
ఆనందంలో ఫ్రాన్స్ ఆటగాళ్లు
సెయింట్ పీటర్స్‌బర్గ్ : ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి ఫ్రాన్స్ దూసుకెళ్లింది. మంగళవారం అర్థరాత్రి బెల్జియంతో జరిగిన సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా, క్వార్టర్స్‌లో ఉరుగ్వేను మట్టికరిపించిన ఫ్రాన్స్.. సెమీస్‌లో అదే ఉత్సాహంతో బెల్జియంను ఓడించింది. దీంతో టైటిల్‌ను అందుకోవాలన్న బెల్జియం ఆశలు ఆవిరయ్యాయి. ఇరు జట్లు హోరా హోరీగా పోరాడటంతో తొలి అర్ధభాగం వరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ప్రత్యర్థులిద్దరూ చక్కని డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు.
అయితే 51వ నిమిషంలో గ్రీజ్‌మన్ కొట్టిన కార్నర్ క్రాస్ షాట్‌ను శామ్యూల్ ఉమ్‌టిటి అద్భుతమైన హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ఫ్రాన్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో బెల్జియం గోల్ కోసం విపరీతంగా ప్రయత్నించినా ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్ వారికి అడ్డుగోడలా నిలబడ్డాడు. ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 1998లో విజేతగా నిలిచిన ఆ జట్టు 2006లో రన్నరప్‌గా నిలిచింది. నేడు ఇంగ్లండ్, క్రొయేషియా తలపడే రెండో సెమీస్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం మాస్కోలోని లుహినికి స్టేడియంలో ఫ్రాన్స్ ఫైనల్ ఆడనుంది. ఇక మూడో స్థానం కోసం ఓడిన జట్టుతో బెల్జియం తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment