లెక్క తేలుస్తారు..  | Telangana ZPTC And MPTC Elections Observation | Sakshi
Sakshi News home page

లెక్క తేలుస్తారు.. 

Published Sat, May 4 2019 7:03 AM | Last Updated on Sat, May 4 2019 7:22 AM

Telangana ZPTC And MPTC Elections Observation - Sakshi

ఎన్నికలు అనగానే అభ్యర్థులు డబ్బును లెక్క చేయరు. పరిమితికి మించి విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. వీటన్నింటినీ నియంత్రించేందుకు, ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసాపై కన్నేసింది. స్టాటికల్‌ సర్వేలెన్స్, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు అభ్యర్థుల ఖర్చుపై నిఘా ముమ్మరం చేశాయి. మొదటి విడత బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు తెలియడంతో వారు ఖర్చు ఎంత చేయాలనే అంశాలపై 
ఆయా బృందాలు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమయ్యాయి.


సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో 20 జెడ్పీటీసీ, 289 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతి విడతలోనూ పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ఖర్చుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆదేశాల మేరకు అభ్యర్థుల ఖర్చు వివరాలను స్టాటికల్‌ సర్వేలెన్స్, ఫ్లయింగ్‌ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్‌ బృందం, వీడియో వ్యూవింగ్‌ టీమ్‌ల ద్వారా సేకరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు చేయాల్సిన ఖర్చు ఎంత? అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే తీసుకోనున్న చర్యలు ఏమిటి? అనే అంశాలపై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

అయితే జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులు రూ.లక్షన్నర వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తే ఎన్నికల సంఘం తీసుకునే చర్యల గురించి వ్యయ పరిశీలకులు అభ్యర్థులకు వివరిస్తున్నారు. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ గత నెల 22న విడుదల కాగా.. 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు తేలడంతో వారికి వ్యయ పరిశీలకులు అవగాహన సదస్సులు నిర్వహించి.. ఖర్చు ఎంత చేయాలనే దానిపై వివరిస్తున్నారు. ఇక రెండు, మూడో విడత అభ్యర్థులకు కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి.. లెక్కలపై వివరించనున్నారు.
 
20 బృందాలు..  
అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చు వివరాలను 20 బృందాలు పరిశీలించనున్నాయి. స్టాటికల్‌ సర్వేలెన్స్‌ టీమ్‌ 20 బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 20 గ్రామాల్లో పర్యటిస్తున్నాయి. ఒక్కో బృందంలో ఇద్దరు సభ్యులు, ఒక అధికారి ఉంటా రు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది.. అభ్యర్థులు ఎంత ఖర్చు చేస్తున్నారు? అనే విషయాలపై ఈ బృందాలు దృష్టి సారిస్తాయి. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు స్టాటికల్‌ సర్వేలెన్స్‌ టీమ్‌ పని తీరును పర్యవేక్షించనున్నాయి. ఇక వీడియో సర్వేలెన్స్‌ టీమ్‌ అభ్యర్థుల ప్రచార వివరాలను ఎప్పటికప్పుడు వీడియో తీయనున్నారు. వాటిని వీడియో సర్వేలెన్స్‌ టీమ్‌.. వీడియో వ్యూవింగ్‌ బృందాలకు అప్పగిస్తారు. వారు ఈ వీడియోలను భద్రపరుస్తారు. వీడియో సర్వేలెన్స్‌ టీమ్, వీడియో వ్యూవింగ్‌ టీమ్‌లు మండలానికి ఒకటి చొప్పున ఉంటాయి. ఈ బృందాలతోపాటు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్, మీడియా మానిటరింగ్‌ కమిటీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.
 
గీత దాటితే వేటే.. 
జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేస్తే వేటు వేసే అవకాశం ఉంది. ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సభలు, సమావేశాలు, ప్రచారాలకు సంబంధించి ఖర్చు వివరాలను ఫలితాలు వెలువడిన తర్వాత అధికారులకు అప్పగించాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం రోజువారీ లెక్కలు వ్యయ పరిశీలకులకు అందజేయాలి. జెడ్పీటీసీ అభ్యర్థి రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.లక్షన్నర వరకు ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఇవి పూర్తిస్థాయిలో అమలు జరిగేలా చేయడం కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు ఖర్చు ఎక్కువగా పెడితే వారిని అనర్హులుగా ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం 45 రోజుల్లోగా ఆయా అభ్యర్థులు అధికారులకు లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. సమర్పించని పక్షంలో ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వారిపై చర్యలు తీసుకోనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement