
రాజేంద్రనగర్: భారతదేశం, తెలంగాణలో పంటల బీమా అమలుపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన అమెరికా దేశానికి చెందిన జాన్‌హూప్ కిన్స్ విశ్వవిద్యాలయం ప్రతినిధులు సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైయస్ ఛాన్స్‌లర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా దేశంలో అమలవుతున్న వ్యవసాయ బీమా పరిస్థితి, రైతుకు మరింత మేలు కలిగించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు వంటి పలు అంశాలపై అధ్యయనం చేయనున్నట్లు జాన్‌హూప్‌కిన్స్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ప్రతినిధి కరీనా అబోర్న్‌సెన్, ఐటుస్ ప్రతినిధి సి.వి.కుమార్ ఉపకులపతికి వివరించారు.
ఇందుకు సంబంధించి విశ్వవిద్యాలయం సహకారాన్ని కోరారు. వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు ఈ నెల 17–20 తేదీల మధ్య వ్యవసాయ ఇన్సూరెన్స్ సంబంధించిన నిపుణులు, విశ్వవిద్యాలయంలోని అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్ ఎకనామిక్స్ విభాగాల అధ్యాపకులు, వ్యవసాయ శాఖ అధికారులతో ఒక సెమినార్‌ను నిర్వహించేందుకు అంగీకరించారు. మన రైతులకు మేలు చేసే వ్యవసాయ బీమా మాడ్యుల్‌ను జాన్‌హూప్‌కిన్స్ ఎకనామిక్స్ స్కూల్ రూపొందించడంపై అధ్యయనం చేస్తుంది.