
తీవ్ర మానసిక ఒత్తిడిని భరిస్తూ వరుసగా రెండు పెనాల్టీ షూటౌట్ మ్యాచ్‌ల్లో గెలవడం ఆషామాషీ కాదు. 1990 ప్రపంచ కప్ స్వీయానుభవంతో చెబుతున్నా... నాడు నా సారథ్యంలోని అర్జెంటీనా క్వార్టర్స్‌లో యుగోస్లేవియాను, సెమీస్‌లో ఇటలీని పెనాల్టీలోనే ఓడించింది. ఇప్పుడు క్రొయేషియాదీ ఇదే పరిస్థితి. 240 నిమిషాల పాటు నాకౌట్ మ్యాచ్‌లు ఆడటం, అందులోనూ షూటౌట్ అంటే ఆ ఒత్తిడి చెప్పలేనిది. జర్మనీతో 1990 కప్ ఫైనల్లో మేమిలాంటి ప్రభావానికే గురయ్యాం. నాడు మేం పెనాల్టీ కిక్‌తో కప్‌ను సమర్పించుకున్నాం. మా ఆటగాళ్లు ఇద్దరు రెడ్ కార్డులకు గురయ్యారు. ఓడినా విశ్వ ప్రయత్నం చేశాం. నాతోపాటు అభిమానులూ దీనిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. క్రొయేషియాను సరిగ్గా ఇదే ఇబ్బంది పెడుతుందని ఇదంతా చెబుతున్నా. దీనిని అధిగమించాలంటే సెమీస్‌కు ముందు మూడు రోజుల విరామంలో ఆ జట్టు పునరుత్తేజం కావాలి. ఫైనల్‌కు అతి దగ్గరగా వచ్చిన అవకాశాన్ని ఎవరూ వదులుకోవాలని అనుకోరు.
ప్రి క్వార్టర్స్‌లో పెనాల్టీతోనే గట్టెక్కినా 90 నిమిషాల్లో క్వార్టర్ ఫైనల్‌ను ముగించిన ఇంగ్లండ్ కుర్రాళ్లు తాజాగా ఉన్నారు. ఈ రెండు జట్ల మధ్య సామీప్యత కనిపిస్తోంది. ఇంగ్లండ్ గోల్స్‌లో ఎక్కువ శాతం పథకం ప్రకారం బంతిని బాక్స్ ఏరియాలోకి పంపి హెడర్‌తో సాధించినవే. నిబద్ధతతోపాటు సాను కూల దృక్పథంతో భీకరంగా పోరాడే క్రొయేషియా డిఫెండర్లంటే నాకిష్టం. ప్రాథమిక అంశాల్లో బలంగా ఉంటూ, స్థాన బలంతో వారు చాలా మ్యాచ్‌లను గాడినపెట్టారు. కానీ, అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇంగ్లండ్‌పై ఒత్తిడిని ఎదుర్కొని నిలవడం క్రొయేషియాకు బలమైన పరీక్ష.
Comments
Please login to add a commentAdd a comment