పందెం కోళ్లు | Sankranthi Cock Fight Ready | Sakshi
Sakshi News home page

పందెం కోళ్లు

Published Sun, Jan 14 2018 12:20 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

Sankranthi Cock Fight Ready - Sakshi

నక్కాయపాలెంలో అఖిల భారత కోళ్ల మహాసభ జరుగుతుంది. చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపు గౌడ, తెలుపు గౌడ...ఒక్కటనేమిటి రకరకాల కోళ్లు వేల సంఖ్యలో ఈ మహాసభకు విచ్చేశాయి. కోళ్ల సంఘం ప్రెసిడెంట్‌ కొక్కిరాయి కోడి  మైక్‌ అందుకొని మాట్లాడటం మొదలుపెట్టింది...‘‘డియర్‌ ఫ్రెండ్స్, ముందు మీకో జోకు చెప్పి నా ప్రసంగాన్ని మొదలుపెడతాను’’  జోక్‌ అనే మాట వినగానే సభలోని కోళ్లన్నీ ‘కొక్కరో...కొక్కరో’ అని పెద్దగా నవ్వాయి. ఆ నవ్వులు విని ప్రెసిడెంట్‌ కోడికి కోపం వచ్చింది. గొంతు పెంచి ఇలా అరిచింది...‘కోడి మెదడు అని మనుషులు ఇందుకే  వెటకారం చేస్తుంటారు. నేను ఇంకా జోక్‌ చెప్పనే లేదు. క్కోక్కోక్కో అని తెగ నవ్వేస్తున్నారు’’ ఈ మాట విని వైస్‌ ప్రెసిడెంట్‌  కోడికి కోపం వచ్చింది.‘‘సరే చెప్పి చావండి’’ అని విసుక్కొంది.

అప్పుడు అధ్యక్ష కోడి ఇలా చెప్పడం మొదలు పెట్టింది...‘‘ఒక డాక్టర్‌ దగ్గరికి ఒకాయన వెళ్లాడు. ఏమిటండీ మీ ప్రాబ్లం అని డాక్టర్‌ అడిగాడు. నాకు నేను మనిషిలా అనిపించడం లేదు అన్నాడు. మరి ఎలా అనిపిస్తుంది? అని డాక్టర్‌ అడిగాడు. ఆ వ్యక్తి  కొక్కరోకో...అని అరిచి...అచ్చం కోడిలా అనిపిస్తుంది అని చెప్పాడు. ఎప్పటి నుంచి ఇలా అని అడిగాడు డాక్టర్‌. రెండు సంవత్సరాల నుంచి అన్నాడు ఆయన. రెండు సంవత్సరాల నుంచా? మరి అప్పటి నుంచి హాస్పిటల్‌కు ఎందుకు రావాలనిపించలేదు అడిగాడు డాక్టర్‌. రావాలనే అనుకున్నాను... కాని మా ఆవిడ వద్దు అని చెప్పింది అన్నాడు ఆయన.

 ఎందుకు? అని ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్‌. నువ్వు ఏదో ఒకరోజు తప్పకుండా గుడ్డు పెడతావు. ఫ్యూచర్‌లో  మనం ఏకంగా గుడ్ల ఫ్యాక్టరీనే పెట్టి లక్షలు గడించవచ్చు. ఆ చాన్స్‌ వదులుకొని హాస్పిటల్‌కు వెళ్లడం  ఎందుకు? అని అంది. నాకు కూడా ఆమె చెప్పింది నిజమే అనిపించింది. కాని రెండు సంవత్సరాలు గడిచినా సింగిల్‌ గుడ్డు కూడా పెట్టలేకపోయాను. అందుకే ఇలా వచ్చాను అని చెప్పాడు ఆ మనిషి’’సభలోని కోళ్లు క్కో...క్కో...క్కో...అని పెద్దగా నవ్వాయి,అధ్యక్ష కోడికి మళ్లీ కోపం వచ్చింది.‘‘నేను జోకు చెప్పింది మీరు నవ్వడానికి కాదు’’ అరిచింది ప్రెసిడెంట్‌ కోడి.‘‘జోకు చెప్పి... నవ్వొద్దంటారేమిటండీ! మీరు కోడా? మనిషా?’’ ఆవేశంగా అరిచింది చవల కోడి.

అప్పుడు ప్రెసిడెంట్‌ కోడి గొంతు పెంచి ఇలా అంది...‘‘ఈ మనుషులున్నారే... వాళ్లు మన మాంసం తిన్న కృతజ్ఞత కూడా లేకుండా మన మీద రకరకాల జోక్స్‌ వేస్తుంటారు. మన జీవితాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు. మనకు ఫ్రైడే అంటే తెగ భయమట. ఎందుకంటే అందులో ‘ఫ్రై’ ఉంది కాబట్టి. ఇలాంటి జోకులను ఇక ముందు సహించేది లేదని అఖిల భారత కోళ్ల సంఘం అధ్యక్షుడిగా  ఈ మనుషుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. పరువు నష్టం దావా వేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నాను.

ఇక ఈరోజు మన ఎజెండాలో  ముఖ్యమైన అంశం: హౌ టు స్టాప్‌ కోళ్ల పందేలు. సంక్రాంతి వచ్చిందంటే మనకు చావు ముంచుకొస్తుంది. మనకు మనల్నే శత్రువులను చేసి కోడి పందేల పేరుతో వినోదిస్తున్నారు. క్యాష్‌ గడిస్తున్నారు ఈ మనుషులు. అందుకే ‘హౌ టు స్టాప్‌ కోడి పందేలు’ అని అడుగుతున్నాను’’కొక్కిరాయి కోడి మైక్‌ అందుకొని...‘‘కోడిపందేలను ఆపడం గవర్నమెంటోళ్లకే సాధ్యపడటం లేదు.  ఇక మన వల్లేం అవుతుంది..’’ అంది.‘‘మనల్ని మనం అండర్‌ ఎస్టిమేట్‌  చేసుకోవడం తప్పు మిత్రమా... ఒక మహాకవి  మన గురించి ఏమన్నాడో తెలుసా?

కోడి అంటే... కరకరలాడే పకోడి కాదు.తళతళలాడే సిక్స్‌ప్యాక్‌ బాడీ’’ అని చెప్పింది రసంగి కోడి.‘‘వాహ్వా...వాహ్వా... ఇంతకీ ఎవరా మహాకవి?’’ అని సభికుల్లో ఒకరు అడిగారు.‘‘నేనే’’ అని వినయంగా బదులిచ్చింది రసంగి కోడి. చర్చ మళ్లీ మొదలైంది. ఈ చర్చల సంగతి ఎలా ఉన్నా కొన్ని రోజుల తరువాత సంక్రాంతి పండుగ రానే వచ్చింది. కోళ్లపందేలు మొదలయ్యాయి. మరుసటి రోజు మీడియాలో...‘వెల వెలబోయిన కోడిపందేలు’, ‘కోడిపందేల్లో మునుపటి జోష్‌ లేదు’, ‘ఈసారి ఎందుకు ఇలా చప్పగా జరిగాయి’లాంటి బ్రేకింగ్, షాకింగ్‌ న్యూస్‌లు వచ్చాయి. హైదరాబాద్‌లో ఉండే అప్పారావు అనకాపల్లిలో ఉండే సుబ్బారావుకు ఫోన్‌ చేసి ‘కోడిపందేలు ఎందుకు ఫ్లాప్‌ అయ్యాయి?’ అని అడిగాడు.

దానికి సుబ్బారావు ఇలా బదులిచ్చాడు. ‘‘కోడిపందేలు అంటే ఎలా ఉంటాయి? రెండు కోళ్లు రెండు సింహాలై నువ్వా నేనా అన్నట్లు ఫైట్‌ చేస్తాయి. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఒక కోడి ఇంకో కోడికి గంధం పూస్తున్నట్లుగా ఉంది. పందెం కోళ్లలో ఏ కోడికి చిన్న గాయం కూడా కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది’’.కోడిపందేల్లో కోళ్లు పౌరుషం ఎందుకు కోల్పోయాయి? అనే మిస్టరినీ ఛేదించడానికి మీడియా ప్రఖ్యాత కోడిజాలిస్ట్‌ కోట హెన్‌రీని చుట్టుముట్టింది. పెద్దగా ఆలోచించకుండానే క్షణాల్లో ఈ మిస్టరీని ఛేదించాడు హెన్‌రీ. ఇంతకీ హెన్‌రీ ఏం చెప్పాడంటే...

‘‘డియర్‌ ఫ్రెండ్స్‌... మ్యాచ్‌ఫిక్సింగ్‌ అనేది క్రికెట్‌లోనే ఉంటుందని, మనుషులు మాత్రమే చేస్తారని అనుకుంటాం. కాని ఇది తప్పు. కోళ్లు  కూడా మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడతాయి. ఈసారి కోడిపందేల్లో కోళ్లు ‘నువ్వు నన్ను గాయపరచవద్దు... నేను నిన్ను గాయపరచను. ఫైట్‌ చేస్తున్నట్లు నటిద్దాం... అనే కాన్సెప్ట్‌తో ముందుకువెళ్లాయి. అలా మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడి తమను తాము రక్షించుకున్నాయి. అదీ సంగతి!’’
 – యాకుబ్‌ పాషా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement