శతకాల మోత | 1st Test: Kiwis reach 329/4 on Day 1 as McCullum, Williamson slam tons | Sakshi
Sakshi News home page

శతకాల మోత

Published Fri, Feb 7 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

శతకాల మోత

శతకాల మోత

తొలి టెస్టులో ఆరంభంలో చెలరేగిన భారత బౌలర్లు చివర్లో నిరాశపర్చారు. కీలక సమయంలో వికెట్లు తీయలేకపోవడం,  ఫీల్డింగ్‌లో నాలుగు క్యాచ్‌లు జారవిడవడంతో తొలి రోజు భారత్ మూల్యం చెల్లించుకుంది. మరోవైపు బ్రెండన్ మెకల్లమ్, విలియమ్సన్ సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
 
 ఆక్లాండ్: ‘కీలక సమయంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి’ తొలి టెస్టుకు ముందు ధోని చేసిన ఈ వ్యాఖ్యలను భారత ఆటగాళ్లు మాత్రం ఆచరణలో పెట్టలేకపోయారు. తొలి సెషన్‌లో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చకచకా మూడు వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు బిగించే అవకాశం వచ్చినా చేజేతులా జారవిడుచుకున్నారు. ఫలితంగా రెండు సెషన్ల పాటు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన న్యూజిలాండ్... గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లకు 329 పరుగుల భారీ స్కోరు చేసింది.
 
 బ్రెండన్ మెకల్లమ్ (210 బంతుల్లో 143 బ్యాటింగ్; 18 ఫోర్లు, 2 సిక్సర్లు), విలియమ్సన్ (172 బంతుల్లో 113; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో దుమ్మురేపారు. మెకల్లమ్‌తో పాటు అండర్సన్ (78 బంతుల్లో 42 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్సర్) క్రీజులో ఉన్నాడు. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్‌ను మెలక్లమ్, విలియమ్సన్ నాలుగో వికెట్‌కు 221 పరుగులు జోడించి ఆదుకున్నారు. జహీర్, ఇషాంత్ చెరో రెండేసి వికెట్లు తీశారు.
 
 పేసర్ల విజృంభణ
 వాతావరణం మేఘావృతం కావడం, పిచ్‌పై తేమ ఉండటంతో భారత్ బౌలింగ్ ఎంచుకుంది. పేసర్లు ఆరంభంలో చెలరేగారు. 10వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన ఇషాంత్ ఐదో బంతికి రూథర్‌ఫోర్డ్ (30 బంతుల్లో 6; 1 ఫోర్)ను అవుట్ చేశాడు. ఫుల్టన్ (35 బంతుల్లో 13; 2 ఫోర్లు)కు జహీర్ షాక్ ఇచ్చాడు.
 
 విలియమ్సన్‌కు జత కలిసిన టేలర్ (15 బంతుల్లో 3) ఆరంభం నుంచే ఇబ్బంది పడ్డాడు.  చివరకు ఇషాంత్ బౌలింగ్‌లో బంతిని డ్రైవ్ చేయబోయి షార్ట్ మిడాఫ్‌లో జడేజా చేతికి చిక్కాడు. దీంతో కివీస్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత మెకల్లమ్, విలియమ్సన్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యమివ్వడంతో లంచ్ వరకు ఆతిథ్య జట్టు పెద్దగా పరుగులు చేయలేకపోయింది.
 
 విలియమ్సన్ నిలకడ...
 ఎండ వల్ల వికెట్ పొడిగా మారడంతో లంచ్ తర్వాత భారత బౌలర్లు బంతిపై పట్టు కోల్పోయారు. దీన్ని ఆసరాగా చేసుకున్న విలియమ్సన్, మెకల్లమ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. 33, 38వ ఓవర్లలో రెండు భారీ సిక్సర్లతో రెచ్చిపోయిన విలియమ్సన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
 
 రెండో ఎండ్‌లో మెకల్లమ్ వరుసగా బౌండరీలు బాదుతూ 43వ ఓవర్‌లో అర్ధ సెంచరీని సాధించాడు.  44వ ఓవర్‌లో జడేజా బౌలింగ్‌కు వచ్చినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. ఓవర్‌కు ఒకటి, రెండు బౌండరీలు రావడంతో కివీస్ స్కోరు బోర్డు వేగంగా కదిలింది. మెకల్లమ్, విలియమ్సన్ ఈ సెషన్‌లో 125 పరుగులు జోడించగా, భారత్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది.
 
 మెకల్లమ్ జోరు...
 క్రీజులోకి ఆలస్యంగా వచ్చినా మెకల్లమ్ మాత్రం విలియమ్సన్ కంటే వేగంగా ఆడాడు. 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో సిక్సర్ సంధించి కెరీర్‌లో 8వ శతకాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత విలియమ్సన్ కూడా ఓ బౌండరీ, సింగిల్‌తో ఐదో సెంచరీని అందుకున్నాడు.
 
 102 పరుగుల వద్ద మెకల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను ధావన్ జారవిడిచాడు. అయితే నిలకడగా ఆడుతున్న ఈ జోడిని జహీర్ విడగొట్టాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు నెలకొన్న 221 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన అండర్సన్ నిలకడగా ఆడాడు. మెకల్లమ్, అండర్సన్ ఐదో వికెట్‌కు అజేయంగా  78 పరుగులు జోడించి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.
 
 స్కోరు వివరాలు
 న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: ఫుల్టన్ ఎల్బీడబ్ల్యు (బి) జహీర్ 13; రూథర్‌ఫోర్డ్ (సి) రహానే (బి) ఇషాంత్ 6; విలియమ్సన్ (సి) ధోని (బి) జహీర్ 113; టేలర్ (సి) జడేజా (బి) ఇషాంత్ 3; బి.మెకల్లమ్ బ్యాటింగ్ 143; అండర్సన్ బ్యాటింగ్ 42; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (90 ఓవర్లలో 4 వికెట్లకు) 329.
 
 వికెట్లపతనం: 1-19; 2-23; 3-30; 4-251
 బౌలింగ్: షమీ 22-6-66-0; జహీర్ 23-2-98-2; ఇషాంత్ 21-4-62-2; జడేజా 20-1-81-0; కోహ్లి 1-0-4-0; రోహిత్ 3-0-12-0.
 
 సెషన్-1    ఓవర్లు: 24; పరుగులు: 54; వికెట్లు: 3
 
  సెషన్-2   ఓవర్లు: 27; పరుగులు: 125; వికెట్లు: 0
 
  సెషన్-3   ఓవర్లు: 39; పరుగులు: 150; వికెట్లు: 1
 
 ఇషాంత్@150
 భారత పేసర్ ఇషాంత్ శర్మ టెస్టుల్లో 150 వికెట్లు తీసిన మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 11వ భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. తొలి టెస్టులో ఓపెనర్ రూథర్‌ఫోర్డ్‌ను అవుట్ చేయడం ద్వారా అతను ఈ ఘనత సాధించాడు.
 
 3 విదేశీ గడ్డపై టెస్టుల్లో 200 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ జహీర్. కుంబ్లే (269), కపిల్ (215) ఈ జాబితాలో ముందున్నారు.
 
 1 టెస్టుల్లో 9 ఏళ్ల తర్వాత కివీస్ తరఫున మూడో నంబర్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్ విలియమ్సన్.
 
 1 వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీలు, అంతకుపైగా స్కోరు సాధించిన తొలి బ్యాట్స్‌మన్ విలియమ్సన్.
 
 నా ప్రదర్శన సంతృప్తినిచ్చింది. 150 వికెట్ల క్లబ్‌లో చేరినందుకు సంతోషంగా ఉంది. ఇది నాకు గొప్ప ఘనత. నా శైలి, రిథమ్ గురించి ఇబ్బంది లేదు. రోజంతా జహీర్, నేను మంచి ప్రదేశాల్లో బంతులు వేయగలిగాం. అయితే మెకల్లమ్, విలియమ్సన్ మెరుగ్గా ఆడారు. ఇలాంటి వికెట్‌పై సహనంతో బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది.     
 - ఇషాంత్ (భారత పేసర్)
 
 టాస్ గెలిస్తే బాగుంటుందని భావించాం. కానీ అలా జరగలేదు. కొత్త బంతిని ఎదుర్కొవడం కాస్త ఇబ్బందే. లంచ్ తర్వాత బ్యాటింగ్ చేయడం సులువైంది. ప్రస్తుతం మేం ఆధిపత్యంలో ఉన్నాం. ఏదో ఓ దశలో భారత బౌలర్లు మ్యాచ్‌పై ప్రభావం చూపిస్తారు. మెకల్లమ్ బ్యాటింగ్ అద్భుతం.
 - విలియమ్సన్ (కివీస్ బ్యాట్స్‌మన్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement