థౌజండ్ వాలా | 1000 runs not out wonder kid | Sakshi
Sakshi News home page

థౌజండ్ వాలా

Published Wed, Jan 6 2016 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

థౌజండ్ వాలా

థౌజండ్ వాలా

1009 పరుగులతో చెలరేగిన బ్యాట్స్‌మన్
ముంబై కుర్రాడు ప్రణవ్ అత్యద్భుత ప్రదర్శన
ఏ స్థాయి క్రికెట్‌లోనైనా ఒకే ఇన్నింగ్స్‌లో
వేయి పరుగులు చేసిన తొలి ఆటగాడు

 
‘ఇన్నింగ్స్ ప్రారంభించినప్పుడు రికార్డుల గురించి ఆలోచించలేదు. అయితే తొలిబంతి నుంచి భారీషాట్లు కొట్టాలని ముందే  నిర్ణయించుకున్నా. 300 పరుగులు పూర్తయ్యాక  మా కోచ్ ఆటను కొనసాగించమని చెప్పారు. ప్రపంచ రికార్డు గురించి అయితే మాకు ఎవరికీ తెలీదు గానీ... ఇండియా రికార్డు ముంబైకే చెందిన పృథ్వీ పేరిట ఉందని, దానిని బద్దలు కొడుతున్నానని తెలుసు. గతంలో నా అత్యధిక స్కోరు 152. ఈ టోర్నీలో 80 ఒకసారి చేశాను. ముంబై అండర్-19 జట్టులో స్థానమే నా తదుపరి లక్ష్యం’      -ప్రణవ్ ధనావ్‌డే
 
వాంఖడే స్టేడియంలో ఆడాలంటే సెంచరీలు, డబుల్ సెంచరీలు కూడా సరిపోవు. అసాధారణంగా ఆడితేనే అవకాశం దక్కుతుంది... 15 ఏళ్ల కుర్రాడిలో స్ఫూర్తి నింపేందుకు అతని కోచ్ చెప్పిన మాటలివి. అయితే దానిని అతను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. అంతే... వంద, రెండొందలు, మూడొందలు... అలవోకగా దాటేశాడు. బౌండరీలు, సిక్సర్లు వెల్లువెత్తాయి. ప్రత్యర్థి బౌలర్లు బంతి విసరడం తప్ప మరేమీ చేయలేకపోయారు. అదే జోరులో ఆరు వందలు కూడా దాటి ప్రపంచ రికార్డు కూడా కొట్టేశాక తొలి రోజు ముగిసింది.
 
కానీ కథ అక్కడే ముగిసిపోలేదు... రెండో రోజు మళ్లీ కొత్తగా బాదుడు మొదలు పెట్టాడు. అడ్డుకునే బౌలర్ గానీ, ఫీల్డర్ గానీ లేక పరుగులు వెల్లువెత్తాయి. చివరికి వేయి పరుగులు దాటాక ఈ సునామీకి బ్రేక్ లభించింది. జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో సరిపోయింది గానీ లేదంటే ఈ పరుగుల ప్రవాహం ఎక్కడి దాకా చేరేదో! రికార్డులతో చరిత్ర తిరగరాసిన ఆ సంచలనం పేరు ప్రణవ్ ధనావ్‌డే. ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 1009 పరుగులు చేసిన అతను అద్భుతానికి కొత్త అర్థాన్ని చెప్పాడు.

ముంబై: వేయి మైళ్లు కాదు, అది వేయి పరుగుల ప్రయాణం... మొదలు కావడం ఒక్క అడుగుతోనే అయినా అక్కడ పడిన ప్రతీ అడుగు సంచలనానికి కారణమైంది. అడుగు వేస్తే ఫోర్... అడుగు తీస్తే సిక్సర్... క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చూడని విధ్వంసం. పేరుకు పదహారేళ్ల క్రికెట్టే అయినా ఏ స్థాయిలో కూడా ఎవరూ ఊహించడానికి కూడా సాహసించని ఘనత అది. ప్రత్యర్థి బలహీనం, మైదానం చిన్నదిలాంటి మాటలతో తక్కువ చేసే ఆట కాదు అది.
 
ఆకాశమే హద్దుగా చెలరేగుతూ 15 ఏళ్ల ప్రణవ్ ధనావ్‌డే ముంబై అండర్-16 స్కూల్ టోర్నీ భండారి కప్ (రెండు రోజుల మ్యాచ్)లో ఒకే ఇన్నింగ్స్‌లో 1009 పరుగులు చేశాడు. ముంబై శివార్లలో థానే జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఇందులో 129 ఫోర్లు, 59 సిక్సర్లు ఉన్నాయి.
 
ఆగని జోరు:  సోమవారం మొదలైన ఈ పరుగుల సునామీ రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. ఆర్య గురుకుల్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్ తరఫున బరిలోకి దిగిన ప్రణవ్ తొలి రోజు 652 పరుగులతో అజేయంగా నిలిచి... చివరకు 1009 పరుగుల చేసి కూడా నాటౌట్‌గా నిలిచాడు. గాంధీ స్కూల్ తమ ఇన్నింగ్స్‌ను 1465/3 స్కోరు వద్ద డిక్లేర్ చేయడంతో ప్రణవ్ పరుగుల ప్రవాహం ఆగింది. ఇది కూడా ప్రపంచ రికార్డు కావడం విశేషం.
 
1926లో జరిగిన మ్యాచ్‌లో 1107 పరుగులు చేసిన విక్టోరియా జట్టు రికార్డును గాంధీ స్కూల్ సవరించింది. 652 పరుగుల ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ప్రణవ్... తన స్కోరుకు మరో 357 పరుగులు జోడించాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్‌లో ఏఈజే కొలిన్స్ (628 నాటౌట్-1899లో) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మొదటి రోజే ఈ ముంబైకర్ బద్దలు కొట్టాడు. ప్రపంచ క్రికెట్‌లో మైనర్ లీగ్‌ల మొదలు టెస్టు క్రికెట్ వరకు ఏ స్థాయిలోనైనా వేయి పరుగులు చేసిన తొలి ఆటగాడు ప్రణవ్ కావడం విశేషం.
 
2014లో రిజ్వి స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ ఆటగాడు పృథ్వీ షా చేసిన 546 పరుగులు ఇప్పటి వరకు భారత రికార్డుగా ఉంది. దీనితో పాటు పలు రికార్డులు ప్రణవ్ ధాటికి చెల్లాచెదురయ్యాయి. ప్రణవ్ బాదిన ఫోర్లు, సిక్సర్లు కూడా పోటీ క్రికెట్‌లో రికార్డు కావడం అతని ధాటిని సూచిస్తోంది.

చిత్తుగా ఓడిన ప్రత్యర్థి: 
రికార్డులు వెల్లువెత్తిన ఈ మ్యాచ్‌లో కేసీ గాంధీ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రణవ్ విధ్వంసానికి ముందు ఆర్య గురుకుల్ స్కూల్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యర్థి పరుగుల సునామీతో భీతిల్లిన ఆ జట్టు అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేసి 52 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా కేసీ గాంధీ జట్టు... ఇన్నింగ్స్ 1382 పరుగుల తేడాతో గురుకుల్‌ను చిత్తుగా ఓడించింది.
 
సాధారణ నేపథ్యం...
ప్రణవ్ తండ్రి ప్రశాంత్ ధనావ్‌డే ఆటోడ్రైవర్‌గా పని చేస్తుంటారు. ‘నీ కొడుకు అద్భుతం చేస్తున్నాడు. ఇంకా ఇక్కడే ఉన్నావా’ అంటూ ఒక మిత్రుడు చెప్పడంతో ఆయన హడావుడిగా మైదానానికి వెళ్లి తన కుమారుడు రికార్డులు తిరగరాయడం కళ్లారా చూశారు. ‘ప్రణవ్‌కు ఆటపై ఉన్న ఆసక్తితో ప్రోత్సహించాను. 11 ఏళ్లనుంచి కష్టపడుతున్నాడు.
 
దానికి ఫలితమే ఇది. ముంబై అండర్-16 జట్టులో చోటు దక్కితే చాలు’ అని ప్రశాంత్ ఆనందంతో చెప్పారు. పదో తరగతి చదువుతున్న ఈ కుర్రాడు సీనియర్  కోచ్ ముబీన్ షేక్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. ‘తొమ్మిదేళ్లుగా అతడికి నేను శిక్షణ ఇస్తున్నాను. అతను సాధారణంగానే మంచి హిట్టర్. అండర్-16 స్థాయికి సరిపోయేలా నిబంధనల ప్రకారమే ఈ మైదానం ఉంది కాబట్టి రికార్డుపై సందేహాలు అనవసరం. పైగా ఇది ఎంసీఏ గుర్తింపు పొందిన టోర్నీ.
 
ఈ కుర్రాడి రికార్డు ఈ ప్రాంతంలో క్రికెట్‌కు ఊపు తేవడం ఖాయం’ అని షేక్ వ్యాఖ్యానించారు. మరో వైపు ప్రణవ్ రికార్డుపై ప్రశంసలు కురిపించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్... అతని చదువు, క్రికెట్ కోచింగ్‌కు సంబంధించిన అన్ని ఖర్చులను ఇకపై ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.
 

 
 అభినందనల వెల్లువ...
‘ఇన్నింగ్స్‌లో వేయి పరుగులు చేసిన తొలి ఆటగాడికి అభినందనలు. చాలా బాగా ఆడావు. ఇంకా కష్టపడి మరింత ఎత్తుకు ఎదగాలి’        - సచిన్
 
‘మరో సచిన్ తయారవుతున్నాడు. ఏ స్థాయి క్రికెట్ అనేది ముఖ్యం కాదు. అంకెలు చూస్తేనే తెలుస్తుంది ఎంత అద్భుతమో’        -హర్భజన్ సింగ్
 
‘అన్ని పరుగులు చేయడం అంటే జోక్ కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఆ వయసును బట్టి చూస్తే అలాంటి బ్యాటింగ్ అసాధారణం. ఇదో అద్భుతం. అతను కచ్చితంగా ప్రత్యేకమైన ఆటగాడు. నేనైతే బోర్ అయ్యేవాడినేమో’        - ధోని
 
‘ఇది మాటల్లో చెప్పలేని ఘనత. వేయి పరుగులు అనే మాట చెప్పడమే పెద్దగా కనిపిస్తోంది. అలాంటిది అతను చేసి చూపించాడు. ఏదో ఒక రోజు భారత్‌కు ఆడాలని కోరుకుంటున్నా’
  -రహానే
 
‘అతని ఫిట్‌నెస్ చాలా బాగుంది. సాధారణంగా ఈ స్థాయి పిల్లలు సెంచరీ కాగానే సర్ వాటర్ కావాలి అని అడుగుతారు. అయితే అతను ఇదేమీ పట్టించుకోకుండా దూసుకుపోయాడు’  -సునిమల్ సేన్,  ఈ మ్యాచ్ అంపైర్

నాటి కుర్రాడి కథ...
ప్రణవ్‌కు ముందు అత్యధిక పరుగుల రికార్డు నెలకొల్పిన ఆర్థర్ కొలిన్స్ జీవితం కూడా ఆసక్తికరం. 1899లో 13 ఏళ్ల వయసులో కొలిన్స్ 628 పరుగుల రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్‌లో క్లార్క్స్ హౌస్, నార్త్ టౌన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది. అతని ఇన్నింగ్స్‌లో 31 బౌండరీలు ఉండగా ఒకే సిక్సర్ కొట్టాడు. నాలుగు సార్లు 5 పరుగులు, 33 సార్లు అతను 3 పరుగులు తీశాడు. అయితే ఆర్మీలో చేరడంతో అతను పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టలేకపోయాడు. కలకత్తాలో పుట్టిన కొలిన్స్ సైనికుడిగా లెఫ్టినెంట్ స్థాయికి ఎదిగాడు.  ఫ్రాన్స్‌లో జరిగిన తొలి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటూ 29 ఏళ్ల వయసులోనే అతను వీరమరణం పొందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement