ప్రభుత్వ సేవలను ఆయా శాఖల సిబ్బంది సకాలంలో పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారు. లబ్ధిదారుల విలువైన సమయాన్ని వృథా చేయడంతో పాటు ఇబ్బందులకు గురి చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అవినీతిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే విస్తృత ప్రచారం చేయించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు డబ్బులు(లంచం) డిమాండ్ చేస్తే నేరుగా ఫిర్యాదు చేయాలని 1064 టోల్‌ఫ్రీ నంబరును కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం అవినీతి రోజురోజుకు పెరిగిపోతోంది.
సంగారెడ్డి క్రైం: ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉండే రెవెన్యూ, విద్యుత్, వైద్యం, పౌర సేవలు, మున్సిపల్ కార్యాలయాల పనితీరుపై విరివిగా ఫిర్యాదులు అందాయని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం విదితమే. అయినప్పటికీ ఈ శాఖలే కాకుండా పరోక్షంగా పోలీసు, ఎక్సైజ్, సబ్ రిజిస్ట్రార్, విద్యాశాఖ, అటవీశాఖ, కాలుష్య నియంత్రణ శాఖ, డీఐసీ, ఆర్టీఏ, జలమండలి, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నులు తదితర శాఖల్లో చేతివాటం ప్రదర్శించనిదే పని కాదనే విమర్శలున్నాయి.
లచ్చం ఇచ్చినా..
తీసుకున్నా.. నేరమే
లంచం ఇవ్వడం, తీసుకోవడం, పోత్సహించడం నేరమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. రూ.కోట్లల్లో అవినీతి చోటు చేసుకుంటున్నా అడపాదడపా నిర్వహించే దాడుల్లో కేవలం చిన్న చేపలే చిక్కుతున్నాయి. ఏసీబీ అధికారులకు స్పష్టమైన సమాచారం ఉన్నా... బడా అధికారులు పైస్థాయిలో ఉన్న పరిచయాలు, నెట్‌వర్క కారణంగా తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. 2016లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో నర్సాపూర్ తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి, దౌల్తాబాద్ తహసీల్దార్ రవీందర్‌రెడ్డిలను నేరుగా అధికారులు కార్యాలయాల్లోనే అవినీతికి పాల్పడితే అదుపులోకి తీసుకున్నారు. 2017లో ఉమ్మడి జిల్లా పరిధిలో సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో నాగాపూర్ వీఆర్వోగా పని చేస్తున్న నాయికోటి వెంకటేశ్వరరావును బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎడ్ల గంగాధర్‌రెడ్డి ఇంటిపై ఇటీవలే ఏసీబీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.
ఏసీబీపై ఆసక్తి చూపని బాధితులు
అవినీతి నిరోధక శాఖ పనితీరు, కేసుల పురోగతి తదితర అంశాలపై ప్రజలు, బాధితులకు పూర్తిస్థాయిలో నమ్మకం, అవగాహన లేక పోవడంతోనే ఎక్కువగా కేసులు నమోదు కావడం లేదు. కేసుల పేరుతో కార్యాలయాల చుట్టూ తిరిగే కంటే అయినకాడికి పని కానిచ్చుకుని కాలం నెట్టుకొస్తున్నారు సామాన్య జనం. ఓ బాధితుడు ఓ శాఖ అధికారిపై ఏసీబీకి సమాచారం ఇస్తే లోపాయికారి ఒప్పందంతో ఆర్థిక ప్రయోజనాలు తప్ప బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శలున్నాయి.
నాణ్యతలేని కేసులే ఎక్కువ
ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణను వివరణ కోరగా మెదక్, సిద్దిపేట్ జిల్లాల నుంచి ఎక్కువగా నాణ్యతలేని కేసులే వస్తున్నాయి. వచ్చిన కేసులను పూర్తిస్థాయిలో విచారణ జరుపుతూ దాడులు చేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు పనులు చేసేందుకు డబ్బులు అడిగితే తమకు సమాచారం అందించాలి. సెల్ 94404 46149లో నేరుగా ఫిర్యాదు చేయాలి. – సూర్యనారాయణ,
ఏసీబీ డీఎస్పీ(ఉమ్మడి జిల్లా)
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏసీబీ కేసులు
2011 05
2012 08
2013 10
2014 06
2015 16
2017 01
ఆకస్మిక తనిఖీలు
2013 02
2014 01
2015 04
2016 04
Comments
Please login to add a commentAdd a comment