
తమిళ సినిమా: మక్కల్ నీది మయ్యం నేత కమల్‌హాసన్, నటి రమ్యకృష్ణలకు నోటీసులు జారీ చేయాలని సీఎండీఏకు చెన్నై హైకోర్టు మంగళవారం ఆదేశించింది. వివరాలు.. చెన్నై శివారు ప్రాంతం ఈసీఆర్ రోడ్డులోని సముద్ర తీర గ్రామమైన ఉత్తండిలో కమల్ హాసన్, రమ్యకృష్ణతో పాటు 138 మంది అక్రమంగా నివాసాలు నిర్మించుకున్నట్లు తెలిసింది చెన్నైకు చెందిన రంగనాథన్ దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో.. సముద్రతీర ప్రాంతమైన ఉత్తండిలో తనకు సొంతమైన స్థలంలో గెస్ట్ హౌస్ నిర్మించుకోడానికి సీఎండీఏ అనుమతి ఇవ్వలేదన్నారు.
తన స్థలం చుట్టూ కమల్ హాసన్, రమ్యకృష్ణ సహా పలువురు ఇల్లు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. కేసు విచారించిన న్యాయమూర్తులు ఉత్తండిలో నివాసాలను ఏర్పరచుకున్న వారి నుంచి వివరణ కోరుతూ సీఎండీఏ నోటీసులు పంపాలని ఆదేశించారు. అదే సమయంలో ఈ విషయంగా సీఎండీఏ, చెన్నై నగర కార్పొరేషన్ కూడా తమకు సమాచారం అందించాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ సమాచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment