ఇక ‘మిడిల్’దే భారం | 1st Test: Rohit Sharma key for India after New Zealand seize control ... | Sakshi
Sakshi News home page

ఇక ‘మిడిల్’దే భారం

Published Sat, Feb 8 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

ఇక ‘మిడిల్’దే భారం

ఇక ‘మిడిల్’దే భారం

 తొలి టెస్టులో భారత్, న్యూజిలాండ్ ఒకే తరహాలో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాయి. ఇరుజట్లూ టపటపా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాయి. న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మెకల్లమ్, విలియమ్సన్ సెంచరీలతో  భారీ స్కోరు అందించారు. ప్రస్తుతం భారత్‌కు కావలసింది కూడా అదే తరహా ఆట. మిడిలార్డర్ మ్యాజిక్ చేస్తే తప్ప... కివీస్ చేతిలో పరాభవం తప్పదు. ఈ మ్యాచ్ ఎటు సాగుతుందనేది మూడోరోజు తేలుతుంది.
 
 ఆక్లాండ్: బౌలర్లు విఫలమైన చోట భారత టాప్ ఆర్డర్ కూడా నిరాశపర్చింది. ప్రత్యర్థి బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఓ దశలో 10 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ధోనిసేన ఎదురీదుతోంది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలో 4 వికెట్లకు 130 పరుగులు చేసింది.
 
 రోహిత్ (102 బంతుల్లో 67 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్సర్), రహానే (56 బంతుల్లో 23 బ్యాటింగ్; 2 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నారు. ధావన్ (0), పుజారా (1), కోహ్లి (4), మురళీ విజయ్ (26) విఫలమయ్యారు. అంతకుముందు 329/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 121.4 ఓవర్లలో 503 పరుగులకు ఆలౌటైంది. మెకల్లమ్ (307 బంతుల్లో 224; 29 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అండర్సన్ (109 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. ఇషాంత్ 6 వికెట్లు తీశాడు. ప్రస్తుతం 373 పరుగులు వెనుకబడి ఉన్న ధోనిసేన ఫాలోఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 174 పరుగులు చేయాలి.
 
 సెషన్-1   ఓవర్లు: 24; పరుగులు: 144; వికెట్లు: 3
 మెకల్లమ్ వీరవిహారం
 ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ మెకల్లమ్, అండర్సన్‌లు చెలరేగడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. 88 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అండర్సన్ రెండో రోజు ఎదుర్కొన్న 26 బంతుల్లో 21 పరుగులు రాబట్టాడు. మెకల్లమ్ కూడా ధాటిగా ఆడుతూ 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో అండర్సన్... ఇషాంత్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 133 పరుగులు జోడించారు. వాట్లింగ్ (1) నిరాశపర్చినా... సౌతీ (21 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సాయంతో మెకల్లమ్ విజృంభించాడు.  సోధి (27 బంతుల్లో 23; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. మెకల్లమ్...  జడేజా బౌలింగ్‌లో ఓ సిక్సర్, ఫోర్ కొట్టి కెరీర్‌లో రెండో ‘డబుల్’ సెంచరీ పూర్తి చేశాడు.
 
 ఇషాంత్ జోరు
 లంచ్ తర్వాత  కివీస్ జోరుకు ఇషాంత్, జడేజా అడ్డుకట్ట వేశారు. చకచకా మూడు వికెట్లు తీసి కివీస్ ఇన్నింగ్స్‌ను ముగించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు కివీస్ పేసర్ బౌల్ట్ వరుసగా షాకిచ్చాడు. ఇన్నింగ్స్ రెండో బంతికి ధావన్, ఆరో బంతికి పుజారాను అవుట్ చేశాడు. విజయ్ వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేసినా... రెండో ఎండ్‌లో వచ్చిన కోహ్లిని సౌతీ దెబ్బతీశాడు. దీంతో భారత్ 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్, విజయ్ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశారు.
 
 సెషన్-2
 ఓవర్లు: 7.4; పరుగులు: 30; వికెట్లు: 3 (కివీస్)
 ఓవర్లు: 18; పరుగులు: 45; వికెట్లు: 3 (భారత్)
 
 స్కోరు వివరాలు
 న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: ఫుల్టన్ ఎల్బీడబ్ల్యు (బి) జహీర్ 13; రూథర్‌ఫోర్డ్ (సి) రహానే (బి) ఇషాంత్ 6; విలియమ్సన్ (సి) ధోని (బి) జహీర్ 113; టేలర్ (సి) జడేజా (బి) ఇషాంత్ 3; బి.మెకల్లమ్ (సి) జడేజా (బి) ఇషాంత్ 224; అండర్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 77; వాట్లింగ్ (సి) ధావన్ (బి) ఇషాంత్ 1; సౌతీ (బి) షమీ 28; సోధి (సి) రోహిత్ (బి) ఇషాంత్ 23; వాగ్నేర్ (సి) కోహ్లి (బి) జడేజా 0; బౌల్ట్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (121.4 ఓవర్లలో ఆలౌట్) 503.
 
 వికెట్లపతనం: 1-19; 2-23; 3-30; 4-251; 5-384; 6-398; 7-434; 8-490; 9-495; 10-503.
 
 బౌలింగ్: షమీ 28-6-95-1; జహీర్ 30-2-132-2; ఇషాంత్ 33.4-4-134-6; జడేజా 26-1-120-1; కోహ్లి 1-0-4-0; రోహిత్ 3-0-12-0.
 
 భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 0; విజయ్ (బి) వాగ్నేర్ 26; పుజారా (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 1; కోహ్లి (సి) ఫుల్టన్ (బి) సౌతీ 4; రోహిత్ బ్యాటింగ్ 67; రహానే బ్యాటింగ్ 23; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (39 ఓవర్లలో 4 వికెట్లకు) 130.
 
 వికెట్లపతనం: 1-1; 2-3; 3-10; 4-51
 బౌలింగ్: బౌల్ట్ 10-1-20-2; సౌతీ 12-3-27-1; అండర్సన్ 2-0-9-0; వాగ్నేర్ 7-0-46-1; ఇష్ సోధి 6-0-13-0; విలియమ్సన్ 2-0-9-0.
 
 సెషన్-3
 ఆదుకున్న రోహిత్
 టీ విరామం తర్వాత విజయ్ విఫలమైనా రోహిత్ నిలకడగా ఆడాడు. రోహిత్ విజయ్ నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. రహానే ఆచితూచి ఆడగా... రోహిత్ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు సాధించాడు.
 
 ఈ సెషన్లో పరుగులు నెమ్మదిగా వచ్చినా... రోహిత్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. విలియమ్సన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టి  ఆత్మ విశ్వాసాన్ని కనబర్చాడు. రోహిత్, రహానే ఐదో వికెట్‌కు అజేయంగా 79 పరుగులు జోడించారు.
 
 ఓవర్లు: 21;   పరుగులు: 85;   వికెట్లు: 1
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement