సాక్షి, హైదరాబాద్ : ‘టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన చాలా మంది పెద్దోళ్లు మాతో టచ్‌లో ఉన్నారు. ఆ పార్టీ ముఖ్యులు కాంగ్రెస్‌లోకి రాబోతున్నారు. అతిత్వరలో పార్టీలో చేరుతారు’ అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు వచ్చిన సర్వే ఫలితాల ప్రకారం మహాకూటమి 80కి పైగా స్థానాల్లో గెలువబోతోందని తెలిపారు. టీఆర్‌ఎస్ 20 సీట్లకే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. ఉత్తమ్ తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. టీఆర్‌ఎస్ నేతలు ఆశల పల్లకిలో తేలుతున్నారనీ, ఆ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. తెలంగాణాలో అమిత్ షా టూర్ కేసీఆర్ అమిత్ షా కలిసి ఆడిన డ్రామా అని విమర్శించారు. టీఆర్‌ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టయితే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ ఆ పార్టీకి ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు.
రాహుల్, సోనియాలతో 12 భారీ బహిరంగ సభలు
పది నియోజకవర్గాలకు ఒకటి చొప్పున భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నామని ఉత్తమ్ తెలిపారు. రాహుల్, సోనియాగాంధీలు 12 భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.మహాకూటమి పేరులో మార్పు ఉంటుందనీ, ‘మహాకూటమి ఉమ్మడి’ గా ప్రచారం చేస్తామని ఆయన తెలిపారు. మహాకూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో డ్రాఫ్ట్ రెడీ అయ్యిందనీ, అభ్యర్థుల టికెట్ల విషయం ఇంకా ఫైనల్ కాలేదని స్పష్టం చేశారు. ‘ఆశావహులకు ఎలాంటి అపోహలు వద్దు. 119 నియోజకవర్గాలపై రివ్వ్యూ చేసాం. గెలిచే అవకాశం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా టికెట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే అంశం హైకమాండ్ పరిశీలనలో ఉందని ఉత్తమ్ తెలిపారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment