సాక్షి, ఒంగోలు : జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం మలెపాడు గ్రామ మహిళలు కలిశారు. గ్రామంలోని మద్యం షాపును తీయించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం షాపును వ్యతిరేకిస్తే తమపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి రాగానే మూడు దశల్లో సంపూర్ణ మద్యనిషేధం అమలు అవుతుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
కాగా అంతకు ముందు లింగంగుంట వద్ద రైతులు...రాజన్న తనయుడిని కలిసి తమ సమస్యలు విన్నవించారు. పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని, సాగునీరు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న వైఎస్ జగన్ రైతులకు భరోసా కల్పించారు. పంటలు చేతికందక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే టీడీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని, చంద్రబాబునాయుడు రైతు ద్రోహి అని విమర్శించారు. అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యల ప్రస్తావన వస్తే వాటిపై స్పందించాల్సింది పోయి అపహాస్యం చేస్తూ మాట్లాడారన్నారు.
అప్పులభారంతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. రైతులకు సాగు నీరు అందటం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. అందుకే ప్రాజెక్టుల విషయంలో అనవసర గందరగోళాన్ని సృష్టించి జాప్యం చేస్తున్నారని చెప్పారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పంటల సాగుకు ప్రతి ఏటా మే నెలలో పెట్టుబడి కోసం ప్రతి రైతు ఖాతాలో రూ.12,500 నగదును జమ చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మండల స్థాయిలో కోల్డ్ స్టోరేజీ గోడౌన్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైతుకు గిట్టుబాటు కల్పించేందుకు ముందస్తు ప్రణాళికలతో రూ.3 వేల కోట్లు మార్కెట్ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. పంట నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపేందకు కేంద్రం సాయంతో రూ.4 వేల కోట్ల పరిహారనిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైఎస్ జగన్ హామీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment