే గానీ భవిష్యత్‌లో ఉమ్మడి జిల్లాలో పార్టీకి మనుగడ లేని పరిస్థితి నెలకొంది. దీంతో అరుణ, జితేందర్‌రెడ్డి తమతమ అభ్యర్థుల గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement