కావలి: జిల్లాలో వెనుకబడిన కావలి, ఉదయగిరి నియోజకవర్గాలతోపాటు ప్రకాశం జిల్లా ప్రజలను ఊరిస్తున్న పోర్టు కమ్ షిప్ యార్డు సాధనకు కావలి కేంద్రంగా పోరాటాలకు రంగం సిద్ధమవుతోంది. పోర్టు కమ్ షిప్ యార్డు ఏర్పాటుకు రామాయపట్నం ప్రాంతం అనుకూలమని నిపుణుల కమిటీ తేల్చింది. అయితే, 2011 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీరువల్ల పోర్టు నిర్మాణం నేటికీ కార్యరూపం దాల్చ లేదు. ఇక్కడ పోర్టు నెలకొల్ప డానికి గల అవకాశాలు, వనరులపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైట్స్ సంస్థ ప్రతి నిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నెల్లూరు–ప్రకాశం జిల్లాల నడుమ కావలి తీరానికి అతి సమీపంలో గల రామాయపట్నం అన్నివిధాలా అనుకూలంగా ఉన్నట్టు తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. ఆ ప్రతిపాదనలు నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో పోర్టు సాధన దిశగా పోరుబాట పట్టేం దుకు కార్యచరణ సిద్ధమవుతోంది.
ప్రతిపాదనలు ఇలా..
దేశంలోని తూర్పు సముద్ర తీరప్రాంతంలో రెండు భారీ ఓడరేవులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం 2001లో విధాన నిర్ణయం తీసుకుంది. వస్తువుల ఎగుమతి, దిగుమతులతోపాటు ఓడల తయారీ, మరమ్మతులకు అనువుగా పశ్చిమ బెంగాల్‌లో ఒకటి, మన రాష్ట్రంలో ఒకటి చొప్పున పోర్టు కమ్ షిప్‌యార్డు నిర్మించేందుకు తలపెట్టింంది. పశ్చిమ బెంగాల్ మాత్రం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్ తీరం ఇందుకు అనువుగా ఉంటుందని వెనువెంటనే సిఫార్సులు పంపించింది. అదే సంవత్సరంలో భారీ ఓడరేవు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభమయ్యాయి.
మన రాష్ట్రానికి వస్తే విశాఖపట్నం జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా రామాయట్నం, నెల్లూరు జిల్లా దుగరాజపట్నం తీర ప్రాంతాల్లో దీనిని ఏర్పాటు చేయాలంటూ ఆయా ప్రాంతాల నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో భారీ ఓడరేవు నిర్మాణానికి ప్రదేశం ఎంపిక విషయంలో వివాదం తలెత్తింది. దీనిపై నిపుణులు కమిటీ వివిధ ప్రాంతాలను పరిశీలించి రామాయపట్నం తీరం దీనికి అనుకూలంగా ఉందని తేల్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో 2012 సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రామాయపట్నంలో పోర్టు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
ఎంపీ మెలికతో..
అప్పట్లో తిరుపతి ఎంపీగా ఉన్న చింతా మోహన్ దుగరాజుపట్నంలో ఓడరేవు నిర్మించాలంటూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ సమర్పించారు. ఉత్తర భారతానికి చెందిన కొందరు ఎంపీలతో సంతకాలు చేయించి మరీ అర్జీ ఇవ్వడంతోపాటు తనకు గల పరిచయాలతో లాబీయింగ్ చేయించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దుగరాజుపట్నంలో భారీ ఓడరేవు నిర్మిస్తామని 2013 మే నెలలో ప్రకటించింది. రామాయపట్నంలో నిర్మించాలని సూచిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమర్పించిన లేఖను బుట్టదాఖలు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రామాయపట్నంలో పోర్టు నిర్మాణ ప్రతిపాదన అటకెక్కింది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో మొత్తానికి పోర్టు నిర్మాణ ప్రతిపాదన మరుగున పడింది. 2015 జూలైలో కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఈ భారీ పోర్టుకు రూ.17,615 కోట్లు ఖర్చవుతుందని ప్రకటించారు. తొలి విడతలో రూ.6,091 కోట్లు వెచ్చించాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవని, అందువల్ల ఈ విషయంలో తాము ఏమీ చేయలేకపోతున్నామని స్పష్టంగా ప్రకటించారు.
రామాయపట్నం ప్రత్యేకతలివీ
జాతీయ రహదారి, రైల్వేట్రాక్‌లకు కేవలం ఐదు కిలోమీ టర్ల సమీపంలోనే రామాయపట్నం ఉంది. సాగరమాల పథకం కింద అభివృద్ధి చేస్తున్న బకింగ్‌హాం కెనాల్ కూ డా దీనికి అందుబాటులో ఉంది. రామాయటపట్నంకు సమీపంలో కావలి పట్టణం ఉండటం కలిసొచ్చే అంశం.
ఎంపీ మేకపాటి ప్రస్తావనతో..
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ పోర్టు సాధన కోసం వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. పోర్టులు, ట్రాన్స్‌పోర్టు స్టాండింగ్ కమిటీలో ఆయన సభ్యులుగా ఉండటంతో మూడేళ్లుగా తన నియోజకవర్గ పరిధిలో ఉన్న రామాయపట్నంలోనూ పోర్టు నిర్మించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర, ప్రత్యుత్తరాలు లేకపోయినా నేరుగా కేంద్ర ప్రభుత్వమే దీనిపై ఒక స్పష్టత వచ్చేందుకు తన మార్గాన తాను చేసుకోవాల్సిన పనిని చక్కబెట్టుకునేలా చేస్తున్నారు.
పోరాటాలకు కార్యాచరణ ప్రణాళిక
పోర్టును సాధిస్తేనే కావలి, ఉదయగిరి నియోజకవర్గాలతోపాటు కావలిని ఆనుకుని ఉన్న ప్రకాశం జిల్లాలోని ప్రజల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పోర్టు ఏర్పాటే శరణ్యమనే ఆలో చన ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పోరుబాట పట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా ఈ అంశంపై చాలా పట్టుదలగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహా మండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డితో కలిసి పోరాటాలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment