విచ్చలవిడిగా మహాకూటమి పార్టీల నామినేషన్లు | 130 nominations for 119 seats | Sakshi
Sakshi News home page

పొత్తు ధర్మం చిత్తు!

Published Tue, Nov 20 2018 1:43 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

130 nominations for 119 seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమి పొత్తు ధర్మాన్ని కాలరాసింది. పోటీచేసే స్థానాల సంఖ్య తమకు ప్రధానం కాదని, గెలుపే ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పిన కూటమి భాగస్వామ్య పక్షాలు నామినేషన్ల చివరిరోజున తమ రాజకీయ ప్రతాపాన్ని చూపించాయి. పొత్తు, అవగాహనకు సంబంధించిన కనీస ధర్మాన్ని పాటించకుండా విచ్చలవిడిగా నామినేషన్లు దాఖలు చేసి గందరగోళంలో పడేశాయి. కాంగ్రెస్‌ అధికారిక అభ్యర్థులపై టీజేఎస్, టీజేఎస్‌కు ఇస్తామని చెప్పిన చోట్ల కాంగ్రెస్, టీడీపీ కేటాయించిన స్థానాల్లో టీజేఎస్‌ అభ్యర్థులు పార్టీ బీ–ఫారాలతో నామినేషన్లు దాఖలు చేశారు. పొత్తుల్లో భాగంగా 94 స్థానాల్లో కాంగ్రెస్, 14 చోట్ల టీడీపీ, 8 స్థానాల్లో టీజేఎస్, 3 చోట్ల సీపీఐ పోటీచేస్తాయని ప్రకటించాయి. అయితే నామినేషన్ల దాఖలు చివరిరోజున పరిశీలిస్తే కాంగ్రెస్‌ 100, టీజేఎస్‌ 14, టీడీపీ 13, సీపీఐ 3 చోట్ల పోటీచేయడం గమనార్హం.  

119 స్థానాలకు 130 నామినేషన్లు... 
వాస్తవానికి, కూటమి పార్టీల్లో సీట్ల సర్దుబాటు కుదిరితే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 119 మంది అభ్యర్థులు కూటమి పక్షాన పోటీలో ఉండాలి. కానీ, నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అధికారికంగా కూటమి పార్టీల బీ–ఫారాలతో 130 మంది బరిలో నిలవడం గమనార్హం. అంటే 11 స్థానాల్లో ఇంకా సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉందన్నమాట.

కాంగ్రెస్‌ ఉల్లంఘనలిలా... 
కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌ గందరగోళానికి శ్రీకారం చుట్టింది. 94 మందికి మాత్రమే బీ–ఫారాలు ఇవ్వాల్సి ఉన్నా.. చివరిరోజున మరో ఆరుగురికి ఇచ్చింది. ఇందులో హుజూరాబాద్, పటాన్‌చెరు స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే కూటమి పక్షాన అభ్యర్థులుగా నిలిచారు. అయితే, టీజేఎస్‌ ఆశిస్తున్న మిర్యాలగూడ స్థానాన్ని ఆదివారమే కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకుంది. 94 స్థానాల పరిధిలోనే అక్కడ అభ్యర్థిని ప్రకటించింది. అయితే, కాంగ్రెస్‌ ప్రకటించడానికి ముందే అక్కడ టీజేఎస్‌ పక్షాన విద్యాధర్‌రెడ్డికి ఆ పార్టీ బీ–ఫారం ఇచ్చింది. ఇక, 3 రోజుల క్రితమే దుబ్బాకలో టీజేఎస్‌ అభ్యర్థిని ప్రకటించింది. అయినా సోమవారం అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మద్దుల నాగేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. వరంగల్‌ (తూర్పు) స్థానానికి టీజేఎస్‌ అభ్యర్థిని ప్రకటించనప్పటికీ కాంగ్రెస్‌ తమకు వదిలివేస్తుందని ఆశించింది. కానీ, అక్కడ గాయత్రి గ్రానైట్స్‌ అధినేత వద్దిరాజు రవిచంద్రకు కాంగ్రెస్‌ బీ–ఫారం ఇచ్చింది. మెదక్‌లో జనార్దనరెడ్డికి టీజేఎస్‌ బీ–ఫారం ఇవ్వగా, కాంగ్రెస్‌ నుంచి ఉపేందర్‌రెడ్డి బరిలో దిగారు. అంబర్‌పేటలో లక్ష్మణ్‌ యాదవ్‌ (కాంగ్రెస్‌), రమేశ్‌ (టీజేఎస్‌) నామినేషన్లు వేశారు. 

మాట్లాడి పరిష్కరించుకుంటాం
కొన్ని కారణాలతో కాంగ్రెస్‌ నామినేషన్లు వేయాల్సి వచ్చింది. కూటమి పార్టీలతో చర్చించి.. అందరితో మాట్లాడి ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటాం. కూటమిలో ఎలాంటి సమస్య ఉన్నా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాం.
– ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

సమయం ఉంది..మాట్లాడతాం
సీట్ల సర్దుబాటులో అన్ని పార్టీలు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. పొత్తు ధర్మాన్ని అందరూ కాపాడాల్సిందే. కూటమిలో ఉండే సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటాం. మాది సీట్ల కోసం ఏర్పడ్డ కూటమి కాదు. గెలుపే ప్రధానం.
– ఎల్‌. రమణ

టీజేఎస్‌.. తామేమీ తక్కువ కాదన్నట్లు... 
టీజేఎస్‌ కూడా తామేమీ తక్కువ కాదన్నట్టు చివరి రోజున ఇష్టారాజ్యంగా బీ–ఫారాలు ఇచ్చేసింది. తాము అధికారికంగా ప్రకటించిన మల్కాజ్‌గిరి, సిద్దిపేట, దుబ్బాక, మెదక్‌ స్థానాలతో పాటు ఖానాపూర్, ఆసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, చెన్నూరు, అశ్వారావుపేట, వర్ధన్నపేట, మిర్యాలగూడ, వరంగల్‌ (తూర్పు), మహబూబ్‌నగర్, అంబర్‌పేటల్లో పార్టీ బీ–ఫారాల మీదనే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో అంబర్‌పేట, వరంగల్‌(తూర్పు), మిర్యాలగూడ, వర్ధన్నపేట స్థానాలను టీజేఎస్‌కు కేటాయించాల్సి ఉన్నా వర్ధన్నపేట మినహా మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ బీ–ఫారాలు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్‌ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించిన ఖానాపూర్, స్టేషన్‌ఘన్‌పూర్, చెన్నూరు, ఆసిఫాబాద్‌ స్థానాల్లో టీజేఎస్‌ బీ–ఫారాలిచ్చింది. ఇక, కూటమిలోని మరో పక్షమైన తెలుగుదేశం పార్టీని కూడా టీజేఎస్‌ వదిలిపెట్టలేదు. ఆ పార్టీ పోటీ చేస్తున్న రెండు చోట్ల తమ అభ్యర్థులకు బీ–ఫారాలు ఇచ్చి నామినేషన్లు దాఖలు చేయించింది. ఇందులో మహబూబ్‌నగర్, అశ్వారావుపేట స్థానాలున్నాయి. టీజేఎస్‌ 14 చోట్ల పోటీచేస్తున్నప్పటికీ ఆ పార్టీకి 3 స్థానాల్లోనే స్పష్టత కనిపిస్తోంది. అందులో మల్కాజ్‌గిరి, సిద్దిపేట, వర్ధన్నపేట ఉన్నాయి.  

విత్‌డ్రా నాటికి నిర్ణయం
కూటమిలో అనుకున్న ప్రకారం సీట్ల పంపిణీ ఉండాల్సిందే. టీజేఎస్‌కు ఇస్తామన్న 8 స్థానాల్లో కాంగ్రెస్‌ 6 స్థానాలకే స్పష్టత ఇచ్చింది. మరో 2 స్థానాల్లో చర్చలు జరిపాం. సీట్ల కేటాయింపు ఆలస్యంతో స్నేహపూర్వక పోటీ తప్పడం లేదు. దీంతో నష్టమే ఎక్కువ జరుగుతుంది. ముందుగా పోటీకి సిద్ధమైనా విత్‌డ్రా నాటికి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అదేమీ పెద్ద సమస్య కాదు. మాకు ఎజెండానే ముఖ్యం.
– కోదండరాం

14 స్థానాలిచ్చినా.. 13 చోట్లనే టీడీపీ... 
పొత్తుల్లో భాగంగా టీడీపీకి 14 స్థానాలిస్తామని చెప్పినా 13 చోట్లనే పార్టీ బీ–ఫారాలతో నామినేషన్లు వేసింది. పటాన్‌చెరు స్థానాన్ని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ నందీశ్వర్‌గౌడ్, గడీల శ్రీకాంత్‌ మధ్య పోటీతో దాన్ని కాంగ్రెస్‌కు వదిలేసింది. దీంతో అక్కడ కాంగ్రెస్‌ తరఫున కాట శ్రీనివాస్‌గౌడ్‌ అభ్యర్థిగా నిలిచారు. కాంగ్రెస్, టీడీపీ మాత్రం ఒకరిపై మరొకరు పోటీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. కాంగ్రెస్‌కు వస్తుందని ఆశించిన ఇబ్రహీంపట్నంలో తొలుత ప్రకటించిన సామ రంగారెడ్డికే టీడీపీ బీ–ఫారం ఇచ్చింది. ఇక్కడ కాంగ్రెస్‌ బీ–ఫారం వస్తుందని ఆశించిన మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్యాహ్నం వరకు వేచిచూసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

పొత్తు ధర్మానికి కట్టుబడి... 
కూటమిలో పొత్తు ధర్మానికి కట్టుబడింది సీపీఐ మాత్రమేనని నామినేషన్ల లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీ తమకు కేటాయించిన వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి స్థానాల్లో నామినేషన్లు వేసింది. అయితే, పొత్తు కోసం సీట్లు తగ్గించుకున్నా ఆ పార్టీకి రెబెల్స్‌ బెడద తప్పేటట్లు లేదు. వైరాలో సీపీఐ అభ్యర్థి విజయ నామినేషన్‌ వేయగా, అక్కడి నుంచి కాంగ్రెస్‌ రెబెల్‌గా రాములు నాయక్, హుస్నాబాద్‌ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మీద కాంగ్రెస్‌ రెబెల్‌గా అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నామినేషన్లు వేశారు.

ఈ పోటీలు మంచిది కాదు
కూటమి తరఫున పరస్పర, స్నేహపూర్వక పోటీ ఉండకూడదు. పరస్పర పోటీలకు సీపీఐ వ్యతిరేకం. మాకు కేటాయించిన మూడు సీట్లలోనే నామినేషన్లు వేశాం. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌ ‘అదనం’గా నామినేషన్లు వేసిన చోట్ల ఉపసంహరించుకోవాలి. మరోపార్టీకి కేటాయించిన స్థానాల్లో పోటీ సరికాదు.   – చాడ వెంకటరెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement