
వాయునందనప్రెస్ వీధికి పేరు మార్చడానికి సిద్ధం చేసిన శిలాఫలకం, శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దృశ్యం
సాక్షి, కావలిః నియోజకవర్గ టీడీపీ నాయకుడు బీద మస్తాన్‌రావు ఉత్తుత్తి శిలాఫలకాలను ఆవిష్కరించే జాతరను కొనసాగించే క్రమంలో కావలి పట్టణంలో చరిత్రగా మిగిలి ఉన్న ఆనవాళ్లను ధ్వంసం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే పట్టణ ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడంతో, ప్రజాగ్రహానికి భీతిల్లి శిలాఫలకాన్ని వారే ధ్వంసం చేశారు. నియోజకవర్గంలో ఎన్నికల్లో ఉచిత ప్రచారం కల్పింస్తుందనే ఆశతో టీడీపీ నాయకుడు బీద మస్తాన్‌రావు ప్రజలు రాకపోకలు సాగించే ప్రదేశాల్లో ఇబ్బడిముబ్బడిగా శిలాఫలకాల్ని హడావుడిగా ఆవిష్కరిస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలో 120 సంవత్సరాల చరిత్ర ఉన్న వాయునందన ప్రెస్‌వీధి పేరును చెరిపేసే ప్రయత్నం చేశారు.
1875–1900 కాలంలో పట్టణంలోని 33, 34, 37, 40వార్డుల పరిధిలో వాయునందన ప్రెస్‌ను ప్రారంభించారు. స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటీష్ సామ్రాజ్య పాలకుల నిరంకుశ విధానాలపై పోరాటానికి, ప్రజలను సంఘటితం చేయడానికి అవసరమైన కరపత్రాలు ఈ వాయునందన ప్రెస్‌లోనే ప్రచురించేవారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలోని ప్రధాన వీధికి వాయునందన ప్రెస్ వీధిగా స్థిరపడిపోయింది. అయితే టీడీపీ నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా 1,000 శిలాఫలకాలను ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు. అందులో భాగంగానే వాయునందన ప్రెస్‌వీధి అనే పేరును తొలిగించి కొత్త పేరు పెట్టాలని, అందుకు ఆ ప్రాంతంలో శిలాఫలకాన్ని కూడా హడావుడిగా నిర్మించారు.
ఇక బీద మస్తాన్‌రావు వచ్చి ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరించాల్సి ఉందనగా, ఈ విషయం పట్టణ ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగింది. చరిత్రకు ఆనవాళ్లును ధ్వంసం చేసే హక్కు టీడీపీ నాయకుడు బీద మస్తాన్‌రావుకు ఎవరిచ్చారు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పరిస్థితిని గమనించిన టీడీపీ నాయకులు వాయునందన ప్రెస్ వీధి పేరును మార్పు చేసే శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తే, అక్కడ స్థానికులతో వివాదం జరిగే ప్రమాదం ఉందని నిర్ధారించుకొన్నారు. ఈ వ్యవహరంలో పార్టీకి జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని, ఇంకా శిలాపలకాన్ని ఆవిష్కరిస్తే పట్టణ ప్రజలు సెంట్‌మెంట్‌గా భావించి పార్టీని బజారుకీడ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నాయకుడు తన శిలాఫలకాల ఆవిష్కరణ సంఖ్యలో ఒక్కటి కోల్పోయాననే భాదతోనే, వాయునందన ప్రెస్ వీధి పేరు మార్పు శిలాఫలకాన్ని ఆవిష్కరణను విరమించుకొన్నారు. వెంటనే ఆ శిలాఫలకాన్ని ధ్వసం చేశారు. దీంతో బీద మస్తాన్‌రావు వ్యవహారశైలి పట్ల పట్టణ ప్రజల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment