Nominations of candidates
-
తొలి విడత నోటిఫికేషన్ జారీ.. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: తొలి విడత సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు, తమిళనాడులోని విలవన్కోడ్, త్రిపురలోని రామ్‌నగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను సైతం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 28న నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. బిహార్‌లో మాత్రం స్థానిక వేడుక నేపథ్యంలో నామినేషన్లకు ఈ నెల 28వ తేదీ వరకు గడువు విధించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరుగనున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో అత్యధికంగా తమిళనాడులో 39 స్థానాలు, రాజస్తాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఐదు స్థానాల చొప్పున, బిహార్‌లో 4, పశ్చిమ బెంగాల్లో 3, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండు స్థానాల చొప్పున, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, నాగా లాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షదీ్వప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరుగనుంది. -
మరో ఏడుగురికి బీజేపీ టికెట్లు!
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ ఏడుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే అధికారికంగా జాబితా విడుదల చేయలేదు. బీజేపీ నాయకత్వం ఆయా అభ్యర్థులకు ఫోన్లు చేసి పార్టీ తరఫున నామినేషన్లు వేసుకోవాల్సిందిగా సూచించింది. దీనితో ఇప్పటివరకు 106 మందిని ప్రకటించినట్టు అయింది. మరో ఐదు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మిగతా 8 స్థానాలను పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేనకు కేటాయించారు. కీలక స్థానాలకు ఎంపిక శేరిలింగంపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్ పేరు ఖరారైంది. నిజానికి ఈ సీటుకోసం జనసేన ప్రయత్నం చేసింది. కానీ తనకు సంబంధించిన చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలోని కీలకమైన సీటు కావడంతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పట్టుబట్టి రవికుమార్ యాదవ్‌కు ఇప్పించుకున్నారు. ఇక మల్కాజిగిరిలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు.. పెద్దపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు టికెట్లు ఇచ్చారు. సంగారెడ్డి నుంచి పులిమామిడి రాజు, నాంపల్లి నుంచి రాహుల్‌చంద్ర, కంటోన్మెంట్ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్‌ల పేర్లు ఖరారైనట్టు తెలిసింది. ఇంకా నర్సంపేట, మధిర, అలంపూర్, దేవరకద్ర, చాంద్రాయణగుట్ట సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. చాంద్రాయణగుట్ట అభ్యరి్థగా సత్యనారాయణ ముదిరాజ్ పేరును ఇంతకుముందే ప్రకటించినా.. అనారోగ్య కారణాలతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరితేదీ కావడంతో.. ఈ ఐదు సీట్లకు వెంటనే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. నేడు నామినేషన్లు.. ప్రచార సభల్లో కేంద్రమంత్రులు శుక్రవారం బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు, ప్రచార సభల్లో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. వరంగల్‌లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, చేవెళ్లలో బీఎల్ఎన్ వర్మ, కొల్లాపూర్‌లో పురుషోత్తం రూపాలా తదితరులు పర్యటించనున్నారు. ఈ నెల 13 నుంచి 27 వరకు జరిగే బీజేపీ ఎన్నికల ప్రచార సభలు, కార్యక్రమాల్లో ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డాలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నేతలు పాల్గొంటారని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తెలిపారు. టికెట్ ఖరారు సమాచారం అందిన నేతలు నియోజకవర్గం అభ్యర్థి 1.మల్కాజిగిరి రాంచందర్‌రావు 2.మేడ్చల్ విక్రమ్‌రెడ్డి 3.పెద్దపల్లి దుగ్యాల ప్రదీప్‌రావు 4.శేరిలింగంపల్లి రవికుమార్ యాదవ్ 5.నాంపల్లి రాహుల్ చంద్ర 6.కంటోన్మెంట్ కృష్ణప్రసాద్ 7.సంగారెడ్డి పులి మామిడి రాజు -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ.. బద్వేలు బరిలో 15 మంది
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేలు ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. బద్వేలు బరిలో నామినేషన్ వేసిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. పలువురు అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ అనంతరం పోటీలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ రోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి నామినేషన్ గడువు వరకూ 27 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలనలో 9 మంది తిరస్కరణకు గురయ్యారు. చివరగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 15 మంది అభ్యర్థులు బద్వేల్ ఉపఎన్నిక పోటీలో నిలిచారు. హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నిక పోటీ నుంచి 12 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. హుజురాబాద్‌లో నామినేషన్ వేసిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ సతీమణి జమున తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్తులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో 30 మంది అభ్యర్థులకు గాను రెండు ఈవీఎంలతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. -
ఆరుతోనే సరి..!
సాక్షి, వరంగల్ రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు సాగింది. ప్రాదేశికానికి వచ్చే సరికే చతికిలపడినట్లయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 401 గ్రామాలకు గాను 107 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అహర్నిశలు కష్డపడి ఏకగ్రీమమయ్యేందుకు కృషి చేశారు. కాని ప్రాదేశిక ఎన్నికల్లో ప్రయత్నం చేసినా వారి కృషి ఫలించలేదు. గ్రామ పం చాయతీ ఎన్నికల్లో కనిపించిన స్పందన పరిషత్ ఎన్నికల్లో కనిపించలేదు. నజరానా తెచ్చిన తంటా.. సర్పంచ్ ఎన్నికలప్పుడు ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు నుంచి ప్రభుత్వం నుంచి నజరానా అం దుతుంది. అంతేగాకుండా ఎమ్మెల్యేలు తమ సీడీఎఫ్ నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు ఏకగ్రీవమవడానికి కారణమని చెప్పొచ్చు. దక్కని ఫలితం.. జిల్లాలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల మాధిరిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా ఏకగ్రీవం చేసేందుకు టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఏకగ్రీవాల కోసం ఎమ్మెల్యేలు పల్లెల్లో తిరుగుతూ ఇతర పార్టీలకు చెందిన వారిని పార్టీలోకి చేర్చుకుంటూ వారికి ఇతర పదవులపై భరోసా ఇచ్చారు. పోటీలేకుండా చేయాలని ఎమ్మెల్యేలు సాధ్యమైనంత వరకు కృషి చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మరో అడుగు ముందుకేసి ఏకగ్రీవం చేసిన ఎంపీటీసీ స్థానానికి తన సీడీఎఫ్ నిధుల నుంచి రూ.15లక్షలు వెచ్చి ంచి అభివృద్ధి పనులు చేస్తానని హామీలు ఇచ్చా రు. అయినప్పటికీ పోటీ తప్పలేదు. ఎమ్మెల్యేలు ఎంత కృషి చేసినా ఫలితం దక్కలేదు. జిల్లాలో 16 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీలు స్థానాలున్నాయి. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నామినేషన్లు స్వీకరించారు. రెండు దశల్లో జరిగే మండలల్లో అభ్యర్థులకు గుర్తులు సైతం కేటాయించారు. మూడో విడతలో జరిగే మండలాల్లో ఈ నెల 6 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంది. ఆ మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు నామినేషన్ వేసిన వారు విత్‌డ్రా చేసుకుని ఆయా స్థానాల నుంచి ఒక్కరు మిగిలితే ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. ఏకగ్రీమైన గ్రామాలివే.. రాయపర్తి మండలంలోని కొండాపురంలో ఎలగందుల యాకనారయణ, కేశావాపురంలో బానోత్ శ్వేత, దుగ్గొండి మండలంలో మల్లంపల్లిలో పల్లాటి జయపాల్ రెడ్డి, సంగెం మండలం కుంటపల్లిలో కందకట్ల కళావతి, వర్ధన్నపేట మండలంలో నల్లబెల్లి ఎంపీటీసీ జ్యోతి మాధవరావు, దమ్మన్నపేటలో చొప్పరి సోమలక్ష్మీలను ఏకగ్రీవాలుగా ఎన్నుకున్నారు. జెడ్పీటీసీలు ఒక్కటి కూడా ఏకగ్రీవం కాకపోవడం గమనార్హం. 107 గ్రామాలు ఏకగ్రీవం ఇటీవల జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో 401 గ్రామ పంచాయతీలుండగా అందులో 107 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవం చేసిన గ్రామ పంచాయతీకి రూ.10లక్షల నిధులు కేటాయిస్తామని, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు సైతం సీడీఎఫ్ నిధుల నుంచి గ్రామ అభివృద్ధి నిధులు కేటాయిస్తామని హామీలు ఇచ్చారు. అలాగే కొన్ని గ్రామాల్లో వేళం పాటలు సైతం నిర్వహించి ఏకగ్రీవం చేశారు. గ్రామ పంచాయతీలు ఏకగీవ్రం కావడంతో జిల్లా ఎన్నికల అధికారులు, రాజకీయ నాయకులకు పని భారం తప్పింది. ఇప్పుడు అయితే దాదాపు 172 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నెల 6తో తెలిపోనుంది. ఇంకా ఎక్కడైన ఏకగ్రీవాలు అవుతాయో లేవోనని తేలనుంది. -
లెక్క తేలుస్తారు..
ఎన్నికలు అనగానే అభ్యర్థులు డబ్బును లెక్క చేయరు. పరిమితికి మించి విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. వీటన్నింటినీ నియంత్రించేందుకు, ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసాపై కన్నేసింది. స్టాటికల్ సర్వేలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అభ్యర్థుల ఖర్చుపై నిఘా ముమ్మరం చేశాయి. మొదటి విడత బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు తెలియడంతో వారు ఖర్చు ఎంత చేయాలనే అంశాలపై ఆయా బృందాలు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమయ్యాయి. సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో 20 జెడ్పీటీసీ, 289 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతి విడతలోనూ పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ఖర్చుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు అభ్యర్థుల ఖర్చు వివరాలను స్టాటికల్ సర్వేలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్ బృందం, వీడియో వ్యూవింగ్ టీమ్‌ల ద్వారా సేకరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు చేయాల్సిన ఖర్చు ఎంత? అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే తీసుకోనున్న చర్యలు ఏమిటి? అనే అంశాలపై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులు రూ.లక్షన్నర వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తే ఎన్నికల సంఘం తీసుకునే చర్యల గురించి వ్యయ పరిశీలకులు అభ్యర్థులకు వివరిస్తున్నారు. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ గత నెల 22న విడుదల కాగా.. 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు తేలడంతో వారికి వ్యయ పరిశీలకులు అవగాహన సదస్సులు నిర్వహించి.. ఖర్చు ఎంత చేయాలనే దానిపై వివరిస్తున్నారు. ఇక రెండు, మూడో విడత అభ్యర్థులకు కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి.. లెక్కలపై వివరించనున్నారు. 20 బృందాలు.. అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చు వివరాలను 20 బృందాలు పరిశీలించనున్నాయి. స్టాటికల్ సర్వేలెన్స్ టీమ్ 20 బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 20 గ్రామాల్లో పర్యటిస్తున్నాయి. ఒక్కో బృందంలో ఇద్దరు సభ్యులు, ఒక అధికారి ఉంటా రు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది.. అభ్యర్థులు ఎంత ఖర్చు చేస్తున్నారు? అనే విషయాలపై ఈ బృందాలు దృష్టి సారిస్తాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు స్టాటికల్ సర్వేలెన్స్ టీమ్ పని తీరును పర్యవేక్షించనున్నాయి. ఇక వీడియో సర్వేలెన్స్ టీమ్ అభ్యర్థుల ప్రచార వివరాలను ఎప్పటికప్పుడు వీడియో తీయనున్నారు. వాటిని వీడియో సర్వేలెన్స్ టీమ్.. వీడియో వ్యూవింగ్ బృందాలకు అప్పగిస్తారు. వారు ఈ వీడియోలను భద్రపరుస్తారు. వీడియో సర్వేలెన్స్ టీమ్, వీడియో వ్యూవింగ్ టీమ్‌లు మండలానికి ఒకటి చొప్పున ఉంటాయి. ఈ బృందాలతోపాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మీడియా మానిటరింగ్ కమిటీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. గీత దాటితే వేటే.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేస్తే వేటు వేసే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సభలు, సమావేశాలు, ప్రచారాలకు సంబంధించి ఖర్చు వివరాలను ఫలితాలు వెలువడిన తర్వాత అధికారులకు అప్పగించాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం రోజువారీ లెక్కలు వ్యయ పరిశీలకులకు అందజేయాలి. జెడ్పీటీసీ అభ్యర్థి రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.లక్షన్నర వరకు ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఇవి పూర్తిస్థాయిలో అమలు జరిగేలా చేయడం కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు ఖర్చు ఎక్కువగా పెడితే వారిని అనర్హులుగా ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం 45 రోజుల్లోగా ఆయా అభ్యర్థులు అధికారులకు లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. సమర్పించని పక్షంలో ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వారిపై చర్యలు తీసుకోనున్నారు. -
రెండో విడత బరిలో414 మంది
మిర్యాలగూడ : ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్లో నిర్వహించనున్న రెండవ విడత నామినేషన్ల ఉపసంహరణ గురువారంతో ముగిసింది. ఏప్రిల్ 26వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పది మండలాల్లో పది జెడ్పీటీసీలు, 109 ఎంపీటీసీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. నాలుగు ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. 105 ఎంపీటీసీలకు, పది జెడ్పీటీసీలకు గాను మొత్తం 413 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 105 ఎంపీటీసీల స్థానాలకు గాను 363 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా పది జెడ్పీటీసీలకు 51 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.ఈ నెల 10వ తేదీన ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. నాలుగు ఎంపీటీసీలు ఏకగ్రీవం మిర్యాలగూడ డివిజన్ పరిధిలో రెండవ విడత ఎన్నికలు నిర్వహించే ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 109 ఎంపీటీసీ స్థానాలకు మిర్యాలగూడ నియోజకవర్గంలో మూడు ఎంపీటీసీలు, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. నాలుగు ఎంపీటీసీ స్థానాలు కూడా టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడ మండలంలో తక్కెళ్లపాడు ఎంపీటీసీగా పాశం హైమావతి (టీఆర్ఎస్), వెంకటాద్రిపాలెం –1 ఎంపీటీసీగా నూకల సరళ (టీఆర్ఎస్), ఊట్లపల్లి ఎంపీటీసీగా నకిరేకంటి కళావతి (టీఆర్ఎస్), నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిర్మలగిరి సాగర్ మండలంలోని రంగుండ్ల ఎంపీటీసీగా ఆంగోతు అమ్లిలచ్చిరామ్‌నాయక్ (టీఆర్ఎస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
‘మూడు’ ముగిసింది!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మూడో దశ జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఏడు జెడ్పీటీసీ, 92 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా.. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు గురువారం చివరిరోజు కావడంతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పోటీ చేసే వివిధ పార్టీల అభ్యర్థులతో మండల పరిషత్ కార్యాలయాలు కోలాహలంగా మారాయి. 7 జెడ్పీటీసీ స్థానాలకు 79 నామినేషన్లు, 92 ఎంపీటీసీ స్థానాలకు 606 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎక్కువగా నామినేషన్లు దాఖలు కాగా.. సీపీఎం, సీపీఐ, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు ఆయా ప్రాంతాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు పోటాపోటీగా నామినేషన్లు వేశాయి. జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు ఇలా.. 7 జెడ్పీటీసీ స్థానాలకు 79 నామినేషన్లు దాఖలు కాగా.. వాటిలో బీజేపీ నుంచి 5, సీపీఐ 1, సీపీఎం 2, కాంగ్రెస్ 21, టీఆర్ఎస్ 35, టీడీపీ 5, గుర్తింపు పొందిన పార్టీల నుంచి 3, స్వతంత్రులు ఏడుగురు నామినేషన్లు వేశారు. అలాగే 92 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి 22, సీపీఐ 32, సీపీఎం 45, కాంగ్రెస్ 157, టీఆర్ఎస్ 267, టీడీపీ 28, గుర్తింపు పొందిన పార్టీల నుంచి 5, స్వతంత్రులు 50 మంది నామినేషన్లు వేశారు. -
జోరుగా నామినేషన్లు
ఇచ్చోడ: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల పర్వం ఊ పందుకుంది. మూడో విడతలో ఎన్నికలు జరిగే ఆయా స్థానా ల కు మంగళవారం నుంచి నామినేష న్లు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. మూడో విడతలో ఎన్నికలు జరిగే స్థానాలకు నామినేషన్ దాఖలు చేసేందుకు గురువారం ఆఖరు గడువు ఉంది. దీంతో చివరి రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండో రోజు 160 నామినేషన్లు.. మూడోవిడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో భాగంగా రెండో రోజు మొత్తం 160 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరు మండలాల్లోని ఆరు జెడ్పీటీసీ, 58 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 26 నామినేషన్లు రాగా, 58 ఎంపీటీసీ స్థానాలకు 134 నామినేషన్లు వచ్చాయి. ఇచ్చోడ,సిరికొండ, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్‌లోని ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి మొత్తం 35 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ నుంచి 39, టీఆర్ఎస్ నుంచి 46, ఇతర పార్టీ నుంచి ఒకటి, స్వతంత్రులు 13మంది అభ్యర్థులు నామినేషన్లు చేశారు. మండలాల్లోని జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 26 నామినేషన్లు దాఖలు కాగా ఇచ్చోడలో ఏడు, సిరికొండలో రెండు, ఇంద్రవెల్లి లో మూడు, నార్నూర్‌లో ఐదు, గాదిగూడలో ఆ రు, ఉట్నూర్‌లో మూడు నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు.. మూడో విడతలో ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లోని పోటీ పడే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం ఆఖరు గడువుగా ఉంది. అనంతరం శుక్రవారం నామినేషన్లను ప రిశీలన ప్రక్రియ కొనసాగనుంది. పరిశీలనలో తి రస్కరించిన నామినేషన్లపై అప్పీలు చేసుకునేం దుకు శనివారం వరకు గడువుంది. తద్వారా నా మినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన వెంటనే బరి లో ఉండే అభ్యర్ధుల జాబితాను ప్రకటించనున్నారు. -
రెండో విడత ప్రక్రియకు శ్రీకారం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ విడతలో ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు మండలాల్లో 6 జెడ్పీటీసీ, 85 ఎంపీటీసీ స్థానాలకు పోరు సాగనున్న విషయం విదితమే. తొలిరోజు జెడ్పీటీసీ స్థానాలకు 12, ఎంపీటీసీ స్థానాలకు 86 నామినేషన్లు దాఖలయ్యాయి. జెడ్పీటీసీ సీట్లకు వేసిన 12 నామినేషన్లలో బీజేపీ తరఫున ఒకటి, కాంగ్రెస్ 4, టీఆర్ఎస్ 4, టీడీపీ తరఫున ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థులు ఒకరు నామినేషన్ వేశారు. ఏన్కూరు మండలంలో ఒకటి, కల్లూరు మండలంలో ఒకటి, పెనుబల్లి మండలంలో 4, సత్తుపల్లి మండలంలో 2, తల్లాడలో ఒకటి, వేంసూరులో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 86 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో బీజేపీ తరఫున 2, సీపీఐ ఒకటి, సీపీఎం 6, కాంగ్రెస్ 20, టీఆర్ఎస్ 35, టీడీపీ 14, స్వతంత్ర అభ్యర్థులు 8మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఏన్కూరు మండలంలో 21, కల్లూరు మండలంలో 10, పెనుబల్లి మండలంలో 16, సత్తుపల్లి మండలంలో 16, తల్లాడ మండలంలో 11, వేంసూరు మండలంలో 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 28వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా ప్రతి రోజూ ఉదయం 10: 30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 29వ తేదీన అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులు 30వ తేదీన తగిన ఆధారాలతో అధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మే 2వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు బరిలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. మే 10వ తేదీన ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో నలుగురు ఎంపీటీసీ అభ్యర్థుల ఉపసంహరణ తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ స్థానాలకు 162 మంది, ఎంపీటీసీ స్థానాలకు 761 మంది బరిలో ఉన్నారు. అయితే శుక్రవారం కూసుమంచి మండలంలో ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఇద్దరు టీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. -
ఆశావహుల క్యూ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తొలి విడత ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల దాఖలు, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 24 జెడ్పీటీసీ స్థానాలకు టీఆర్ఎస్ నుంచి అత్యధికంగా 93, కాంగ్రెస్ నుంచి 54, బీజేపీ నుంచి 36 మంది బీ ఫారాలు తమకే వస్తాయనే ధీమాతో నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు 294 ఎంపీటీసీ స్థానాలకు 1,911 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో అత్యధిక నామినేషన్లు టీఆర్ఎస్ అభ్యర్థులవే కావడం విశేషం. మరోవైపు నేటినుంచి ప్రారంభం కానున్న రెండో విడత, తర్వాత జరిగే మూడో విడత నామినేషన్ల పర్వంలోనూ గులాబీ పార్టీ తరఫున బరిలో ఉండేందుకు ఇలాంటి పోటీ నెలకొంటుందని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ప్రాదేశిక ఎన్నికల ఫలితాలపై గులాబీ పార్టీ ఇప్పటికే పూర్తి ధీమాతో ఉంది. అయితే టీఆర్ఎస్లో పోటెత్తుతోన్న ఆశావహులతో పార్టీనే నమ్ముకుని పని చేస్తోన్న కార్యకర్తల్లో ఎవరికి బీ ఫారాలు ఇవ్వాలో తెలియక గులాబీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలే ఖరారు చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు తమ క్యాంపు కార్యాలయాల్లో ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. జెడ్పీ చైర్మన్ గిరీకీ తీవ్ర పోటీ ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లా పరిషత్‌ల పరిధుల్లో టీఆర్ఎస్ నుంచి చాలా మంది ఆశావహులు పోటీ పడుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఇంకా ఎవరి పేర్లు ప్రచారంలోకి రాలేదు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి.రాములు కుమారుడు భరత్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భార్య అమలతో పాటు జిల్లాకు చెందిన కోళ్ల వెంకటేష్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ వీరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే చర్చ జరుగుతోంది. నారాయణపేట జిల్లా నుంచి డీసీఎంఎస్ చైర్మన్ నిజాంపాష, మద్దూర్‌కు చెందిన జెడ్పీ మాజీ కో–ఆప్షన్ సభ్యుడు మహ్మద్ సలీం, కృష్ణ మండలానికి చెందిన శివరాజ్ పాటిల్, సీనియర్ నాయకుడు ఎల్కోటి నారాయణరెడ్డి ఆశావహులు రేసులో ఉన్నారు. వనపర్తి జిల్లా నుంచి పెద్దమందడి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మెఘారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డితో పాటు విష్ణువర్ధన్‌రెడ్డి జెడ్పీ చైర్మన్ గిరిలో ముందజలో ఉన్నట్లు తెలుస్తోంది. గద్వాల జిల్లాలో మానవపాడు మండలానికి చెందిన సరితతో పాటు గట్టు భీముడు సతీమణి పేరు కూడా ప్రచారంలో ఉంది. అలంపూర్ నియోజకవర్గం నుండి పలువురు సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల తర్వాత జెడ్పీ చైర్మన్, చైర్పర్సన్ల అభ్యర్థులను ప్రకటించే వీలుంది కాబట్టి అప్పటి వరకు వేచి చూద్దామనే ఆలోచనతో ఆశావహులున్నారు. ∙కాంగ్రెస్ పార్టీలోనూ జెడ్పీ చైర్మన్ అభ్యర్థుల వేట కొనసాగుతుంది. మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ రేసులో రంగారెడ్డి గూడకు చెందిన దుష్యంత్‌రెడ్డి పేరును పార్టీ ఖరారు చేసింది. ఆయన నవాబ్‌పేట జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ భార్య డాక్టర్ అనురాధ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. నారాయణపేట జిల్లా ఉట్కూర్‌కు చెందిన సూరయ్యగౌడ్ పేరు కూడా ప్రచారంలో ఉంది. వనపర్తి జిల్లాలో అభ్యర్థుల వేటలో ఆ పార్టీ నాయకత్వం ముమ్మరంగా వేటకొనసాగిస్తోంది. బీజేపీ పార్టీ నుంచి జెడ్పీ చైర్మన్ల రేసులో ఎవరెవరు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఎవరి పేర్లు కూడా కనీసం ప్రచారంలోనూ రాలేదు. ఆ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకం అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు త్వరలోనే జరగనున్న ప్రాదేశిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే వలసల పార్టీగా పేరొందిన కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమవుతోన్న అభ్యర్థుల్లో గెలిచిన తర్వాత ఎవరు కారెక్కుతారో అనే ఆందోళన హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు హస్తానికి చెయ్యిచ్చి కారెక్కిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికల్లో గెలిచే ప్రతి అభ్యర్ధి పార్టీ వీడకుండా ఏం చేయాలో అనే దానిపై కాంగ్రెస్ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఇటు బీజేపీ సైతం ఉమ్మడి జిల్లాలో పట్టుకోసం పాకులాడుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకే అరుణతో పాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన పాలమూరు ఎంపీ జితేందర్‌రెడ్డి సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు ఇంకా పలువురు నేతలు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటేనే గానీ భవిష్యత్‌లో ఉమ్మడి జిల్లాలో పార్టీకి మనుగడ లేని పరిస్థితి నెలకొంది. దీంతో అరుణ, జితేందర్‌రెడ్డి తమతమ అభ్యర్థుల గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
‘రెండు’కు రెడీ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత నామినేషన్ల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం బుధవారం పూర్తి కావడంతో రెండో విడత నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మే 10వ తేదీన జరిగే రెండో విడత ఎన్నికల్లో 6 జెడ్పీటీసీ, 85 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా.. ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 29వ తేదీన అధికారులు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులు 30వ తేదీన తగిన ఆధారాలతో అధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. మే 2వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మే 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ప్రధాన రాజకీయ పక్షాలు పరిషత్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి. అభ్యర్థుల ఎంపిక.. నామినేషన్లు వేయించడంపై కసరత్తు చేస్తున్నాయి. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండో విడతలో ఎన్నికలు జరిగే మండలాలివే.. మండలం : ఏన్కూరు ఎంపీటీసీ స్థానాలు–10.. బురదరాఘవాపురం, భద్రుతండా, ఏన్కూరు–1, ఏన్కూరు–2, జన్నారం, కేసుపల్లి, రేపల్లెవాడ, శ్రీరామగిరి, టీఎల్.పేట, తిమ్మారావుపేట. మండలం : కల్లూరు ఎంపీటీసీ స్థానాలు–18.. బాతుపల్లి, చండ్రుపట్ల, చెన్నూరు–1, చెన్నూరు–2, చిన్నకోరుకొండి, కల్లూరు–1, కల్లూరు–2, కల్లూరు–3, కప్పలబంధం, లింగాల, మర్లపాడు, ముచ్చవరం, నారాయణపురం, పెద్దకోరుకొండి, పేరువంచ, పుల్లయ్య బంజర, తాళ్లూరు, ఎర్రబోయినపల్లి. మండలం : పెనుబల్లి ఎంపీటీసీ స్థానాలు–15.. చింతగూడెం, గణేష్‌పాడు, గౌరారం, కరాయిగూడెం, కోండ్రుపాడు, కుప్పెనకుంట్ల, లంకపల్లి, లింగగూడెం, మండాలపాడు, పెనుబల్లి, రామచంద్రరావు బంజర, టేకులపల్లి, తాళ్లపెంట, వీఎం.బంజర, ఏరుగట్ల. మండలం : సత్తుపల్లి ఎంపీటీసీ స్థానాలు–13.. బేతుపల్లి, బుగ్గపాడు, చెరుకుపల్లి, గంగారం, కాకర్లపల్లి, కిష్టాపురం, కిష్టారం, రామగోవిందాపురం, రామనగరం, రేజర్ల, రుద్రాక్షపల్లి, సిద్ధారం, తుంబూరు. మండలం : తల్లాడ ఎంపీటీసీ స్థానాలు–16.. అన్నారుగూడెం–1, అన్నారుగూడెం–2, బిల్లుపాడు, కలకొడిమ, కొడవటిమెట్ట, కుర్నవల్లి, మల్లారం, మిట్టపల్లి, ముద్దునూరు, నూతనకల్, పినపాక, రామానుజవరం, తల్లాడ–1, తల్లాడ–2, తల్లాడ–3, వెంగన్నపేట. మండలం : వేంసూరు ఎంపీటీసీ స్థానాలు–13.. అడసర్లపాడు, భీమవరం, చౌడవరం, దుద్దెపుడి, జయలక్ష్మీపురం, కల్లూరుగూడెం, కందుకూరు, కుంచపర్తి, లచ్చన్నగూడెం, మర్లపాడు, రామన్నపాలెం, వి.వెంకటాపురం, వేంసూరు. -
రెండో రోజు 82
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలిదశ స్థానిక పోరు జరిగే ఏడు మండలాలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది. రెండో రోజైన మంగళవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల దాఖలులో కాస్త ఊపు కనిపించింది. 82 నామినేషన్లు రిటర్నింగ్ అధికారులకు అందాయి. 96 ఎంపీటీసీ స్థానాలకు 76, ఏడు జెడ్పీటీసీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. షాబాద్ జెడ్పీటీసీకి కాంగ్రెస్ అభ్యర్థితోపాటు మరో ఇద్దరు స్వతంత్రులు నామినేషన్లు సమర్పించారు. మొయినాబాద్ జెడ్పీటీసీకి టీఆర్ఎస్ తరఫున ఒకరు, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీకి కాంగ్రెస్ నుంచి మరొకరు నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. మొత్తం మీద రెండు రోజుల్లో కలిపి ఏడు జెడ్పీటీసీలకు తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిదశ ఎన్నికలు జరిగే 96 ఎంపీటీసీలకు 76 మంది అభ్యర్థులు 77 నామినేషన్లు వేశారు. మొదటి, రెండో రోజు కలుపుకుంటే నామినేషన్ల సంఖ్య 115కు చేరుకుంది. -
రెండో రోజు.. 46
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొంత ఊపందుకుంది. మొదటి విడతలో 7 జెడ్పీటీసీ, 112 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండో రోజైన మంగళవారం జెడ్పీటీసీ స్థానాలకు 4 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 42 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటిరోజు కన్నా.. ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు ఎక్కువగానే దాఖలయ్యాయి. మొదటి విడతలో కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, సింగరేణి, తిరుమలాయపాలెం మండలాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అందులో మంగళవారం కామేపల్లి, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం స్థానాలకు ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి. మొదటిరోజు జెడ్పీటీసీ స్థానాలకు మూడు నామినేషన్లు దాఖలు కావడంతో మొత్తం నామినేషన్ల సంఖ్య ఏడుకు చేరింది. ఇక ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కామేపల్లి మండలంలో 7, ఖమ్మం రూరల్ మండలంలో 1, కూసుమంచిలో 11, ముదిగొండలో 6, నేలకొండపల్లిలో 1, సింగరేణి లో 11, తిరుమలాయపాలెం మండలంలో 5 నామి నేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులకు కలిపి టీఆర్ఎస్ తరఫున 18, కాంగ్రెస్ 16, బీజేపీ ఒకటి, సీపీఎం 10, టీడీపీ ఒకటి, స్వతంత్ర అభ్యర్థుల తరఫున 8 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం రెండు రోజుల్లో 54 నామినేషన్లు దాఖలయ్యాయి. -
నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలుకానుంది. స్థానిక పోరు మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తుండగా.. తొలిదశ ఎన్నికలు జరగనున్న ఏడు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఇదే రోజు నుంచి తొలిపోరు మండలాల పరిధిలోని 96 ఎంపీటీసీలు, ఏడు జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. నామినేషన్ల దాఖలులో కొంత సమయం పెంచారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకే అవకాశం ఇవ్వగా.. ప్రాదేశిక ఎన్నికలకు మాత్రం సమయాన్ని మరింత పొడిగించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల దాఖలుకు 24వ తేదీ ఆఖరు. తొలిదశగా ఏడు మండలాల్లో ఎన్నికలు జరగనుండగా.. ఇందులో ఆరు పాత మండలాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి సంబంధించి నామినేషన్ల కేంద్రాన్ని హయత్‌నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. నామినేషన్ల అందజేతకు అవసరమైన సహాయాన్ని అందజేసేందుకు ప్రతి కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలి. ఈ వివరాలను రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. ఎన్నికల వ్యయ ఖర్చులన్నీ ఈ ఖాతా నుంచే జరపాలి. గతం కంటే ఈసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ఖర్చు పరిమితిని పెంచారు. జెడ్పీటీసీకి రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు, ఎంపీటీసీకి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జెడ్పీటీసీకి పోటీచేసే జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎంపీటీసీకి రూ.2.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు డిపాజిట్ మొత్తంలో కాస్త మినహాయింపు ఇచ్చారు. జెడ్పీటీసీకి రూ.2,500, ఎంపీటీసీకి రూ.1.250 డిపాజిట్ చేస్తే సరిపోతుంది. అయితే, ఈ అభ్యర్థులు తప్పనిసరి కులధ్రువీకరణ పత్రం లేదా గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన డిక్లరేషన్ అందజేయాల్సి ఉంటుంది. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థికి 21 ఏళ్ల వయసు నిండి ఉండాలి. ఒక్కరోజు తక్కువగా ఉన్నా అభ్యర్థి నామినేషన్లను తిరస్కరిస్తారు. -
ప్రాదేశిక ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
నిజామాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల సమరానికి నేడు తెర లేవనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సమరం మొదలు కానుంది. జిల్లాలో తొలి విడత ఎన్నికలకు సంబంధించి నేడు (సోమ వారం) నోటిఫికేషన్ జారీ కానుంది. నేటి నుం చే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కా నుంది. తొలి విడతలో నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈసారి మండల కేంద్రాల్లోనే ఎంపీటీసీఅభ్యర్థులతో పాటు జెడ్పీటీసీ అభ్యర్థుల కోసం నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని నామినేషన్ కేంద్రాల్లో నామపత్రాలు సమర్పించాల్సి ఉండేది. అయితే, ఈసారి మండల కేంద్రాల్లోనే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు మండలానికో రిటర్నింగ్ ఆఫీసర్‌ను నియమించారు. ఇక, ముగ్గురు ఎంపీటీసీలకు గాను ఒక రిటర్నింగ్ అధికారి, ఒక సహాయ రిటర్నింగ్ అధికారిని కూడా ఏర్పాటు చేశారు. వీరు అభ్యర్థుల నుంచి నామపత్రాలను స్వీకరిస్తారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 8 జెడ్పీటీసీలు, 100 ఎంపీటీసీలకు.. మొదటి విడతలో నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో నిజామాబాద్, మోపాల్, డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, మాక్లూర్, నవీపేట మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలోని 8 జెడ్పీటీసీ, 100 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు తొలి విడతలో జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే జెడ్పీటీసీ అభ్యర్థి ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే రూ.2500, ఇతరులు అయితే రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాలి. ఎంపీటీసీగా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1250, ఇతరులు రూ.2,500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. -
తుది సమరానికి తొలి అడుగు..
ఆత్మకూరు(పరకాల): గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్లు జిల్లాలో బుధవారం మొదలయ్యాయి. జిల్లాలో 401 గ్రామపంచాయతీలు ఉండగా ఇందులో మొదటి విడతలో నర్సంపేట, దుగ్గొండి, పర్వతగిరి, వర్ధన్నపేట, సంగెం మండలాల్లో మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. వీరి జాబితా ఖరారయ్యింది. బ్యాలెట్ పేపర్ల పంపిణీ పూర్తయ్యింది. నర్సంపేట మండలంలో 27 గ్రామ పంచాయతీలు, 238 వార్డులు, దుగ్గొండి మండలంలో 34 గ్రామపంచాయతీలు 282 వార్డులు, పర్వతగిరి మండలంలో 33 గ్రామపంచాయతీలు, 288 వార్డులు, వర్ధన్నపేట మండలంలో 18 గ్రామ పంచాయతీలు 170 వార్డులు, సంగెం మండలంలో 33 గ్రామపంచాయతీలు 286 వార్డులు ఉండగా వీటికి ఎన్నికలు మొదటి విడతలో ఈ నెల 21న జరగనున్నాయి. అలాగే రెండో విడతలో ఈ నెల 25న జరిగే పరకాల మండలంలో 10 గ్రామపంచాయతీలు, 94వార్డులు, నడికుడ మండలంలో 14 గ్రామపంచాయతీలు, 138వార్డులు, శాయంపేట మండలంలో 24 గ్రామపంచాయతీలు 212 వార్డులు, నల్లబెల్లి మండలంలో 29 గ్రామపంచాయతీలు 252 వార్డులు, ఖానాపూర్ మండలంలో 20 గ్రామ పంచాయతీలు 178 వార్డులు, రాయపర్తి మండలంలో 39గ్రామపంచాయతీలు 336 వార్డులు ఉన్నాయి. రెండో విడతకు సంబంధించి నేడు ఉపసంహరణలు జరగనున్నాయి. సర్పంచ్‌కు 36 నామినేషన్లు.. వార్డులకు 58 నామినేషన్లు.. మూడోవిడతలో జరిగే గ్రామపంచాయతీలకు బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మూడో విడత ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి. చెన్నారావుపేట మండలంలో 30 గ్రామపంచాయతీలు, 258వార్డులు, నెక్కొండ మండలంలో 39 గ్రామ పంచాయతీలు 340 వార్డులు, ఆత్మకూరు మండలంలో 16 గ్రామపంచాయతీలు152 వార్డులు, దామెర మండలంలో 14 గ్రామ పంచాయతీలు 132 వార్డులు, గీసుకొండ 21 గ్రామపంచాయతీలు 188 వార్డులకుగాను నామినేషన్లను స్వీకరిస్తున్నారు. చెన్నారావుపేటలో సర్పంచ్‌కు 8, వార్డు సభ్యులకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. నెక్కొండ మండలంలో సర్పంచ్‌కు 9 వార్డు సభ్యులకు 13, ఆత్మకూరు మండలంలో సర్పంచ్‌కు 6, వార్డు సభ్యులకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి. గీసుకొండ మండలంలో సర్పంచ్‌కు 5, వార్డు సభ్యులకు 14 నామినేషన్లు దాఖలు చేశారు. -
విచ్చలవిడిగా మహాకూటమి పార్టీల నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి పొత్తు ధర్మాన్ని కాలరాసింది. పోటీచేసే స్థానాల సంఖ్య తమకు ప్రధానం కాదని, గెలుపే ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పిన కూటమి భాగస్వామ్య పక్షాలు నామినేషన్ల చివరిరోజున తమ రాజకీయ ప్రతాపాన్ని చూపించాయి. పొత్తు, అవగాహనకు సంబంధించిన కనీస ధర్మాన్ని పాటించకుండా విచ్చలవిడిగా నామినేషన్లు దాఖలు చేసి గందరగోళంలో పడేశాయి. కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులపై టీజేఎస్, టీజేఎస్‌కు ఇస్తామని చెప్పిన చోట్ల కాంగ్రెస్, టీడీపీ కేటాయించిన స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులు పార్టీ బీ–ఫారాలతో నామినేషన్లు దాఖలు చేశారు. పొత్తుల్లో భాగంగా 94 స్థానాల్లో కాంగ్రెస్, 14 చోట్ల టీడీపీ, 8 స్థానాల్లో టీజేఎస్, 3 చోట్ల సీపీఐ పోటీచేస్తాయని ప్రకటించాయి. అయితే నామినేషన్ల దాఖలు చివరిరోజున పరిశీలిస్తే కాంగ్రెస్ 100, టీజేఎస్ 14, టీడీపీ 13, సీపీఐ 3 చోట్ల పోటీచేయడం గమనార్హం. 119 స్థానాలకు 130 నామినేషన్లు... వాస్తవానికి, కూటమి పార్టీల్లో సీట్ల సర్దుబాటు కుదిరితే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 119 మంది అభ్యర్థులు కూటమి పక్షాన పోటీలో ఉండాలి. కానీ, నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అధికారికంగా కూటమి పార్టీల బీ–ఫారాలతో 130 మంది బరిలో నిలవడం గమనార్హం. అంటే 11 స్థానాల్లో ఇంకా సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉందన్నమాట. కాంగ్రెస్ ఉల్లంఘనలిలా... కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ గందరగోళానికి శ్రీకారం చుట్టింది. 94 మందికి మాత్రమే బీ–ఫారాలు ఇవ్వాల్సి ఉన్నా.. చివరిరోజున మరో ఆరుగురికి ఇచ్చింది. ఇందులో హుజూరాబాద్, పటాన్చెరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే కూటమి పక్షాన అభ్యర్థులుగా నిలిచారు. అయితే, టీజేఎస్ ఆశిస్తున్న మిర్యాలగూడ స్థానాన్ని ఆదివారమే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. 94 స్థానాల పరిధిలోనే అక్కడ అభ్యర్థిని ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ ప్రకటించడానికి ముందే అక్కడ టీజేఎస్ పక్షాన విద్యాధర్‌రెడ్డికి ఆ పార్టీ బీ–ఫారం ఇచ్చింది. ఇక, 3 రోజుల క్రితమే దుబ్బాకలో టీజేఎస్ అభ్యర్థిని ప్రకటించింది. అయినా సోమవారం అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా మద్దుల నాగేశ్వర్‌రెడ్డి నామినేషన్ వేశారు. వరంగల్ (తూర్పు) స్థానానికి టీజేఎస్ అభ్యర్థిని ప్రకటించనప్పటికీ కాంగ్రెస్ తమకు వదిలివేస్తుందని ఆశించింది. కానీ, అక్కడ గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్రకు కాంగ్రెస్ బీ–ఫారం ఇచ్చింది. మెదక్‌లో జనార్దనరెడ్డికి టీజేఎస్ బీ–ఫారం ఇవ్వగా, కాంగ్రెస్ నుంచి ఉపేందర్‌రెడ్డి బరిలో దిగారు. అంబర్‌పేటలో లక్ష్మణ్ యాదవ్ (కాంగ్రెస్), రమేశ్ (టీజేఎస్) నామినేషన్లు వేశారు. మాట్లాడి పరిష్కరించుకుంటాం కొన్ని కారణాలతో కాంగ్రెస్ నామినేషన్లు వేయాల్సి వచ్చింది. కూటమి పార్టీలతో చర్చించి.. అందరితో మాట్లాడి ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటాం. కూటమిలో ఎలాంటి సమస్య ఉన్నా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాం. – ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమయం ఉంది..మాట్లాడతాం సీట్ల సర్దుబాటులో అన్ని పార్టీలు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. పొత్తు ధర్మాన్ని అందరూ కాపాడాల్సిందే. కూటమిలో ఉండే సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటాం. మాది సీట్ల కోసం ఏర్పడ్డ కూటమి కాదు. గెలుపే ప్రధానం. – ఎల్. రమణ టీజేఎస్.. తామేమీ తక్కువ కాదన్నట్లు... టీజేఎస్ కూడా తామేమీ తక్కువ కాదన్నట్టు చివరి రోజున ఇష్టారాజ్యంగా బీ–ఫారాలు ఇచ్చేసింది. తాము అధికారికంగా ప్రకటించిన మల్కాజ్గిరి, సిద్దిపేట, దుబ్బాక, మెదక్ స్థానాలతో పాటు ఖానాపూర్, ఆసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, చెన్నూరు, అశ్వారావుపేట, వర్ధన్నపేట, మిర్యాలగూడ, వరంగల్ (తూర్పు), మహబూబ్‌నగర్, అంబర్‌పేటల్లో పార్టీ బీ–ఫారాల మీదనే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో అంబర్‌పేట, వరంగల్(తూర్పు), మిర్యాలగూడ, వర్ధన్నపేట స్థానాలను టీజేఎస్‌కు కేటాయించాల్సి ఉన్నా వర్ధన్నపేట మినహా మూడు స్థానాల్లో కాంగ్రెస్ బీ–ఫారాలు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించిన ఖానాపూర్, స్టేషన్‌ఘన్‌పూర్, చెన్నూరు, ఆసిఫాబాద్ స్థానాల్లో టీజేఎస్ బీ–ఫారాలిచ్చింది. ఇక, కూటమిలోని మరో పక్షమైన తెలుగుదేశం పార్టీని కూడా టీజేఎస్ వదిలిపెట్టలేదు. ఆ పార్టీ పోటీ చేస్తున్న రెండు చోట్ల తమ అభ్యర్థులకు బీ–ఫారాలు ఇచ్చి నామినేషన్లు దాఖలు చేయించింది. ఇందులో మహబూబ్‌నగర్, అశ్వారావుపేట స్థానాలున్నాయి. టీజేఎస్ 14 చోట్ల పోటీచేస్తున్నప్పటికీ ఆ పార్టీకి 3 స్థానాల్లోనే స్పష్టత కనిపిస్తోంది. అందులో మల్కాజ్గిరి, సిద్దిపేట, వర్ధన్నపేట ఉన్నాయి. విత్‌డ్రా నాటికి నిర్ణయం కూటమిలో అనుకున్న ప్రకారం సీట్ల పంపిణీ ఉండాల్సిందే. టీజేఎస్‌కు ఇస్తామన్న 8 స్థానాల్లో కాంగ్రెస్ 6 స్థానాలకే స్పష్టత ఇచ్చింది. మరో 2 స్థానాల్లో చర్చలు జరిపాం. సీట్ల కేటాయింపు ఆలస్యంతో స్నేహపూర్వక పోటీ తప్పడం లేదు. దీంతో నష్టమే ఎక్కువ జరుగుతుంది. ముందుగా పోటీకి సిద్ధమైనా విత్‌డ్రా నాటికి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అదేమీ పెద్ద సమస్య కాదు. మాకు ఎజెండానే ముఖ్యం. – కోదండరాం 14 స్థానాలిచ్చినా.. 13 చోట్లనే టీడీపీ... పొత్తుల్లో భాగంగా టీడీపీకి 14 స్థానాలిస్తామని చెప్పినా 13 చోట్లనే పార్టీ బీ–ఫారాలతో నామినేషన్లు వేసింది. పటాన్చెరు స్థానాన్ని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ నందీశ్వర్‌గౌడ్, గడీల శ్రీకాంత్ మధ్య పోటీతో దాన్ని కాంగ్రెస్‌కు వదిలేసింది. దీంతో అక్కడ కాంగ్రెస్ తరఫున కాట శ్రీనివాస్‌గౌడ్ అభ్యర్థిగా నిలిచారు. కాంగ్రెస్, టీడీపీ మాత్రం ఒకరిపై మరొకరు పోటీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. కాంగ్రెస్‌కు వస్తుందని ఆశించిన ఇబ్రహీంపట్నంలో తొలుత ప్రకటించిన సామ రంగారెడ్డికే టీడీపీ బీ–ఫారం ఇచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ బీ–ఫారం వస్తుందని ఆశించిన మల్రెడ్డి రంగారెడ్డి మధ్యాహ్నం వరకు వేచిచూసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పొత్తు ధర్మానికి కట్టుబడి... కూటమిలో పొత్తు ధర్మానికి కట్టుబడింది సీపీఐ మాత్రమేనని నామినేషన్ల లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీ తమకు కేటాయించిన వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి స్థానాల్లో నామినేషన్లు వేసింది. అయితే, పొత్తు కోసం సీట్లు తగ్గించుకున్నా ఆ పార్టీకి రెబెల్స్ బెడద తప్పేటట్లు లేదు. వైరాలో సీపీఐ అభ్యర్థి విజయ నామినేషన్ వేయగా, అక్కడి నుంచి కాంగ్రెస్ రెబెల్‌గా రాములు నాయక్, హుస్నాబాద్ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మీద కాంగ్రెస్ రెబెల్‌గా అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నామినేషన్లు వేశారు. ఈ పోటీలు మంచిది కాదు కూటమి తరఫున పరస్పర, స్నేహపూర్వక పోటీ ఉండకూడదు. పరస్పర పోటీలకు సీపీఐ వ్యతిరేకం. మాకు కేటాయించిన మూడు సీట్లలోనే నామినేషన్లు వేశాం. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ ‘అదనం’గా నామినేషన్లు వేసిన చోట్ల ఉపసంహరించుకోవాలి. మరోపార్టీకి కేటాయించిన స్థానాల్లో పోటీ సరికాదు. – చాడ వెంకటరెడ్డి -
రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహాకూటమితో పాటు బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి సస్పెన్స్ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు సోమవారం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఎనలేని తాత్సర్యం చేస్తుండడం ఆశావహులకు ఆవేదన, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఒక్క టీఆర్ఎస్ మాత్రమే ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాలకు ఒకేసారి ప్రకటించడంతో పాటు... ప్రచారంలో నిమగ్నమైంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన మహాకూటమి ఇప్పటి వరకు మూడు జాబితాలు విడుదల చేసినా ఇంకా రెండు స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లోనే ఉంచారు. కాంగ్రెస్‌కు సంబంధించి శనివారం మూడో జాబితా విడుదల కాగా.. ఇందులో కొల్లాపూర్ స్థానానికి బీరం హర్షవర్ధన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అలాగే ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ కూడా ఇప్పటి వరకు మూడు జాబితాలు విడుదల చేసినప్పటికీ... రెండు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను వెల్లడించలేదు. ఈ పార్టీ జడ్చర్ల, కొల్లాపూర్ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈనెల 19వ తేదీ సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా.. మహాకూటమితో పాటు బీజేపీ మిగిలిపోయిన స్థానాలకు ఆదివారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఆది నుంచి అంతే.. టీఆర్ఎస్ను గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో జట్టు కట్టిన మహాకూటమిలోని పార్టీలు ఆది నుంచి పొత్తులు, లెక్కల సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూటమిలోని కాంగ్రెస్, టీడీపీకి మాత్రమే అభ్యర్థులకు స్థానం దక్కింది. కూటమిలో భాగస్వామ్యమైన టీజేఎస్, సీపీఐకి పోటీ చేసే అవకాశం లభించలేదు. మొత్తం 14 స్థానాలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మూడు సార్లు విడుదల చేసిన జాబితాలో పది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అలాగే కూటమి భాగస్వామ్యంలో భాగంగా రెండు స్థానాలు మహబూబ్‌నగర్, మక్తల్‌ను టీడీపీకి కేటాయించింది. ఇక మిగిలిన రెండు స్థానాలు దేవరకద్ర, నారాయణపేటకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటి విషయంలో ఎడతెగని సస్పెన్స్ కొనసాగుతోంది. సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండడంతో ఆదివారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, బీజేపీ సైతం కొల్లాపూర్, జడ్చర్ల స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో కొల్లాపూర్ నుంచి సుధాకర్‌రావు అభ్యర్థిత్వానికి బీజేపీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లెక్కల సమీకరణాలు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆయా పార్టీలకు కత్తిమీద సాములా మారింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 స్థానాలకు గాను రెండు స్థానాలు ఎస్సీ రిజర్వుడ్‌గా ఉన్నాయి. మిగిలిన 12 జనరల్ స్థానాల విషయంలో అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాల లెక్కలు ఆయా పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా బీసీలకు సముచిత స్థానం కల్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలోని జనరల్‌గా ఉన్న 12 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ముగ్గురు బీసీలకు అవకాశం కల్పించింది. షాద్‌నగర్ నుంచి అంజయ్య యాదవ్, కల్వకుర్తి నుంచి జైపాల్ యాదవ్, మహబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్లు దక్కాయి. అలాగే బీజేపీ నుంచి ఇప్పటి వరకు ప్రకటించిన 12 స్థానాల్లో ఐదుగురు బీసీలకు స్థానం దక్కింది. కల్వకుర్తి నుంచి టి.ఆచారి, నాగర్‌కర్నూల్ నుంచి దిలీప్ ఆచారి, కొడంగల్ నుంచి నాగూరావ్ నామాజీ, దేవరకద్ర నుంచి ఎగ్గని నర్సింహులు, మక్తల్ నుంచి కొండయ్యకు అవకాశం కల్పించారు. అయితే మహాకూటమి నుంచి కేవలం ఒక్క స్థానం మహబూబ్‌నగర్ నుంచి ఎర్ర శేఖర్‌కు మాత్రమే అవకాశం కలిగింది. దీంతో కూటమి అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాల రచ్చ కొనసాగుతోంది. కాగా, పెండింగ్‌లో ఉంచిన స్థానాలలో ముందు నుంచి పనిచేసుకుంటున్న వారికి అవకాశం కల్పించాలనే డిమాండ్‌ను కాంగ్రెస్ అధిష్టానం వద్దగా ఆశావహులు గట్టిగా వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఆదివారం రాత్రి వరకు మహాకూటమి, బీజేపీకి సంబంధించి నాలుగు స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తే సమీకరణాల లెక్కలు తేలనున్నాయి. -
మిగిలింది ఒక్కరోజే..
ఇన్నిరోజులు ఏ అసెంబ్లీ స్థానం ఎవరికి దక్కుతుందో తెలియక ఆశావహులు అయోమయంలో పడ్డారు. ఇప్పుటికి స్పష్టత రావడంతో నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో అందరూ సోమవారానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు నామినేషన్ వేసిన అభ్యర్థులు కూడా చివరి రోజు కార్యకర్తలు, సానుభూతిపరులతో కలిసి మరో సెట్ నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు రెండు నియోజకవర్గాల్లో మొత్తం 27 నామినేషన్లు దాఖలయ్యాయి. సాక్షి, మెదక్: నామినేషన్ల దాఖలకు ఇంకా ఒక్కరోజే గడువు మిగిలి ఉంది. ఆదివారం సెలవుదినం కావడంతో ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించడం లేదు. దీంతో నామినేషన్ల దాఖలుకు సోమవారం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు సోమవారం నామినేషన్లు వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. శనివారం మెదక్ నియోజకవర్గంలో ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. నర్సాపూర్ నియోకజవర్గంపరిధిలో ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా చివరి రోజున ఊరిగింపులతో నామినేషన్లు వేసేందుకు ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు. సోమవారం మంచి రోజు కావడంతో పద్మాదేవేందర్‌రెడ్డి మరోసెట్ నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. సోమవారం పద్మాదేవేందర్‌రెడ్డి స్వయంగా నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి సోమవారం భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల రాజయ్య కూడా చివరి రోజున మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో సైతం టీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి చివరి రోజున మరోసెట్ నామినేషన్ వేయనున్నారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు చివరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. నర్సాపూర్ బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. దీంతో పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. స్నేహపూర్వక పోటీపై సడలుతున్న ఆశలు మెదక్ నియోజకవర్గంలో స్నేహపూర్వక పోటీపై కాంగ్రెస్ ఆశావహుల్లో క్రమంగా ఆశలు సన్నగిల్లుతున్నాయి. తెలంగాణ జన సమితి ఇది వరకే మెదక్ నుంచి తమ పార్టీ పోటీచేస్తున్నట్లు ప్రకటించింది. పొత్తులో భాగంగా మెదక్ తమకే దక్కుతుందని ఆ పార్టీ స్పష్టంగా చెబుతుంది. అయితే మెదక్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు ఇంకా టికెట్ కోసం చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. శనివారం 13 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మెదక్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు ఆశించారు. అయితే మెదక్ పేరు లేకపోవటంతో నిరాశకు గురయ్యారు. అలాగే కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీ చేసేందుకు ఏఐసీసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో మెదక్ నుంచి ఈ రకమైన పోటీ కోసం కాంగ్రెస్ ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్ నుంచి పోటీ చేసేందుకు తనకు ఆవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఇతర నాయకులను కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకులు బట్టి జగపతి, బాలకృష్ణ తదితరులు మాజీ ఎంపీ విజయశాంతి ద్వారా చివరి ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. -
ఇక ఏకగ్రీవమే ముగిసిన నామినేషన్ల పరిశీలన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాజ్యసభ, శాసన మండళ్ల ద్వైవార్షిక ఎన్నికలకు వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లన్నీ సక్రమంగా ఉన్నాయి. ఖాళీలకు తగిన సంఖ్యలోనే అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినందున, ఈ నెల 19న ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసన సభ కార్యదర్శి ఓం ప్రకాశ్ మంగళవారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా బీకే. హరిప్రసాద్, రాజీవ్ గౌడ, బీజేపీ అభ్యర్థిగా ప్రభాకర కోరె, జేడీఎస్ అభ్యర్థిగా కుపేంద్ర రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగు ఖాళీలకు నలుగురే నామినేషన్లు దాఖలు చేసినందున, వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. స్వతంత్ర అభ్యర్థులుగా మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, నిబంధనల మేరకు లేనందున తిరస్కరించారు. శాసన మండలిలోని ఏడు ఖాళీలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా డాక్టర్ జీ. పరమేశ్వర, జయమ్మ బాలరాజ్, బోసు రాజు, హెచ్ఎం. రేవణ్ణ, బీజేపీ అభ్యర్థిగా కేఎస్. ఈశ్వరప్ప, జేడీఎస్ అభ్యర్థిగా శరవణ, ఈ రెండు పార్టీలు బలపరిచిన మరో అభ్యర్థి యుగంధర్ నామినేషన్లు దాఖలు చేశారు. అదనపు అభ్యర్థులెవరూ రంగంలో లేనందున వీరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం వరకు గడువుంది. అదే రోజు సాయంత్రం వీరంతా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
అర్హత సాధించింది 279 మంది.. తిరస్కరణ 75 రేపటితో ముగియనున్న ఉపసంహరణ గడువు సాక్షి, నల్లగొండ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన గురువారం ముగిసింది. ఇందులో వివిధ కారణాల వల్ల 75మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ప్రధానంగా ప్రతిపాదకుల పేర్లు చేర్చకపోవడం, అభ్యర్థుల సంతకాలు లేకపోవడంతో పాటు కొందరిపై కేసులు ఉండడంతో తిరస్కరణకు గురయ్యాయి. ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు 354మంది అభ్యర్థులు 617 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ఎన్నికల కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఉన్న 75మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. తద్వారా 279మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో రెండు లోక్‌సభ స్థానాలకు 23మంది, 12 అసెంబ్లీ స్థానాలకు 256మంది అభ్యర్థులు ఉన్నారు. శుక్రవారం అభ్యర్థుల నుంచి అధికారులు అప్పీలు స్వీకరిస్తారు. ఈ నెల 12వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు మిగిలింది. ఉపసంహరణ రోజే బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారులు వెల్లడిస్తారు.