సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ విడతలో ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు మండలాల్లో 6 జెడ్పీటీసీ, 85 ఎంపీటీసీ స్థానాలకు పోరు సాగనున్న విషయం విదితమే. తొలిరోజు జెడ్పీటీసీ స్థానాలకు 12, ఎంపీటీసీ స్థానాలకు 86 నామినేషన్లు దాఖలయ్యాయి. జెడ్పీటీసీ సీట్లకు వేసిన 12 నామినేషన్లలో బీజేపీ తరఫున ఒకటి, కాంగ్రెస్ 4, టీఆర్‌ఎస్ 4, టీడీపీ తరఫున ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థులు ఒకరు నామినేషన్ వేశారు. ఏన్కూరు మండలంలో ఒకటి, కల్లూరు మండలంలో ఒకటి, పెనుబల్లి మండలంలో 4, సత్తుపల్లి మండలంలో 2, తల్లాడలో ఒకటి, వేంసూరులో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 86 నామినేషన్లు దాఖలయ్యాయి.
వీటిలో బీజేపీ తరఫున 2, సీపీఐ ఒకటి, సీపీఎం 6, కాంగ్రెస్ 20, టీఆర్‌ఎస్ 35, టీడీపీ 14, స్వతంత్ర అభ్యర్థులు 8మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఏన్కూరు మండలంలో 21, కల్లూరు మండలంలో 10, పెనుబల్లి మండలంలో 16, సత్తుపల్లి మండలంలో 16, తల్లాడ మండలంలో 11, వేంసూరు మండలంలో 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 28వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా ప్రతి రోజూ ఉదయం 10: 30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 29వ తేదీన అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులు 30వ తేదీన తగిన ఆధారాలతో అధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మే 2వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు బరిలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. మే 10వ తేదీన ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
తొలి విడతలో నలుగురు ఎంపీటీసీ అభ్యర్థుల ఉపసంహరణ
తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ స్థానాలకు 162 మంది, ఎంపీటీసీ స్థానాలకు 761 మంది బరిలో ఉన్నారు. అయితే శుక్రవారం కూసుమంచి మండలంలో ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఇద్దరు టీఆర్‌ఎస్, ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment