విన్నర్స్ ట్రోఫీతో సోఫియా కెనిన్
టైటిల్ ఫేవరెట్స్ ఒక్కొక్కరూ నిష్క్రమించిన చోట... ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అమెరికా యువతార సోఫియా కెనిన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్ చేరే క్రమంలో తాను సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ తుది సమరంలోనూ ఈ అమెరికా భామ సత్తా చాటుకుంది. తన ప్రత్యర్థి గార్బిన్ ముగురుజా ప్రపంచ మాజీ నంబర్‌వన్ అయినప్పటికీ... ఆమెకు రెండు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన అనుభవం ఉన్నప్పటికీ... ఎంతో ఒత్తిడి ఉండే ‘గ్రాండ్’ టైటిల్ పోరులో తొలి సెట్ కోల్పోయి వెనుకబడినప్పటికీ... 21 ఏళ్ల సోఫియా కెనిన్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ‘నేను గెలవగలను’ అని గట్టిగా విశ్వసిస్తూ అద్భుత ఆటతీరుతో అనూహ్యంగా పుంజుకొని... తదుపరి రెండు సెట్‌లలో ముగురుజాకు ముచ్చెమటలు పట్టిస్తూ... ‘గ్రాండ్’గా ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకొని విజయ దరహాసం చేసింది.
మెల్‌బోర్న్: చివరిదాకా గెలవాలనే కసి ఉంటే... ప్రత్యర్థి ఏ స్థాయి వారైనా... పరిస్థితులు ఎలా ఉన్నా... చాంపియన్‌గా అవతరించవచ్చొని అమెరికా యువతార సోఫియా కెనిన్ నిరూపించింది. కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్నప్పటికీ... తొలి సెట్ చేజార్చుకున్నప్పటికీ... ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా తుదకు సోఫియా కెనిన్ ‘గ్రాండ్’ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 14వ సీడ్, ప్రపంచ 15వ ర్యాంకర్ సోఫియా కెనిన్ 4–6, 6–2, 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై విజయం సాధించింది. విజేత సోఫియా కెనిన్‌కు 41 లక్షల 20 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ ముగురుజాకు 20 లక్షల 65 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 88 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
►తాజా ‘గ్రాండ్’ విజయంతో సోఫియా సోమవారం విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి ఎగబాకుతుంది. ఇప్పటివరకు అమెరికా నంబర్‌వన్‌గా ఉన్న సెరెనా విలియమ్స్‌ను వెనక్కి నెట్టి సోఫియా ఆ స్థానాన్ని ఆక్రమించనుంది.
►ముగురుజాతో జరిగిన ఫైనల్లో కెనిన్ తొలి సెట్‌లో తడబడింది. 2016 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 2017 వింబుల్డన్ టోర్నీ విజేత అయిన ముగురుజా సుదీర్ఘంగా సాగిన మూడో గేమ్‌లో మూడో ప్రయత్నంలో కెనిన్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. అదే జోరులో 52 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకొని కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా సాగింది.
►అయితే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీని ఓడించిన కెనిన్ తొలి సెట్ చేజార్చుకున్నా కంగారు పడలేదు. తొలి సెట్‌లో చేసిన తప్పిదాలను సరిచేసుకున్న కెనిన్ రెండో సెట్‌లో ముగురుజాను తన శక్తివంతమైన గ్రౌండ్‌షాట్‌లతో ఇబ్బంది పెట్టింది. నాలుగో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌లను బ్రేక్ చేసిన కెనిన్ 32 నిమిషాల్లో రెండో సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది.
►నిర్ణాయక మూడో సెట్‌లో కెనిన్ ఆటతీరు మరింత మెరుగు పడగా... ముగురుజా ఆట అనవసర తప్పిదాలతో గాడి తప్పింది. ఆరో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెనిన్ ఏడో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని 5–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఎనిమిదో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన కెనిన్ సెట్‌తోపాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది.
►ఈ విజయంతో సెరెనా (2002లో) తర్వాత పిన్న వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అమెరికా క్రీడాకారిణిగా కెనిన్ గుర్తింపు పొందింది. 2008 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన పిన్న వయస్కురాలిగా కూడా కెనిన్ ఘనత వహించింది. 2008లో షరపోవా 20 ఏళ్ల ప్రాయంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గింది.
రన్నరప్ ట్రోఫీతో ముగురుజా
నా కల నిజమైంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. మీరూ కలలు కనండి. ఎందుకంటే కలలు నిజమవుతాయి. గత రెండు వారాలు నా జీవితంలోనే అత్యుత్తమ క్షణాలు. నా గుండె లోతుల్లోంచి చెబుతున్నా మీరంటే (ప్రేక్షకులు) నాకెంతో ప్రేమాభిమానాలు. మీ అందరికీ ధన్యవాదాలు. నేను గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించేందుకు నాన్న, కోచ్ అలెగ్జాండర్, ఆయన శిక్షణ బృందం ఎంతగానో కష్టపడింది. ఆఖరికి మా ఇన్నేళ్ల కష్టం ఫలించింది. మా అమ్మకు మూఢనమ్మకాలెక్కువ. అందుకే తను నా మ్యాచ్‌ల్ని చూడదు. చూస్తే ఏదైనా కీడు జరుగుతుందనే బెంగ ఆమెకు... అందుకే మ్యాచ్ అయిపోగానే నేనే ఫోన్ చేసి చెప్పా. నేను గెలిచానని! అప్పుడే ఆమె మనసు కుదుటపడుతుంది. అమ్మా నేను కప్‌తో ఇంటికొస్తున్నాను. నీ జీవితంలో ఎప్పుడు ఎవరికీ ఇవ్వని హగ్ (ఆలింగనం) ఇవ్వాలి. –సోఫియా కెనిన్
Comments
Please login to add a commentAdd a comment